జగన్ ప్రభుత్వ హయాంలో మద్యం రవాణా కాంట్రాక్టుల వ్యవహారంలో నిబంధనల మార్పు, సబ్‌కాంట్రాక్టుల కేటాయింపు, నిధుల మళ్లింపు తదితర అంశాల్లో కారుమూరి కీలక పాత్ర పోషించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తులో వెల్లడైనట్లు అధికారులు పేర్కొన్నారు.
దర్యాప్తు ప్రకారం.. మద్యం డిపోల నుంచి దుకాణాలకు సరఫరా చేసే రవాణా వ్యవస్థలో మార్పులు చేసిన అనంతరం కాంట్రాక్టు సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్‌కు దక్కినట్లు ఈడీ గుర్తించింది. అనంతరం ఆ సంస్థ నుంచి సబ్‌కాంట్రాక్టు రూపంలో సుదర్శన్ కన్‌స్ట్రక్షన్‌కు పనులు అప్పగించారని, ఆ సంస్థ వెనుక కారుమూరి కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలు ఉన్నట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంది.
సుదర్శన్ కన్‌స్ట్రక్షన్ ఖాతాల్లోకి వచ్చిన నిధులు అక్కడి నుంచి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్, ఆయన భార్య కీర్తికి చేరినట్లు ఈడీ గుర్తించినట్లు సమాచారం. మొత్తం లావాదేవీలు సుమారు రూ.68 కోట్ల మేర ఉన్నట్లు దర్యాప్తులో తేలగా.. అందులో సుమారు రూ.15 కోట్ల నిధుల మూలాలను ఈడీ గుర్తించినట్లు పేర్కొంది.
మద్యం రవాణా కాంట్రాక్టులో కిలోమీటరుకు చెల్లించే రవాణా ఛార్జీల పెంపుపైనా దర్యాప్తు సంస్థ దృష్టి సారించింది. గతంలో ఒక్కో కేసుకు కిలోమీటరుకు రూ.19.68 చెల్లించగా.. కేంద్రీకృత విధానం అమల్లోకి వచ్చిన తర్వాత అది రూ.32.53కు పెరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ వ్యత్యాసం ద్వారా భారీగా అక్రమ లాభాలు ఆర్జించినట్లు ఈడీ ఆరోపిస్తోంది.
కుంభకోణం ద్వారా వచ్చిన నిధులను వివిధ మార్గాల్లో మళ్లించి ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఈడీ అనుమానిస్తోంది. కారుమూరి, ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన సుమారు రూ.37.7 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను ఇప్పటికే జప్తు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్‌లోని కోకాపేట, ఖాజాగూడ ప్రాంతాల్లోని స్థలాలు, అనకాపల్లి జిల్లాలోని గ్రానైట్ క్వారీ లీజు హక్కులు, గురుగ్రామ్‌లోని కమర్షియల్ యూనిట్, దిల్లీలోని ఫ్లాట్, బ్యాంకు నిల్వలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, వాహనాలు, వాచీలు తదితరాలు జప్తు చేసిన ఆస్తుల్లో ఉన్నట్లు ఈడీ పేర్కొంది.
ఇక హవాలా లావాదేవీలకు సంబంధించిన నోట్ తమకు లభించిందని, కారుమూరి నివాసంలో జరిగిన సోదాల్లో దాన్ని స్వాధీనం చేసుకున్నామని దర్యాప్తు సంస్థ వెల్లడించింది. ఈ పత్రం ఆధారంగా నిధుల మళ్లింపు మార్గాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపింది.
కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అప్పటి ఏపీఎస్‌బీసీఎల్ ఎండీ డి.వాసుదేవరెడ్డితో కారుమూరి నాగేశ్వరరావు పలుమార్లు మాట్లాడినట్లు సిట్ గతంలో సీడీఆర్ విశ్లేషణలో గుర్తించినట్లు దర్యాప్తు వివరాలు సూచిస్తున్నాయి. అలాగే కేసులోని పలువురు నిందితులతో వాసుదేవరెడ్డి సంబంధాలపై టవర్ లొకేషన్ ఆధారాలను సిట్ పరిశీలించింది.
వాసుదేవరెడ్డి, కారుమూరి కుటుంబ సభ్యులు సహా పలువురు నిందితులు 465 సందర్భాల్లో ఒకే ప్రాంతంలో ఉన్నట్లు టవర్ లొకేషన్ విశ్లేషణలో గుర్తించినట్లు దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. ఈ వివరాలను కూడా ఈడీ పరిశీలించి ఆధారాలను సేకరించినట్లు సమాచారం.
అదేవిధంగా సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్, సుదర్శన్ కన్‌స్ట్రక్షన్ మధ్య ఒప్పందం తర్వాత సునీల్ మరో భాగస్వామ్య ఒప్పందాన్ని పాత తేదీలతో రూపొందించినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఆ పత్రం నిజస్వరూపంపై దర్యాప్తు కొనసాగుతోంది.
మద్యం రవాణా కుంభకోణంలో నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరెవరికి చేరాయి, హవాలా మార్గాల్లో ఎంత మేరకు మళ్లాయి, వాటితో ఇంకా ఎలాంటి ఆస్తులు కొనుగోలు చేశారనే అంశాలపై ఈడీ దర్యాప్తును కొనసాగిస్తోంది. కారుమూరి అరెస్టుతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టైన నిందితుల సంఖ్య నాలుగుకు చేరినట్లు సమాచారం.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















