సోమాలియా తీరంలో మరోసారి సముద్రపు దొంగల కదలికలు కలకలం రేపాయి. కామెరూన్ పతాకంతో ప్రయాణిస్తున్న ‘లుటుఫ్’ (Lutuf) అనే కార్గో నౌకను సముద్రపు దొంగలు హైజాక్ చేసినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. నౌకలో మొత్తం 10 మంది సిబ్బంది ఉండగా.. వారిలో ఆరుగురు భారతీయులు ఉన్నట్లు సమాచారం. మిగిలిన వారిలో తుర్కియే, జార్జియా, సెర్బియాకు చెందిన వారు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
తుర్కియే నుంచి మొగడిషూలోని సైనిక శిక్షణా కేంద్రానికి ఆయుధాలు, కమ్యూనికేషన్ పరికరాలు, శాటిలైట్ సామగ్రిని నౌక ద్వారా తరలిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. నౌక సోమాలియా తీరానికి సమీపంలో ఉండగా సముద్రపు దొంగలు దానిని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. చిన్న పడవలో ఇద్దరు వ్యక్తులు నౌకను సమీపించారు. అనంతరం వారు అక్కడి నుంచి తీరానికి వెళ్లిపోయిన కొద్దిసేపటికే ఆ ప్రాంతంలో వైమానిక దాడి జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో సుమారు ఎనిమిది మంది సాయుధ సముద్రపు దొంగలు నౌకపైకి చేరుకుని దానిని హైజాక్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనకు ముందు చిన్న పడవలో ఉన్న ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు సమాచారం. అయితే వారిపై జరిగిన వైమానిక దాడికి, నౌక హైజాక్‌కు ప్రత్యక్ష సంబంధం ఉందా? వారు సముద్రపు దొంగలతో సంబంధం ఉన్నవారా? అనే అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు.
నౌకలో ఆరుగురు భారతీయులు ఉన్నట్లు సమాచారం వెలువడటంతో వారి పరిస్థితిపై ఆందోళన నెలకొంది. ప్రస్తుతం వారు సముద్రపు దొంగల చెరలో ఉన్నట్లు తెలుస్తోంది. భారతీయ సిబ్బంది క్షేమంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు స్థానిక అధికారులు దర్యాప్తు చేపట్టారు. నౌక ఎక్కడికి తరలించబడింది? సిబ్బంది పరిస్థితి ఎలా ఉంది? హైజాక్ వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? వారి డిమాండ్లు ఏమిటి? అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
సోమాలియా తీర ప్రాంతం గతంలో సముద్రపు దొంగల దాడులకు ప్రధాన కేంద్రంగా నిలిచింది. అంతర్జాతీయ సముద్ర భద్రతా చర్యలతో ఇటీవలి కాలంలో ఈ తరహా ఘటనలు తగ్గినప్పటికీ.. వాణిజ్య నౌకల రాకపోకలు కొనసాగే ఈ ప్రాంతంలో భద్రతా సమస్యలు పూర్తిగా తొలగిపోలేదనే విషయాన్ని తాజా ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















