విద్యుత్ వాహనాల వినియోగం పెరుగుతున్న కొద్దీ వాటి ఛార్జింగ్‌కు అవసరమయ్యే విద్యుత్ డిమాండ్ కూడా గణనీయంగా పెరుగుతోంది. ఈవీల ఛార్జింగ్ కోసం విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలో నాలుగో స్థానంలో నిలిచింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ఈవీల ఛార్జింగ్‌కు 111.26 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగమైనట్లు కేంద్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ తాజా నివేదిక వెల్లడించింది.
దేశవ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరంలో ఈవీల ఛార్జింగ్‌కు 1,558.69 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగమైంది. ఇందులో తెలంగాణ వాటా 7.1 శాతంగా ఉంది. దేశంలో దిల్లీ 435.31 మిలియన్ యూనిట్లతో 27.9 శాతం వాటాతో తొలి స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర 386.62 మిలియన్ యూనిట్లతో 24.8 శాతం వాటాతో రెండో స్థానంలో ఉండగా.. కర్ణాటక 214.70 మిలియన్ యూనిట్లతో 13.8 శాతం వాటాతో మూడో స్థానంలో ఉంది. తెలంగాణ 111.26 మిలియన్ యూనిట్లతో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది.
రాష్ట్రంలో ఈవీల వినియోగం ప్రధానంగా హైదరాబాద్‌తో పాటు వరంగల్ వంటి నగరాల్లో ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లో ఈవీల సంఖ్య పెరగడంతో ఛార్జింగ్ కేంద్రాల వినియోగం కూడా అధికమవుతోంది. వ్యక్తిగత వాహనాలతో పాటు వాణిజ్య అవసరాలకు వినియోగించే విద్యుత్ వాహనాల సంఖ్య పెరగడం కూడా విద్యుత్ డిమాండ్‌పై ప్రభావం చూపుతోంది.
రాష్ట్రంలో ఈవీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో రానున్న రోజుల్లో ఛార్జింగ్ కోసం విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతుందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుకు అనుగుణంగా విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది.
ఈవీల వినియోగం పెరుగుతున్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా తగినన్ని ఛార్జింగ్ కేంద్రాలు అందుబాటులో లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. హైదరాబాద్, వరంగల్ వంటి నగరాల్లో కొంతమేర వసతులు అందుబాటులో ఉన్నప్పటికీ.. నగరాలను దాటి జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రయాణించే ఈవీ వాహనదారులకు ఛార్జింగ్ కేంద్రాల కొరత ఎదురవుతోంది.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఛార్జింగ్ మౌలిక వసతులు పరిమితంగా ఉండటంతో ఈవీల వినియోగంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. రహదారుల వెంట తగిన సంఖ్యలో ఫాస్ట్ ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తే దూరప్రాంత ప్రయాణాలు చేసే వాహనదారులకు వెసులుబాటు కలుగుతుంది.
దేశంలో ఈ-మొబిలిటీని వేగవంతం చేయడానికి కేంద్ర విద్యుత్ శాఖ 2024 సెప్టెంబరులో ఛార్జింగ్ మౌలిక వసతులకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈవీల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుతో పాటు వాటికి నిరంతర విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థ సామర్థ్యం పెంపు వంటి అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.
భవిష్యత్తులో ఛార్జింగ్ కేంద్రాల్లో విద్యుత్ వినియోగం ఎంత పెరుగుతుందన్న దానిపై ముందస్తు అంచనాలు రూపొందించడం కీలకం కానుంది. అవసరమైన చోట్ల ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ లైన్లు, గ్రిడ్ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చే అవకాశం ఉంటుంది.
ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల ఆవరణల్లోనూ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలనే సూచనలు వస్తున్నాయి. కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలు, అపార్ట్‌మెంట్లు, పార్కింగ్ ప్రాంతాలు, పెట్రోల్ బంకులు, జాతీయ రహదారుల వెంట ఛార్జింగ్ వసతులు విస్తరించడం ద్వారా ఈవీ వినియోగదారులకు మరింత సౌకర్యం కలగనుంది.
ఛార్జింగ్ మౌలిక వసతులు అందుబాటులోకి వస్తే ప్రజల్లో ఈవీలపై నమ్మకం మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో వాహనాల సంఖ్య పెరగడంతో పాటు విద్యుత్ వినియోగం కూడా భవిష్యత్తులో మరింత అధికమయ్యే అవకాశాలున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















