అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇచ్చిన మద్దతుకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. దేశ ప్రయోజనాలు, యువత భవిష్యత్తు కోసం తనకు అండగా నిలిచిన పార్టీ నేతలు, ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. కేంద్రం అనుమతి లభించి ఉంటే లండన్ నుంచి బోస్టన్‌కు వెళ్లి పలు కీలక సమావేశాల్లో పాల్గొనాల్సి ఉండేదని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన విద్యావిధానానికి అనుగుణంగా ప్రపంచంలోని అత్యుత్తమ విద్యాసంస్థలను తెలంగాణకు తీసుకురావడం తన అమెరికా పర్యటన ప్రధాన ఉద్దేశమని రేవంత్‌రెడ్డి వివరించారు. ఐవీ లీగ్ సహా అంతర్జాతీయంగా పేరొందిన విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుని తెలంగాణలో విద్య, నైపుణ్యాభివృద్ధి, పరిశోధన, ఆవిష్కరణలకు మరింత ప్రోత్సాహం కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
అమెరికా పర్యటనలో న్యూయార్క్‌తో పాటు పలు ప్రాంతాల్లో ప్రవాస తెలంగాణ ప్రజలతో సమావేశాలు, ప్రముఖ విద్యాసంస్థల ప్రతినిధులతో చర్చలు, పెట్టుబడులకు సంబంధించిన భేటీలు జరగాల్సి ఉన్నాయని సమాచారం. హైదరాబాద్‌ను అంతర్జాతీయ విద్య, పరిశోధన, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఈ పర్యటనను ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది.
ముఖ్యమంత్రికి అమెరికా పర్యటనకు అనుమతి లభించకపోయినా.. ఆయన ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వ అధికారుల బృందం ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సమావేశాలను కొనసాగించనుంది. హార్వర్డ్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ), నార్త్‌ఈస్ట్రన్ యూనివర్సిటీ, వర్జీనియా టెక్ తదితర సంస్థల ప్రతినిధులతో చర్చలు జరపనుంది. విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, సాంకేతికత, ఆవిష్కరణలకు సంబంధించిన భాగస్వామ్యాలపై అవగాహన ఒప్పందాలు ఖరారు చేసే అవకాశం ఉంది.
రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంపై ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (ఐఓసీ) యూఎస్‌ఏ, తెలంగాణ చాప్టర్లు ఆగ్రహం వ్యక్తం చేశాయి. విద్య, పెట్టుబడులు, ఆవిష్కరణలు, ఆర్థికాభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను రాజకీయ లేదా పరిపాలనా కారణాలతో అడ్డుకోవడం సరికాదని పేర్కొన్నాయి.
గుజరాత్ ముఖ్యమంత్రికి అమెరికా పర్యటనకు అనుమతి ఇచ్చి.. తెలంగాణ ముఖ్యమంత్రికి ఎందుకు నిరాకరించారో కేంద్రం స్పష్టం చేయాలని ఐఓసీ-యూఎస్‌ఏ వైస్‌ఛైర్మన్ జార్జ్ అబ్రహం ప్రశ్నించారు. అమెరికాలో రేవంత్‌రెడ్డికి స్వాగతం పలికేందుకు తెలంగాణకు చెందిన వేలాది మంది ఆసక్తి చూపారని ఐఓసీ ప్రతినిధులు తెలిపారు. కేంద్రం అనుమతి నిరాకరించినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ప్రపంచస్థాయి సంస్థలతో భాగస్వామ్యాల దిశగా ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















