ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల మూల్యాంకన ప్రక్రియలో చోటుచేసుకున్న పరిణామాలపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. అత్యంత గోప్యంగా నిర్వహించాల్సిన జవాబు పత్రాలను ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉంచడం, అనధికార వ్యక్తులతో మూల్యాంకనం చేయించడం, నిబంధనలను పక్కన పెట్టడం వంటి అంశాలను ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు. యువత భవిష్యత్తుతో ముడిపడిన నియామక ప్రక్రియలో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు.
గ్రూప్-1 జవాబు పత్రాల మూల్యాంకనం అత్యంత భద్రత, గోప్యత మధ్య జరగాల్సి ఉన్నప్పటికీ.. ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకు అప్పగించినట్లు సీఎం ఆరోపించారు. జవాబు పత్రాలను ప్రైవేట్ ఈ-మెయిల్, గూగుల్ డ్రైవ్, వాట్సప్ వంటి మాధ్యమాల ద్వారా పంపడం, వ్యక్తిగత ల్యాప్‌టాప్‌లలో డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించడం వంటి అంశాలను ప్రస్తావించారు. ఇలాంటి విధానాలు పరీక్షల భద్రతపై తీవ్ర సందేహాలు కలిగిస్తాయని పేర్కొన్నారు.
మరో దశలో అనధికారికంగా ఎంపిక చేసిన వ్యక్తులను ఎవాల్యుయేటర్లుగా నియమించినట్లు సీఎం సభలో వివరించారు. వీరిలో ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, డ్రైవర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సెక్యూరిటీ సిబ్బంది, భవన నిర్మాణ కార్మికులు వంటి వారు ఉన్నారని తెలిపారు. అత్యున్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగాల ఎంపికకు సంబంధించిన పరీక్ష పత్రాలను అనుభవం లేని వ్యక్తులతో దిద్దించడం వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీసే చర్యగా అభివర్ణించారు.
మూల్యాంకన ప్రక్రియలో ఓఎంఆర్ స్లిప్‌లపైనా అనేక అనుమానాస్పద అంశాలను గుర్తించినట్లు ప్రభుత్వం పేర్కొంది. 734 స్లిప్‌లను పరిశీలించగా 718లో మార్పులు, ఆల్ట్రేషన్లు, ఓవర్‌రైటింగ్ వంటి అంశాలు గుర్తించినట్లు సభలో వెల్లడించారు. కొన్ని స్లిప్‌లపై సంతకాలు కూడా లేకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. జవాబు పత్రాల మూల్యాంకన కేంద్రంలో పలు రోజులపాటు సీసీ కెమెరాల పర్యవేక్షణ లేకపోవడం, మొబైల్ ఫోన్ల వినియోగాన్ని నియంత్రించకపోవడం వంటి అంశాలపైనా ప్రభుత్వం దృష్టి సారించింది.
ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఏపీపీఎస్సీలో సమూల మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలు, మేధావులు, నిపుణుల అభిప్రాయాలను తీసుకుని నియామక ప్రక్రియను మరింత పారదర్శకంగా, పటిష్ఠంగా తీర్చిదిద్దుతామని సీఎం స్పష్టం చేశారు. వ్యక్తుల ప్రయోజనాల కంటే యువత భవిష్యత్తుకు ప్రాధాన్యం ఇచ్చేలా వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
గ్రూప్-1 అవకతవకలకు బాధ్యులైన వారిపై సాధారణ చర్యలతో సరిపెట్టబోమని చంద్రబాబు స్పష్టం చేశారు. తప్పు చేయాలంటే భయపడేలా, భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి చర్యలకు పాల్పడకుండా కఠిన శిక్షలు ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జరిగిన పరిణామాలపై సమగ్రంగా విశ్లేషించి చట్టపరమైన తదుపరి చర్యలు చేపడతామని చెప్పారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















