రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ భూములు, సాగేతర భూములు, స్థిరాస్తుల ప్రభుత్వ మార్కెట్ విలువలను సవరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాలు, జాతీయ రహదారుల పరిసరాలు, మండల కేంద్రాలు, పట్టణాలకు సమీప ప్రాంతాలను మూడు వర్గాలుగా విభజించి విలువలను పెంచాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ బాహ్య వలయ రహదారి (ఓఆర్‌ఆర్) పరిధిలో బహిరంగ మార్కెట్ ధరలు, ప్రభుత్వ విలువల మధ్య భారీ వ్యత్యాసం ఉండటంతో కొత్త ధరలను మార్కెట్‌కు అనుగుణంగా సవరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రస్తుతం ఎకరా కనిష్ఠ ప్రభుత్వ విలువ రూ.1.75 లక్షలు ఉండగా దాన్ని రూ.2.75 లక్షలకు పెంచే అవకాశం ఉంది. ఓఆర్‌ఆర్ లోపల ఉన్న భూముల కనిష్ఠ విలువను రూ.8.75 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచాలని అధికారులు ప్రతిపాదిస్తున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్‌లో ఎకరా ధరలు రూ.70 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు పలుకుతుండగా, ప్రభుత్వ విలువలు చాలా తక్కువగా ఉండటంతో వాటిని కూడా భారీగా పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
అదేవిధంగా అపార్ట్‌మెంట్ల చదరపు అడుగు విలువను కూడా 75 శాతం వరకు పెంచాలని యోచిస్తోంది. ప్రస్తుతం రూ.3,500 నుంచి రూ.4 వేల మధ్య ఉన్న ప్రాంతాల్లో చదరపు అడుగు విలువను దాదాపు రూ.6 వేల వరకు పెంచే అవకాశం ఉంది. వాణిజ్య ప్రాంతాలు, హైరైజ్డ్ భవనాలు, విల్లాల మార్కెట్ ధరలను పరిగణనలోకి తీసుకుని ప్రాంతాలవారీగా సవరణలు చేపట్టనున్నారు.
ఈ కొత్త ధరలు అమల్లోకి వస్తే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు ఏటా అదనంగా రూ.1,500 కోట్ల వరకు ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రజలపై ఒక్కసారిగా భారం పడకుండా అమలు చేయాలని సూచించినట్లు సమాచారం. మే 28 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలను అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















