డెరివేటివ్స్ మార్కెట్‌లో యువత, ముఖ్యంగా 30 ఏళ్లలోపు ట్రేడర్ల భాగస్వామ్యం వేగంగా పెరుగుతోంది. అయితే అధిక లాభాల కోసం ఈ విభాగంలోకి వస్తున్న వారిలో నష్టపోతున్న వారి సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సెబీ నిర్వహించిన అధ్యయనంలో డెరివేటివ్స్ ట్రేడింగ్‌లో పాల్గొంటున్న వారి వయసు, ఆదాయం, ప్రాంతం, పోర్ట్‌ఫోలియో విలువ, ట్రేడింగ్ స్థాయిని పరిశీలించింది.
ఈక్విటీ డెరివేటివ్స్ ట్రేడింగ్‌లో పాల్గొన్న వారిలో 30 ఏళ్లలోపు యువత వాటా 43 శాతానికి చేరింది. నాలుగేళ్ల క్రితం ఇది 31 శాతంగా ఉండేది. అయితే ఈ వర్గంలో నష్టపోయిన వారి శాతం కూడా అధికంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో 30 ఏళ్లలోపు ట్రేడర్లలో దాదాపు 89 శాతం మంది నష్టాలను చవిచూశారు. 60 ఏళ్లు దాటిన ట్రేడర్లలోనూ నష్టపోయిన వారి వాటా 81 శాతంగా నమోదైంది.
తక్కువ ఆదాయం ఉన్న వర్గాల్లో డెరివేటివ్స్ ట్రేడింగ్ మరింత ప్రమాదకరంగా మారుతున్నట్లు సెబీ అధ్యయనం వెల్లడించింది. వ్యక్తిగత డెరివేటివ్స్ ట్రేడర్లలో సుమారు మూడో వంతు మంది వార్షికంగా రూ.5 లక్షల్లోపు ఆదాయం కలిగినవారే. మొత్తం డెరివేటివ్స్ టర్నోవర్‌లో ఈ వర్గం వాటా 43 శాతంగా ఉండగా, మొత్తం నష్టాల్లో వారి వాటా 53 శాతానికి చేరింది. ఈ ఆదాయ వర్గానికి చెందిన దాదాపు 88 శాతం మంది ట్రేడర్లు నష్టపోయారు.
డెరివేటివ్స్ మార్కెట్ చిన్న పట్టణాల పెట్టుబడిదారులను కూడా ఎక్కువగా ఆకర్షిస్తోంది. వ్యక్తిగత ట్రేడర్లలో దాదాపు మూడింట రెండొంతుల మంది మెట్రో నగరాలకు వెలుపల ప్రాంతాలకు చెందినవారే. మొత్తం డెరివేటివ్స్ టర్నోవర్‌లో వారి వాటా సుమారు 50 శాతంగా ఉంది. మరోవైపు వ్యక్తిగత మ్యూచువల్ ఫండ్ ఆస్తుల్లో చిన్న పట్టణాల పెట్టుబడిదారుల వాటా దాదాపు నాలుగో వంతు మాత్రమే ఉండటం గమనార్హం.
చిన్న పోర్ట్‌ఫోలియోతో పెద్ద మొత్తాల్లో డెరివేటివ్స్ ట్రేడింగ్ చేస్తున్న వారి సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. 2025-26లో సుమారు 95 లక్షల మంది వ్యక్తిగత డెరివేటివ్స్ ట్రేడర్లకు రూ.1 లక్ష కంటే తక్కువ విలువైన ఈక్విటీ పోర్ట్‌ఫోలియోలు ఉన్నాయి. వీరి వాటా మొత్తం వ్యక్తిగత ట్రేడర్లలో 78 శాతం. అయితే మొత్తం డెరివేటివ్స్ టర్నోవర్‌లో వీరి వాటా 51 శాతంగా, మొత్తం నష్టాల్లో 70 శాతంగా ఉంది.
ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రూ.1 లక్ష కంటే తక్కువ విలువైన ఈక్విటీ పోర్ట్‌ఫోలియో ఉన్నప్పటికీ, రూ.1 కోటి కంటే ఎక్కువ విలువైన డెరివేటివ్స్ టర్నోవర్ చేసిన ట్రేడర్లు మొత్తం వ్యక్తిగత ట్రేడర్లలో 13 శాతంగా ఉన్నారు. మొత్తం నష్టాల్లో వీరి వాటా ఏకంగా 52 శాతంగా నమోదైంది.
షేర్లలో పెట్టుబడులు లేకుండానే నేరుగా డెరివేటివ్స్ మార్కెట్‌లోకి అడుగుపెడుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. దాదాపు 43 లక్షల మంది ట్రేడర్ల ఖాతాల్లో షేర్లు లేవు. వీరి వాటా వ్యక్తిగత డెరివేటివ్స్ మార్కెట్ భాగస్వాముల్లో 35 శాతంగా ఉంది.
అయితే మొత్తం వ్యక్తిగత డెరివేటివ్స్ ట్రేడర్ల సంఖ్య మాత్రం తగ్గింది. 2024-25లో 1.06 కోట్లుగా ఉన్న వారి సంఖ్య 2025-26లో 18 శాతం తగ్గి 87.5 లక్షలకు చేరింది. డెరివేటివ్స్ అనేది ప్రధానంగా రిస్క్‌ను నిర్వహించేందుకు, ధరల మార్పుల నుంచి రక్షణ పొందేందుకు ఉపయోగించే సాధనం. కానీ అధిక లాభాల ఆశతో అవగాహన లేకుండా ట్రేడింగ్ చేస్తే భారీ నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















