రాష్ట్రంలోని సుదీర్ఘ తీరప్రాంతాన్ని ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షించేందుకు ‘గ్రేట్ గ్రీన్‌వాల్’ ప్రాజెక్టును ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా తీర ప్రాంతాల వెంబడి భారీగా తాటివనాలను ఏర్పాటు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ తెలిపారు. తాటి కాయల సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో తాటి గింజల సేకరణ, నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు.
‘గ్రేట్ గ్రీన్‌వాల్’లో భాగంగా మొదటి అంచెలో మడ అడవులు, రెండో అంచెలో తాటివనాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పవన్‌కల్యాణ్ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా తీర ప్రాంతం వెంబడి 5,499 హెక్టార్లలో తాటివనాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం సుమారు 55 లక్షల తాటి గింజలు అవసరమవుతాయని, ఇప్పటికే 13 లక్షల గింజలను సేకరించినట్లు పేర్కొన్నారు. సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 1.65 లక్షల తాటి గింజలను నాటినట్లు తెలిపారు.
తీర ప్రాంతాల్లో తరచూ సంభవించే తుపాన్లు, పెనుగాలుల సమయంలో తాటి వనాలు సహజ రక్షణ వ్యవస్థగా పనిచేస్తాయని పవన్‌కల్యాణ్ వివరించారు. ఎత్తుగా పెరిగే తాటి చెట్లు బలమైన గాలుల వేగాన్ని తగ్గించడంలో ఉపయోగపడటంతో పాటు తీర గ్రామాలకు రక్షణ కల్పిస్తాయని తెలిపారు.
అలాగే తాటి చెట్ల వేర్లు నేలను గట్టిగా పట్టుకుని ఉండటం వల్ల సముద్ర తీరంలో మట్టి కోతను తగ్గించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. కఠినమైన వాతావరణ పరిస్థితుల్లోనూ తాటి చెట్లు పెరిగే సామర్థ్యం కలిగి ఉండటంతో తీర ప్రాంతాలకు ఇవి అనుకూలమైన వృక్ష జాతులని తెలిపారు.
విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలలో వివిధ జంతువులు, పక్షుల పునరుత్పత్తి కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని పవన్‌కల్యాణ్ తెలిపారు. మొత్తం 12 రకాల జంతువులు, పక్షులకు చెందిన 128 కొత్త జీవాలు జన్మించడం సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు.
అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన శాస్త్రీయ సంరక్షణ, పునరుత్పత్తి కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు. ముఖ్యంగా కృత్రిమ ఇంక్యూబేషన్ ద్వారా 10 ఎర్ర అడవి కోడి పిల్లలు, ఒక బ్లూ గోల్డ్ మకావ్ పిల్ల విజయవంతంగా పొదిగించడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఈ పునరుత్పత్తి కార్యక్రమంలో భాగస్వాములైన అటవీ అధికారులు, జూ సిబ్బందిని పవన్‌కల్యాణ్ అభినందించారు. రాష్ట్రంలో జీవ వైవిధ్యాన్ని పరిరక్షిస్తూ అరుదైన జంతువులు, పక్షుల సంపదను భావితరాలకు అందించేలా మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















