కరోనా – లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికులకు అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్న నటుడు సోనూ సూద్ మరోసారి తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. ఇటీవల నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదలతో తీవ్రంగా నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు ఆయన స్వయంగా రంగంలోకి దిగారు. నిత్యావసర వస్తువులు, సహాయక సామగ్రితో నేపాల్ రాజధాని కాఠ్‌మాండూకు చేరుకున్న సోనూ సూద్.. పునరావాస కేంద్రాలను సందర్శించి బాధితులను పరామర్శిస్తున్నారు.
వరదల కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు అనేక కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. ముఖ్యంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల పరిస్థితి తనను తీవ్రంగా కలచివేసిందని సోనూ సూద్ తెలిపారు.
పునరావాస కేంద్రంలో క్రిస్టినా అనే ఎనిమిదేళ్ల చిన్నారిని కలిసిన విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన తమ్ముడితో ఉన్న ఆ చిన్నారి తన వైపు చూసి నవ్వుతూ ‘అంతా సర్దుకుంటుంది’ అని చెప్పిందని తెలిపారు. ఆ చిన్నారి ధైర్యం తనను కదిలించిందని చెప్పారు. తాను కారు ఎక్కే వరకు ఆ పాప తన వెంటే ఉందని, ఆమెను దత్తత తీసుకోవాలనిపించిందని, అయితే ఆ సమయంలో ఏమీ చేయలేని పరిస్థితి తనను బాధించిందని సోనూ సూద్ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం సురక్షిత ప్రాంతాల్లో ఉన్నవారు తమకు వీలైనంత సహాయం చేయాలని ఆయన కోరారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ విపత్తుల్లో చిక్కుకున్న కుటుంబాల కోసం కొంత సమయం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. తమకు చేతనైనంత విరాళాలు అందించి బాధితులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
విపత్తుల సమయంలో బాధితులను ఆదుకోవడం ప్రభుత్వం, మంత్రుల బాధ్యత మాత్రమే కాదని.. ఒక మనిషిగా, భారతీయుడిగా మనందరి బాధ్యత అని సోనూ సూద్ పేర్కొన్నారు. తమ ఇళ్లను, కుటుంబ సభ్యులను, బాల్యాన్ని కోల్పోయిన చిన్నారులకు కొత్త జీవితాన్ని అందించేందుకు అందరూ కలిసి ముందుకు రావాలని కోరారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















