రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ దక్షిణ కొరియా పర్యటనను కొనసాగిస్తున్నారు. పర్యటనలో ఆరో రోజు భాగంగా ప్రముఖ గృహోపకరణాలు, నీరు మరియు గాలి శుద్ధి పరికరాల తయారీ సంస్థ కుకూ (Cuckoo) ఎలక్ట్రానిక్స్ ప్రతినిధులతో మంత్రి కీలక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీ ఎలక్ట్రానిక్స్ మరియు గృహోపకరణాల తయారీ రంగానికి ప్రధాన కేంద్రంగా ఎదుగుతోందని లోకేశ్ వివరించారు. ఇప్పటికే అంబర్, ఈప్యాక్ డ్యూరబుల్, డైకిన్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు తమ తయారీ యూనిట్లను ఏర్పాటు చేసి విజయవంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు.
భారత్‌లో తయారవుతున్న మొత్తం ఏసీలలో సుమారు 40 శాతం, టెలివిజన్లలో 35 శాతం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులు సమృద్ధిగా అందుబాటులో ఉండటంతో పాటు పరిశ్రమలకు అనుకూలమైన మౌలిక వసతులు, పోర్టులు, రహదారి మరియు రైల్వే కనెక్టివిటీ ఉన్నాయని వివరించారు.
శ్రీసిటీ, తిరుపతి ప్రాంతాల నుంచి ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్య దేశాలకు ఉత్పత్తులను సులభంగా ఎగుమతి చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. దక్షిణ భారతదేశంలో గృహోపకరణాలు, ముఖ్యంగా ఎయిర్ కండిషనర్లకు భారీ మార్కెట్ ఉందని, దీనిని దృష్టిలో పెట్టుకుని కుకూ ఎలక్ట్రానిక్స్ ఆంధ్రప్రదేశ్‌లో తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు.
ప్రపంచ తయారీ రంగంలో భారత్ విశ్వసనీయ భాగస్వామిగా ఎదుగుతోందని, కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల పారిశ్రామిక అనుకూల విధానాలు విదేశీ పెట్టుబడిదారులకు మరింత అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నాయని లోకేశ్ తెలిపారు. ఈ నేపథ్యంలో శ్రీసిటీ లేదా తిరుపతిలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కుకూ సంస్థ ప్రతినిధులను కోరారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలను పరిశీలించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని కుకూ ఎలక్ట్రానిక్స్ హెచ్‌వోడీ వెల్లడించారు.
అనంతరం దక్షిణ కొరియాకు చెందిన ఆటోమోటివ్ పవర్ ఎలక్ట్రానిక్స్, పాసివ్ కాంపొనెంట్స్ తయారీ సంస్థ మోటివ్ లింక్ (MOTIVELINK) సీఈవో కిమ్ కి-హాన్, ఇంటర్నేషనల్ సేల్స్ అండ్ రీసెర్చ్ జనరల్ మేనేజర్ బైద్య శర్మతో కూడా మంత్రి నారా లోకేశ్ సమావేశమయ్యారు. ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్ కాంపొనెంట్స్ తయారీ రంగాల్లో పెట్టుబడులు, తయారీ యూనిట్ల ఏర్పాటు, ఉపాధి అవకాశాల సృష్టిపై ఇరు పక్షాలు చర్చించినట్లు సమాచారం.
దక్షిణ కొరియా పర్యటన ద్వారా ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్, హోమ్ అప్లయెన్సెస్, అధునాతన తయారీ రంగాల్లో మరిన్ని విదేశీ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉందని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















