షెడ్యూల్డ్ ఏరియాల్లో గిరిజనుల భూహక్కులను పరిరక్షించే 1/70 చట్టంలో ఎలాంటి సవరణలు చేయకూడదని కూటమి ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఈ విషయంలో సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున గిరిజనులకు అనుకూలంగా అఫిడవిట్ దాఖలు చేసేందుకు అధికారులకు సమ్మతి తెలిపినట్లు తెలిసింది. ఇప్పటికే గిరిజన సంక్షేమశాఖ అధికారులు అఫిడవిట్ రూపకల్పనపై కసరత్తు పూర్తి చేసి, న్యాయనిపుణుల సలహాలను తీసుకున్నట్లు సమాచారం.
1970లో అమల్లోకి వచ్చిన ల్యాండ్ ట్రాన్స్‌ఫర్ రెగ్యులేషన్‌నే 1/70 చట్టంగా వ్యవహరిస్తారు. షెడ్యూల్డ్ ఏరియాల్లోని భూములు గిరిజనుల నుంచి గిరిజనేతరులకు బదిలీ కాకుండా ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది. గిరిజన కుటుంబంలో వారసులు లేకపోతే ఆ భూమి ప్రభుత్వానికి చెందుతుంది. గిరిజనేతరులకు బదిలీ చేయడంతో పాటు సంస్థలు, పరిశ్రమలకు కూడా ఆయా భూములను కేటాయించడంపై చట్టపరమైన పరిమితులు ఉన్నాయి.
అయితే 1970కు ముందే కొన్ని షెడ్యూల్డ్ ఏరియా భూములు గిరిజనేతరుల ఆధీనంలో ఉన్నట్లు అధికారులు గుర్తిస్తున్నారు. అలాంటి భూములను అనుభవిస్తున్నవారు వాటిని క్రయవిక్రయాలు చేసుకునేందుకు 1/70 చట్టం అడ్డంకిగా ఉందని పేర్కొంటూ చట్టం నుంచి తమను మినహాయించాలని కోరుతున్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌లో కొందరు గిరిజనేతరులు ఇంప్లీడ్ కావడంతో గిరిజన వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో చట్టాన్ని సవరించకుండా సమస్యకు పరిష్కారం చూపే మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. 1970కు ముందు గిరిజనేతరుల ఆధీనంలో ఉన్న భూముల వివరాలతో పాటు వివిధ ఐటీడీఏల పరిధిలో నమోదైన ఎల్‌టీఆర్ కేసుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. భూములను కోల్పోకుండా, 1/70 చట్టానికి భంగం కలగకుండా బాధితులకు ప్రత్యామ్నాయంగా షెడ్యూల్డ్ ఏరియా వెలుపల భూములు కేటాయించే ప్రతిపాదనపైనా పరిశీలన జరుగుతున్నట్లు తెలిసింది.
చట్ట సవరణకు బదులుగా చట్టపరమైన, పరిపాలనా మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించాలన్న దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు సమాచారం. దీనివల్ల గిరిజనుల భూహక్కులకు రక్షణ కల్పించడంతో పాటు 1970కు ముందు నుంచి భూములు అనుభవిస్తున్న గిరిజనేతరుల సమస్యకు కూడా ప్రత్యామ్నాయ పరిష్కారం చూపే అవకాశం ఉంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















