హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు మరింత ఆందోళనకరంగా మారుతున్నాయి. ఈ ప్రాంతంలో ప్రయాణిస్తున్న నౌకలపై దాడులు, కాల్పుల ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో.. భారతీయ నావికులు ఉన్న ఓ నౌకపై జరిగిన దాడికి సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 22న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను భారత నావికుల సమాఖ్య ఫార్వర్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (FSUI) విడుదల చేసింది.
పనామా జెండాతో ప్రయాణిస్తున్న కంటైనర్ నౌకను ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)కు చెందిన చిన్న బోట్లు చుట్టుముట్టినట్లు వీడియోలో కనిపిస్తోంది. అనంతరం నౌకపై కాల్పులు జరిపినట్లు దృశ్యాలు వెల్లడిస్తున్నాయి. అంతేకాకుండా రాకెట్ ప్రొపెల్డ్ గ్రనేడ్లను సైతం ప్రయోగించినట్లు నావికుల సమాఖ్య పేర్కొంది.
దాడి సమయంలో నౌకలోని సిబ్బంది ప్రాణభయంతో కంటైనర్ల మధ్యలో దాక్కున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. నౌకలో మొత్తం 22 మంది సిబ్బంది ఉండగా.. వారిలో 21 మంది భారతీయులేనని సమాచారం. కాల్పుల నేపథ్యంలో సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురైనప్పటికీ.. చివరకు అందరూ సురక్షితంగా బయటపడినట్లు భారత షిప్పింగ్ మంత్రిత్వ శాఖ అనంతరం వెల్లడించింది.
ఈ ఘటనపై భారత ప్రభుత్వం ఇరాన్ వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్లు అధికారులు తెలిపారు. తాజాగా వీడియోను విడుదల చేసిన FSUI.. హర్మూజ్ జలసంధిలో పరిస్థితి అంచనాలకు మించి ప్రమాదకరంగా మారుతోందని పేర్కొంది. ఈ వీడియోను ప్రధాని కార్యాలయం, కేంద్ర విదేశాంగ శాఖ, షిప్పింగ్ మంత్రిత్వ శాఖకు ట్యాగ్ చేస్తూ భారత నావికుల భద్రతకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని కోరింది.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం హర్మూజ్ జలసంధిపైనా తీవ్రంగా పడుతోంది. ఈ కీలక సముద్ర మార్గం ద్వారా భారీగా చమురు, ఇతర సరకు రవాణా జరుగుతుంది. దీంతో ఇక్కడ చోటుచేసుకునే దాడులు అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తున్నాయి.
ఐరాస నివేదిక ప్రకారం.. ఫిబ్రవరి 28 తర్వాత హర్మూజ్ జలసంధిలో జరిగిన దాడుల్లో కనీసం 15 మంది నావికులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. వీరిలో అత్యధికులు భారతీయులేనని తెలుస్తోంది. ప్రపంచ సముద్ర రవాణా రంగంలో భారతీయ నావికుల వాటా గణనీయంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నావికుల్లో దాదాపు 12.2 శాతం మంది భారతీయులేనని సంబంధిత గణాంకాలు సూచిస్తున్నాయి.
దీంతో హర్మూజ్ జలసంధిలో భద్రతా పరిస్థితులపై భారత నావికుల కుటుంబాల్లోనూ ఆందోళన నెలకొంది. కీలకమైన ఈ సముద్ర మార్గంలో నౌకల రాకపోకలు కొనసాగుతున్న నేపథ్యంలో.. భారతీయ నావికుల రక్షణకు మరిన్ని భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















