గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో వెలుగుచూస్తున్న గణాంకాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా మలక్‌పేట, యాకుత్‌పురా నియోజకవర్గాల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్ల సంఖ్యతో పోలిస్తే.. ప్రస్తుత తొలగింపు ముసాయిదా జాబితాలో చేర్చిన ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
హైదరాబాద్ నగరంలోని 15 నియోజకవర్గాలను పరిశీలిస్తే.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 21,72,111 ఓట్లు పోలయ్యాయి. తాజాగా సర్ తొలగింపు ముసాయిదాలో ఏకంగా 19,41,444 మంది ఓటర్లను చేర్చారు. ఇందులో గైర్హాజరు, నివాసం మారిన వారు, మరణించిన వారు, ఇతర కారణాలతో గుర్తించలేని వారి వివరాలను పరిశీలిస్తున్నారు.
మలక్‌పేటలో పరిస్థితి మరింత గమనార్హంగా ఉంది. 2026 జూన్ నాటికి అక్కడ 3,30,191 మంది ఓటర్లు ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 1,31,354 మంది, 2024 లోక్‌సభ ఎన్నికల్లో 1,35,807 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ప్రస్తుత తొలగింపు ముసాయిదాలో 1,47,799 పేర్లు ఉండటం చర్చకు దారితీస్తోంది. మొత్తం ఓటర్లలో దాదాపు 44.76 శాతం మంది ఈ కేటగిరీలోకి వచ్చినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.
యాకుత్‌పురాలోనూ ఇదే తరహా పరిస్థితి కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో 3,74,948 మంది ఓటర్లు ఉండగా.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 1,39,990 ఓట్లు, 2024 లోక్‌సభ ఎన్నికల్లో 1,56,341 ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం తొలగింపు ముసాయిదాలో 1,54,982 మంది పేర్లు చేరాయి.
ఈ రెండు నియోజకవర్గాల్లోనూ ప్రతి పది మంది ఓటర్లలో నలుగురికి పైగా పేర్లు తొలగింపు ముసాయిదాలో ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణంగా ఒక నియోజకవర్గంలో నమోదైన ఓటర్ల సంఖ్య ఆధారంగానే పోలింగ్ శాతాన్ని లెక్కిస్తారు. భారీ సంఖ్యలో గైర్హాజరు, ఇతర ప్రాంతాలకు తరలిపోయిన లేదా మరణించిన ఓటర్లు జాబితాలో ఉంటే.. పోలింగ్ శాతంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇదిలా ఉండగా.. సర్ తొలగింపు ముసాయిదా జాబితా ఆధారంగా ఓటర్ల వివరాలను బూత్ స్థాయి అధికారులు పరిశీలిస్తున్నారు. బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లు నివాసం మారారా? మరణించారా? అందుబాటులో ఉన్నారా? వంటి వివరాలను సేకరిస్తున్నారు. అవసరమైన చోట అభ్యంతరాలు, క్లెయిమ్‌లను స్వీకరిస్తూ నోటీసులు కూడా జారీ చేస్తున్నారు.
ముసాయిదా జాబితాలో పేరు ఉండటం అంటే ఓటు శాశ్వతంగా తొలగిపోయినట్లు కాదని అధికారులు, నేతలు చెబుతున్నారు. అభ్యంతరాలు, క్లెయిమ్‌ల పరిశీలన పూర్తయిన తర్వాత తుది ఓటర్ల జాబితా వెలువడనుంది. అందువల్ల ప్రస్తుతం ఉన్న గణాంకాలను తుది తొలగింపుగా పరిగణించడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అయితే మలక్‌పేట, యాకుత్‌పురాలో గత ఎన్నికల్లో పోలైన ఓట్ల కంటే తొలగింపు ముసాయిదాలో ఉన్న పేర్లే ఎక్కువగా ఉండటంపై కాంగ్రెస్ సీనియర్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ గణాంకాలను సమగ్రంగా పరిశీలించి, అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా చూడాలని వారు కోరుతున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















