డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు జెట్టీ నుంచి ఈ నెల 3న సముద్రంలో వేటకు వెళ్లి ఆచూకీ లేకుండా పోయిన ఏడుగురు మత్స్యకారులు ఎట్టకేలకు సురక్షితంగా తీరానికి చేరుకున్నారు. 23 రోజుల ఉత్కంఠకు తెరదించుతూ బుధవారం ఉదయం పశ్చిమబెంగాల్ తీరంలోని దిగా ప్రాంతానికి చేరుకున్నారు. కోల్‌కతాకు చెందిన ఓ బోటు వీరిని గుర్తించి శంకర్‌పూర్ ఫిషింగ్‌హార్బర్ వద్దకు తీసుకొచ్చింది. మత్స్యకారులు క్షేమంగా ఉన్నారన్న సమాచారం తెలియడంతో కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
కొమరగరిపట్నానికి చెందిన రామకృష్ణవర్మకు చెందిన బోటులో ఆయనతో పాటు ఓడలరేవుకు చెందిన కొల్లాటి శ్రీనుబాబు, ఏసుదాసు, పాలెపు శాంతారావు, కర్రి రాముడు, పశువుల్లంకకు చెందిన కాటాడి సతీష్‌కుమార్, కాకినాడ జిల్లాకు చెందిన సంగాడి తాతారావు సముద్రంలోకి వెళ్లారు. ఈ నెల 4న బోటు క్లచ్‌ప్లేట్లు పాడయ్యాయి. వాటిని బాగుచేసిన తర్వాత గేర్‌బాక్సు కూడా దెబ్బతింది. మరమ్మతులు పూర్తిచేసుకుని తిరుగు ప్రయాణం ప్రారంభించినా.. 50 నాటికల్ మైళ్ల దూరం వచ్చేసరికి ఇంజిన్ పూర్తిగా పనిచేయకుండా పోయింది.
సమీపంలో మరో బోటు కనిపించకపోవడంతో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సముద్రంలో గాలుల తీవ్రతకు బోటు పశ్చిమబెంగాల్ వైపు కొట్టుకుపోయింది. ఎండ, వాన, ఆకలిని తట్టుకుంటూ రోజుల తరబడి సముద్రంలోనే ఉండిపోయారు. చివరకు బుధవారం ఉదయం దిగా ప్రాంతానికి చేరుకోగా కోల్‌కతాకు చెందిన బోటు వీరిని గుర్తించి రక్షించింది.
వేటకు బయలుదేరే సమయంలో 15 రోజులకు సరిపడా ఆహార పదార్థాలు తీసుకెళ్లారు. అయితే బోటు పాడవడంతో వాటిని పొదుపుగా వినియోగిస్తూ రెండ్రోజులకోసారి ఆహారం తీసుకున్నామని మత్స్యకారులు తెలిపారు. తీరానికి చేరిన తర్వాత కోల్‌కతా బోటు యజమాని వారికి ఆహారం అందించారు.
సెల్‌ఫోన్ సిగ్నల్స్ అందుబాటులో లేకపోవడంతో మత్స్యకారులు తమ వద్ద ఉన్న శాటిలైట్ ఫోన్ ద్వారా శంకర్‌పూర్‌లోని బోటు యజమానిని సంప్రదించారు. తాము ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బోటును రక్షించి తీరానికి తీసుకొస్తున్నామని ఆయన కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దీంతో బోటు యజమాని రామకృష్ణవర్మ తన భార్య లక్ష్మికి ఫోన్ చేసి తాము క్షేమంగా ఉన్నట్లు తెలిపారు.
మత్స్యకారుల ఆచూకీ కోసం రాష్ట్ర ప్రభుత్వం నేవీ, కోస్ట్‌గార్డ్, సెంట్రల్ మెరైన్ విభాగాలతో సమన్వయం చేసింది. పశ్చిమబెంగాల్ కోస్ట్‌గార్డ్, స్థానిక అధికారులను అప్రమత్తం చేసింది. శంకర్‌పూర్ ఫిషింగ్‌హార్బర్ సమీపంలో బోటును గుర్తించి ఏడుగురు మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చడంతో కుటుంబాల్లో ఆనందం నెలకొంది.
బాధిత మత్స్యకారులతో బుధవారం మధ్యాహ్నం ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడినట్లు బోటు యజమాని రామకృష్ణవర్మ తెలిపారు. మత్స్యకారుల ఆరోగ్యం, క్షేమం గురించి ప్రధాని ఆరా తీశారని చెప్పారు. శంకర్‌పూర్ జెట్టీ వద్ద అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తారని భరోసా ఇచ్చినట్లు తెలిపారు.
మత్స్యకారుల ఆచూకీ లభించిందని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. బోటు యజమాని సోదరుడు భవానీప్రసాద్‌తో మాట్లాడి వారి క్షేమ సమాచారాన్ని నిర్ధారించుకున్నామని తెలిపారు. ఏడుగురినీ త్వరలో స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మత్స్యకారులు సురక్షితంగా ఉండటంపై హర్షం వ్యక్తం చేసి, గాలింపు బృందాలు, అధికార యంత్రాంగాన్ని అభినందించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















