మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆర్థిక లావాదేవీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. హత్యకు సుపారీగా భారీ మొత్తంలో నగదు చెల్లింపులు జరిగినట్లు సీబీఐ దర్యాప్తులో వెలుగుచూసిన అంశాల ఆధారంగా మనీ లాండరింగ్ కోణాన్ని ఈడీ పరిశీలిస్తోంది. ఈ క్రమంలో పీఎంఎల్‌ఏ నిబంధనల కింద కేసు నమోదు చేసి శుక్రవారం పులివెందుల, హైదరాబాద్‌లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది.
కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి చెందిన హైదరాబాద్ కోకాపేట నివాసంతోపాటు పులివెందులలోని ఆయన ఇంట్లోనూ ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అలాగే దేవిరెడ్డి శివశంకరరెడ్డి, యాదటి సునీల్‌యాదవ్, షేక్ దస్తగిరి, ఎర్ర గంగిరెడ్డి నివాసాల్లోనూ సోదాలు కొనసాగాయి. మొత్తం ఏడు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ వెల్లడించింది.
అవినాష్‌రెడ్డి నివాసం నుంచి లెక్కల్లో చూపని రూ.24 లక్షల నగదుతోపాటు రెండు బ్యాంకు లాకర్ల తాళాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తెలిపింది. ఆస్తులు, బ్యాంకు లావాదేవీలు, నగదు చెల్లింపులకు సంబంధించిన వివరాలను అధికారులు పరిశీలించినట్లు సమాచారం.
వివేకానందరెడ్డి హత్యకు రూ.40 కోట్ల సుపారీకి ఒప్పందం కుదిరిందని, అందులో భాగంగా షేక్ దస్తగిరికి రూ.కోటి అడ్వాన్స్‌గా ఇచ్చినట్లు సీబీఐ దర్యాప్తులో పేర్కొన్న అంశాలపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది. ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి ద్వారా చేతులు మారింది, ఆ తర్వాత ఎక్కడికి తరలించారనే అంశాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
దస్తగిరికి ఇచ్చిన రూ.కోటిలో కొంత మొత్తాన్ని సునీల్ యాదవ్ అప్పుగా తీసుకున్నారని, మిగిలిన మొత్తాన్ని దస్తగిరి తన స్నేహితుడైన సయ్యద్ మున్నా వద్ద ఉంచినట్లు సీబీఐ దర్యాప్తులో వెల్లడైన అంశాలను ఈడీ పరిగణనలోకి తీసుకుంది. ఈ వ్యవహారంలో గతంలో స్వాధీనం చేసుకున్న నగదు, బంగారు ఆభరణాలకు సంబంధించిన వివరాలను కూడా పరిశీలిస్తోంది
వివేకా హత్య కేసులో నిందితుడైన దేవిరెడ్డి శివశంకరరెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డిని కూడా ఈడీ అధికారులు విచారించారు. దస్తగిరిని గతంలో బెదిరించినట్లు నమోదైన కేసు, అతడికి సంబంధించిన ఆరోపణలపై ప్రశ్నించినట్లు సమాచారం. దర్యాప్తులో భాగంగా ఆర్థిక లావాదేవీలు, సంబంధిత వ్యక్తులతో ఉన్న పరిచయాలు, ఆస్తుల వివరాలపై అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది.
మరోవైపు పులివెందులలో సోదాలు జరుగుతున్న సమయంలో అవినాష్‌రెడ్డి ఇంట్లో ఆయన లేకపోవడంతో కుటుంబ సభ్యుల సమక్షంలో తనిఖీలు నిర్వహించారు. పలు ఆస్తులకు సంబంధించిన పత్రాలపై అధికారులు వివరాలు సేకరించినట్లు సమాచారం.
వివేకానందరెడ్డి హత్యకు రాజకీయ ప్రాబల్యం, కుటుంబ రాజకీయ విభేదాలు తదితర అంశాలు కారణమయ్యాయని సీబీఐ అభియోగపత్రాల్లో పేర్కొన్న విషయాలను కూడా ఈడీ తన దర్యాప్తులో పరిగణనలోకి తీసుకుంటోంది. హత్యకు సంబంధించిన నేరం వెనుక జరిగినట్లు ఆరోపిస్తున్న ఆర్థిక లావాదేవీలే తమ దర్యాప్తులో కీలకంగా ఉన్నాయని ఈడీ వర్గాలు వెల్లడించినట్లు సమాచారం.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















