పట్టణ ప్రాంతాల్లో సొంత ఇల్లు లేని వారికి కొత్త తరహాలో టిడ్కో గృహ సముదాయాలను నిర్మించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. తక్కువ స్థలంలో ఎక్కువ కుటుంబాలకు ఇళ్లు అందించే లక్ష్యంతో జీ+8, జీ+10, జీ+12, జీ+14 తరహాలో బహుళ అంతస్తుల భవనాలను నిర్మించనున్నారు. ఆయా ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న స్థలం, లబ్ధిదారుల సంఖ్యను బట్టి ఎన్ని అంతస్తుల భవనాలు నిర్మించాలనేది నిర్ణయించనున్నారు.
కొత్తగా నిర్మించే టిడ్కో ఇళ్లన్నీ 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండేలా ప్రతిపాదించారు. లబ్ధిదారులకు సౌకర్యంగా లిఫ్ట్, పార్కింగ్ వంటి వసతులు కల్పించనున్నారు. భవనాల స్టిల్ట్ ప్రాంతంలో దుకాణాలు, వాహనాల పార్కింగ్, గ్రౌండ్ ఫ్లోర్‌లో అంగన్‌వాడీ కేంద్రాలు, బ్యాంకులు, ఇతర వాణిజ్య సముదాయాలను ఏర్పాటు చేయాలని డిజైన్‌లో ప్రతిపాదించారు.
ఒక్కో టవర్‌లో భవన పరిమాణాన్ని బట్టి భారీ సంఖ్యలో ఫ్లాట్లు ఉండనున్నాయి. ఎస్+జీ+8లో గరిష్ఠంగా 2,040, ఎస్+జీ+10లో 2,496, ఎస్+జీ+12లో 2,952, ఎస్+జీ+14లో 3,408 ఫ్లాట్లు నిర్మించే అవకాశం ఉంది. ప్రజలు నివసించే ప్రాంతాలకు సమీపంలోనే నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
నిర్మాణ వ్యయం పెరగడంతో కొత్త టిడ్కో ఇళ్ల ధరలు గతంలో కంటే ఎక్కువగా ఉండనున్నాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం జీ+8 భవనంలో ఒక్కో ఫ్లాటు ధర రూ.17.51 లక్షలు, జీ+10లో రూ.16.52 లక్షలు, జీ+12లో రూ.16.14 లక్షలు, జీ+14లో రూ.15.70 లక్షలుగా ప్రతిపాదించారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాగా రూ.3 లక్షలు ఉండగా, మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారులు చెల్లించేలా ప్రతిపాదన రూపొందించారు.
అంతస్తులు పెరిగే కొద్దీ చదరపు అడుగుపై నిర్మాణ వ్యయం తగ్గుతుందని అధికారులు అంచనా వేశారు. జీ+8లో చదరపు అడుగుకు రూ.3,100, జీ+10లో రూ.3,000, జీ+12లో రూ.2,985, జీ+14లో రూ.2,945గా వ్యయం లెక్కించారు.
2017లో జీ+3 తరహాలో చేపట్టిన టిడ్కో గృహ సముదాయాల్లో దాదాపు 3.05 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు. వీటిలో సుమారు 80 శాతం ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించారు. మిగిలిన ఇళ్ల నిర్మాణాన్ని ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అనంతరం కొత్త తరహా బహుళ అంతస్తుల గృహ నిర్మాణాలను చేపట్టనుంది.
పట్టణ ప్రాంతాల్లో కొత్త ఇళ్లకు ఉన్న డిమాండ్‌ను గుర్తించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేకు స్పందన వస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 24 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. గుంటూరు జిల్లా నుంచి అత్యధికంగా 11,185 దరఖాస్తులు వచ్చాయి. నెల్లూరు నుంచి 4,590, ఎన్టీఆర్ జిల్లా నుంచి 2,849, ప్రకాశం నుంచి 2,122, కర్నూలు నుంచి 1,338 దరఖాస్తులు అందాయి. మిగిలిన జిల్లాల్లో 50 నుంచి 500 వరకు దరఖాస్తులు నమోదయ్యాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















