పెట్రోలు ధరలు, నిర్వహణ ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు చూస్తున్నారు. కొందరు సీఎన్‌జీ, ఎల్‌పీజీని ఎంచుకుంటుంటే.. మరికొందరు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే కొత్త వాహనం కొనుగోలు చేయకుండా పాత పెట్రోల్ వాహనాన్నే ఎలక్ట్రిక్ వాహనంగా మార్చుకునే ‘రెట్రోఫిట్’ విధానం కూడా అందుబాటులోకి వస్తోంది. ముఖ్యంగా రోజూ ఎక్కువ దూరం ప్రయాణించే క్యాబ్‌లు, ఆటోలు, డెలివరీ వాహనాలు వంటి వాటికి ఇది ఉపయోగకరంగా ఉండొచ్చని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు.
రోజూ కనీసం 50 కిలోమీటర్లకు పైగా ప్రయాణించే పెట్రోల్ వాహనాలకు రెట్రోఫిట్ చేయడం ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండొచ్చు. కనీసం ఏడెనిమిదేళ్లు దాటినా మంచి కండిషన్‌లో ఉన్న వాహనాలను కూడా పరిగణించవచ్చు. అయితే కిట్ అమర్చే ముందు వాహనం మొత్తం పరిస్థితిని అంచనా వేయాలి. వాహనం బాడీకి తుప్పు పట్టిందా? ఫ్రేమ్, ఛాసిస్ దృఢంగా ఉన్నాయా? మరో పదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం వాహనాన్ని ఉపయోగించగలమా? ఎంచుకున్న మోడల్‌కు అనువైన ధ్రువీకరించిన ఈవీ కిట్ ఉందా? భవిష్యత్తులో అవసరమైన విడిభాగాలు అందుబాటులో ఉంటాయా? వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.
ఈవీ కిట్ అమర్చేటప్పుడు ఏఆర్‌ఏఐ, సీఐఆర్‌టీ, ఏసీఏటీ, జీఏఆర్‌సీ వంటి సంబంధిత సంస్థల గుర్తింపు ఉన్న రెట్రోఫిట్ కేంద్రాలను మాత్రమే ఎంచుకోవాలి. రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ లేదా ఆర్టీఓ నిబంధనలకు అనుగుణంగా పనిచేసే అధీకృత కేంద్రాల్లోనే మార్పులు చేయించుకోవడం సురక్షితం. అనధికార కిట్లు లేదా అనుభవం లేని వ్యక్తులతో మార్పులు చేయించడం వల్ల వాహనం భద్రతకు ముప్పు ఏర్పడొచ్చు. ముఖ్యంగా బ్యాటరీ, వైరింగ్, బ్రేకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ నియంత్రణ వ్యవస్థలను నిపుణులతోనే తనిఖీ చేయించాలి.
కార్లను ఈవీలుగా మార్చే రెట్రోఫిట్ ఖర్చు ప్రారంభ స్థాయిలోనే సుమారు రూ.3 లక్షలు ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల వ్యక్తిగత వినియోగం కంటే రోజూ ఎక్కువ దూరం తిరిగే క్యాబ్‌లు, డెలివరీ వాహనాలు వంటి వాణిజ్య వాహనాలకు ఇది ఆర్థికంగా ఎక్కువగా ఉపయోగపడొచ్చు.
పాత వాహనాన్ని ఈవీగా మార్చే ముందు సంబంధిత ఆర్టీఓ కార్యాలయంలో అవసరమైన అనుమతులు తీసుకోవాలి. వాహనం ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, అమర్చబోయే ఎలక్ట్రిక్ కిట్ వివరాలను సమర్పించి ముందస్తు అనుమతి పొందాలి. అనుమతి వచ్చిన తర్వాతే అధీకృత రెట్రోఫిట్ కేంద్రంలో మార్పులు చేయించుకోవాలి. కిట్ అమర్చిన అనంతరం వాహనం పనితీరు, బ్రేకులు, ఎలక్ట్రానిక్ వ్యవస్థలను కేంద్రం తనిఖీ చేస్తుంది. అనంతరం ఇన్వాయిస్‌తో పాటు ఫిట్‌నెస్, కన్వర్షన్ సర్టిఫికెట్ జారీ చేస్తుంది.
ఆ సర్టిఫికెట్, వాహనాన్ని తిరిగి ఆర్టీఓ కార్యాలయానికి తీసుకెళ్లాలి. మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పరిశీలించిన తర్వాత ఆర్సీలో ఇంధన రకాన్ని ఈవీగా మార్చి ఎండార్స్‌మెంట్ చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే వాహనం అధికారికంగా ఎలక్ట్రిక్ వాహనంగా పరిగణించబడుతుంది. బీమా వివరాలను కూడా మార్చిన వాహనానికి అనుగుణంగా నవీకరించుకోవాలి.
వాహనం తయారైన సమయంలో ఉన్న ఇంజిన్ లేదా ఇంధన వ్యవస్థను తొలగించి, దాని స్థానంలో కొత్త సాంకేతికతను అమర్చడాన్ని రెట్రోఫిట్ అంటారు. పెట్రోల్ వాహనాలకు సీఎన్‌జీ కిట్లు అమర్చడం కూడా ఇదే విధానంలోకి వస్తుంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ కన్వర్షన్ కిట్లు అందుబాటులోకి రావడంతో పాత వాహనాలను ఈవీలుగా మార్చుకునే అవకాశంపై ఆసక్తి పెరుగుతోంది.
హైదరాబాద్‌లో అత్తాపూర్, బోయగూడ, నాగోల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో సీఎన్‌జీ కిట్ల కోసం ప్రభుత్వ ఆమోదం పొందిన ఆటో గ్యాస్ సర్వీస్ కేంద్రాలు ఉన్నాయి. ఈవీ కన్వర్షన్ కేంద్రాలు కూడా క్రమంగా అందుబాటులోకి వస్తున్నాయి. బొల్లారం, ఎల్బీనగర్, తెల్లాపూర్ ప్రాంతాల్లో బైక్‌లు, ఆటోలకు ఈవీ మార్పిడులు చేస్తున్నారు. ఆటోలు, ఇతర వస్తు రవాణా వాహనాలకు రెట్రోఫిట్ చేసే ప్రభుత్వ ఆమోదిత సంస్థలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















