దేశంలోని ప్రధాన మహానగరాలతో పోటీపడుతూ హైదరాబాద్‌లో నేరాల సంఖ్య వేగంగా పెరుగుతున్నట్లు జాతీయ నేర నమోదు సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) 2024 నివేదిక స్పష్టం చేసింది. ముఖ్యంగా బాల నేరాలు, సైబర్ మోసాలు, ఆర్థిక నేరాలు, మహిళలపై వేధింపులు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయని నివేదిక వెల్లడించింది. కుటుంబ పర్యవేక్షణ లోపం, ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్‌లు, మత్తు పదార్థాల ప్రభావంతో చిన్నారులు నేరాల బాట పడుతున్నారనే విషయం మరింత కలవరపెడుతోంది.
బాల్యం గాడితప్పుతోంది..
తెలిసీతెలియని వయసులోనే కొంతమంది బాలలు స్నాచింగ్‌లు, దొంగతనాలు, డ్రగ్ స్మగ్లింగ్‌లాంటి నేరాలకు పాల్పడుతున్నారు. చిన్ననేరాలతో ప్రారంభమైన ఈ ప్రయాణం హత్యలు, అత్యాచారాల వరకు వెళ్లడం పోలీసులను కూడా ఆందోళనకు గురిచేస్తోంది. 2023లో హైదరాబాద్‌లో జువెనైల్ నేరాలకు సంబంధించిన 180 కేసులు నమోదుకాగా.. 2024 నాటికి అవి 316కి పెరగడం తీవ్ర పరిస్థితిని ప్రతిబింబిస్తోంది. వీరిలో ఎక్కువమంది 12-14 ఏళ్ల వయస్సు గల వారే కావడం గమనార్హం. తల్లిదండ్రులకు దూరంగా ఉండే పిల్లలే అధికంగా నేరాలకు పాల్పడుతున్నట్లు నివేదిక పేర్కొంది.
ఆర్థిక మోసాలు.. సైబర్ మాయలు
తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయన్న ఆశతో అమాయక ప్రజలు మోసగాళ్ల బారిన పడుతున్నారు. సొంతిల్లు, వ్యాపార భాగస్వామ్యం, తక్కువ ధరకు బంగారం వంటి పేర్లతో కోట్ల రూపాయలు దోచుకుంటున్న సైబర్ కేటుగాళ్లు రాజధానిలో విస్తరిస్తున్నారు. 2024లో 7,771 ఆర్థిక నేరాల కేసులతో ముంబయి దేశంలో మొదటి స్థానంలో ఉండగా.. హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. సైబర్ నేరాల్లో 4,009 కేసులతో దేశంలో మూడో స్థానంలో ఉంది.
నేరాలు పెరిగినా.. ఛార్జిషీట్లు తక్కువ
హైదరాబాద్‌లో 2023తో పోలిస్తే 2024లో మొత్తం నేరాల సంఖ్య 21.54 శాతం పెరిగింది. 2023లో 21,774 కేసులు నమోదవగా.. 2024లో అవి 27,031కు చేరాయి. దేశంలోని 19 ప్రధాన నగరాల్లో హైదరాబాద్ ఐదో స్థానంలో నిలిచింది. అయితే కేసులు భారీగా నమోదవుతున్నప్పటికీ.. దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్లు దాఖలు చేయడంలో మాత్రం పోలీసులు వెనుకబడినట్లు నివేదిక తెలిపింది. నమోదైన కేసుల్లో కేవలం 56.9 శాతం కేసులకే ఛార్జిషీట్లు దాఖలు కావడం ఆందోళన కలిగిస్తోంది.
మహిళలు, చిన్నారులపై వేధింపులు
రాజధానిలో మహిళలు, చిన్నారులు బహిరంగ ప్రదేశాలు, ప్రజారవాణా వ్యవస్థల్లోనే అధికంగా వేధింపులకు గురవుతున్నట్లు ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడించింది. 2024లో నమోదైన 149 లైంగిక వేధింపుల కేసుల్లో 77 కేసులు బహిరంగ ప్రదేశాలు, బస్సులు, కార్యాలయాల్లో జరిగినవేనని పేర్కొంది. అదే ఏడాది హైదరాబాద్‌లో 358 అత్యాచార కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా దిల్లీ మొదటి స్థానంలో ఉండగా.. హైదరాబాద్ కూడా ఆందోళనకర స్థాయిలో కేసులతో ముందువరుసలో నిలిచింది.
వదంతులు, తప్పుడు వార్తల్లో తొలి స్థానం
సోషల్ మీడియా వేదికగా వదంతులు, తప్పుడు వార్తల వ్యాప్తిలో హైదరాబాద్ దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం మరో ఆందోళనకర అంశంగా మారింది. 2024లో ఇలాంటి 68 కేసులు నమోదయ్యాయి. అలాగే ఫోర్జరీ, మోసం, నమ్మకద్రోహం కేసుల్లో 5,679 కేసులతో హైదరాబాద్ దేశంలో రెండో స్థానంలో ఉంది.
దొంగతనాల్లోనూ పెరుగుదల
నగరంలో 2024లో మొత్తం 4,875 దొంగతనాల కేసులు నమోదయ్యాయి. వీటిలో 2,234 వాహనాల చోరీలకు సంబంధించినవే. బందిపోటు తరహా దొంగతనాలు బెంగళూరుకు తర్వాత హైదరాబాద్‌లోనే అధికంగా నమోదవుతున్నాయని నివేదిక పేర్కొంది.
ఈ గణాంకాలు రాజధానిలో పెరుగుతున్న నేర పరిస్థితులను స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి. కుటుంబ విలువలు, పర్యవేక్షణ, డిజిటల్ అవగాహన, పోలీసు వ్యవస్థలో వేగవంతమైన దర్యాప్తు వంటి అంశాలపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















