ఒకప్పుడు ఫోన్ అంటే కేవలం మాట్లాడుకోవడానికి, సమాచారాన్ని చేరవేసుకోవడానికి ఉపయోగించే సాధనం. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్, సోషల్ మీడియా కలిసి ప్రపంచాన్ని మన అరచేతిలోకి తీసుకొచ్చాయి. ఇదే సమయంలో సామాజిక మాధ్యమాలు కేవలం వినోదానికి పరిమితం కాకుండా వేలాది ఉద్యోగాలకు, కోట్ల రూపాయల వ్యాపారాలకు వేదికగా మారాయి. ముఖ్యంగా సృజనాత్మకత, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న యువతకు కొత్త కెరీర్ అవకాశాలను అందిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో డిజిటల్ స్టోరీ టెల్లింగ్ ఒక ప్రత్యేక కెరీర్ మార్గంగా ఎదుగుతోంది. ఏదైనా విషయాన్ని కేవలం రాత రూపంలో కాకుండా వీడియోలు, చిత్రాలు, శబ్దాలు, యానిమేషన్లు, గ్రాఫిక్స్ వంటి అంశాలను కలిపి ఆసక్తికరంగా ప్రజలకు చేరవేయడమే డిజిటల్ స్టోరీ టెల్లింగ్. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, ఫేస్‌బుక్, ఎక్స్ వంటి వేదికల ద్వారా కంటెంట్‌ను వేగంగా ప్రేక్షకులకు చేరవేయవచ్చు.
కంటెంట్ రంగంలో ఎన్నో అవకాశాలు:
కంటెంట్ క్రియేషన్‌కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. కంపెనీలు, మీడియా సంస్థలు, స్టార్టప్‌లు, స్థానిక వ్యాపారాలు తమ ఉత్పత్తులు, సేవలను ప్రచారం చేసుకునేందుకు డిజిటల్ నిపుణులపై ఆధారపడుతున్నాయి.కంటెంట్ క్రియేటర్, కంటెంట్ రైటర్, వీడియో ఎడిటర్, గ్రాఫిక్ డిజైనర్, మోషన్ గ్రాఫర్, పాడ్‌కాస్ట్ నిర్మాత, సోషల్ మీడియా నిర్వాహకుడు, డిజిటల్ మార్కెటింగ్ నిపుణుడు వంటి విభిన్న పాత్రల్లో అవకాశాలు లభిస్తున్నాయి. కెమెరా ముందు కనిపించాలనే అవసరం కూడా లేదు. మీ నైపుణ్యానికి తగ్గట్టు తెరవెనుక ఉండి కూడా మంచి కెరీర్ నిర్మించుకోవచ్చు.
మీ టాలెంట్‌ను చూపించండి :
వంటలు, ప్రయాణాలు, ఫిట్‌నెస్, విద్య, సాంకేతికత, ఫ్యాషన్, నటన, హాస్యం, ప్రేరణాత్మక అంశాలు.. ఇలా మీకు నచ్చిన ఏ రంగంలోనైనా కంటెంట్ రూపొందించవచ్చు. యూట్యూబ్‌లో చిన్న, పెద్ద వీడియోలు.. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో రీల్స్ ద్వారా ప్రేక్షకులను సంపాదించుకోవచ్చు.ఫాలోవర్లు, వీక్షణలు, ప్రేక్షకుల స్పందన పెరిగేకొద్దీ ప్రకటనలు, బ్రాండ్ ప్రమోషన్లు, స్పాన్సర్డ్ కంటెంట్ ద్వారా ఆదాయాన్ని పొందే అవకాశాలు కూడా ఉంటాయి.
తెరవెనుకా అవకాశాలే ఎక్కువ:
కెమెరా ముందు మాట్లాడటంపై ఆసక్తి లేనివారు ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, స్క్రిప్ట్ రైటింగ్, వాయిస్ ఓవర్ వంటి విభాగాల్లో రాణించవచ్చు. చిన్న రీల్స్ నుంచి దీర్ఘ వీడియోలు, డాక్యుమెంటరీల వరకు ఎడిటర్ల అవసరం ఉంది.వీడియో ఎడిటింగ్, శబ్ద రూపకల్పన, రంగుల సర్దుబాటు వంటి నైపుణ్యాలతో స్థానికంగానే కాకుండా ఇతర ప్రాంతాల క్లయింట్లతోనూ పనిచేయవచ్చు. అలాగే ఫొటో ఎడిటింగ్, డిజైన్ సాధనాలపై పట్టు సాధిస్తే థంబ్‌నెయిల్స్, సామాజిక మాధ్యమాల పోస్టర్లు రూపొందిస్తూ ఆదాయం పొందవచ్చు.
డిజిటల్ మార్కెటింగ్ మరో మార్గం:
చిన్న, మధ్యతరహా వ్యాపారాలకు ఇప్పుడు డిజిటల్ ప్రచారం కీలకంగా మారింది. రెస్టారెంట్లు, వస్త్ర దుకాణాలు, వ్యాయామశాలలు, విద్యా సంస్థలు, బొటిక్‌లు, స్థానిక వ్యాపారాల కోసం ప్రచార వీడియోలు రూపొందించడం ద్వారా ఆదాయం పొందవచ్చు.వ్యాపార సంస్థల సామాజిక మాధ్యమాల ఖాతాలను నిర్వహించడం, ప్రచార కార్యక్రమాలను రూపొందించడం, ప్రకటనలను నిర్వహించడం వంటి సేవలను అందించవచ్చు. అంతేకాకుండా వివిధ ఆన్‌లైన్ వాణిజ్య వేదికల్లోని ఉత్పత్తులను ప్రచారం చేసి, వాటి ద్వారా జరిగే విక్రయాలపై కమీషన్ పొందే అవకాశమూ ఉంది.
రాజకీయాల్లోనూ డిజిటల్ డిమాండ్ :
రాజకీయ రంగంలోనూ సామాజిక మాధ్యమాల ప్రాధాన్యం పెరిగింది. రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక డిజిటల్ బృందాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. పర్యటనలు, కార్యక్రమాలు, విధానాలు, ప్రచార కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వీడియోలు, పోస్టర్లు, ఇతర డిజిటల్ కంటెంట్ రూపొందిస్తున్నారు.దీంతో సోషల్ మీడియా నిర్వహణ, వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, డిజిటల్ ప్రచారం వంటి విభాగాల్లో నైపుణ్యం ఉన్నవారికి అవకాశాలు లభిస్తున్నాయి.
సొంత పేజీ నుంచి సొంత ఏజెన్సీ వరకు :
ముందుగా మీకు ఆసక్తి ఉన్న అంశంపై సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక పేజీని ప్రారంభించవచ్చు. వార్తలు, సినిమాలు, ఉద్యోగ సమాచారం, వినోదం, మీమ్స్, విద్య, స్థానిక అంశాలు.. ఇలా ఒక ప్రత్యేక అంశాన్ని ఎంచుకుని నిరంతరం కంటెంట్ అందిస్తే ప్రేక్షకులను సంపాదించుకోవచ్చు.
అనుభవం, పరిచయాలు, క్లయింట్లు పెరిగిన తర్వాత సొంత సోషల్ మీడియా మార్కెటింగ్ ఏజెన్సీని కూడా ప్రారంభించవచ్చు. కంటెంట్ రైటర్లు, వీడియో ఎడిటర్లు, డిజైనర్లు, ప్రకటనల నిపుణులతో బృందాన్ని ఏర్పాటు చేసుకుని సంస్థలకు డిజిటల్ సేవలు అందించవచ్చు.
అల్గారిథమ్‌లను అర్థం చేసుకుంటే మరో అవకాశం:
సోషల్ మీడియా వేదికల్లో ఏ రకమైన కంటెంట్‌కు ఎక్కువ ఆదరణ లభిస్తోంది? ఏ సమయంలో పోస్టు చేస్తే ఎక్కువ మంది చూస్తున్నారు? ప్రేక్షకులు ఏ అంశాలపై ఎక్కువగా స్పందిస్తున్నారు? వంటి విషయాలను విశ్లేషించే నిపుణులకూ మంచి డిమాండ్ ఉంది.అల్గారిథమ్‌ల మార్పులను గమనిస్తూ, ప్రేక్షకుల అభిరుచులను అధ్యయనం చేసి సరైన వ్యూహాలను రూపొందించగలిగితే కంటెంట్ క్రియేటర్లు, బ్రాండ్లు, సంస్థలకు విలువైన సేవలు అందించవచ్చు.
సృజనాత్మకతకు సాంకేతిక నైపుణ్యం తోడైతే డిజిటల్ ప్రపంచంలో అవకాశాలకు హద్దులు ఉండవు. అయితే ఒక్కరోజులోనే విజయం వస్తుందని ఆశించకుండా.. నిరంతరం నేర్చుకుంటూ, కొత్త విషయాలను ప్రయత్నిస్తూ, బలమైన పరిచయ వలయాన్ని నిర్మించుకోవాలి. అప్పుడు సోషల్ మీడియాలో మీ రీచ్ మాత్రమే కాదు.. మీ కెరీర్ కూడా మరింత ఎత్తుకు చేరుతుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















