యూట్యూబర్ ప్రశ్న రావణ్‌ను అరెస్టు చేసి కోర్టుకు తరలించే సందర్భంగా కాకినాడలో గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో పిఠాపురం పోలీసులు బుధవారం రావణ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఆ కేసులో అర్ధరాత్రి బెయిల్ లభించినప్పటికీ, వెంటనే మరో కేసులో పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద నుంచి మళ్లీ అదుపులోకి తీసుకుని కాకినాడ రూరల్ పరిధిలోని సర్పవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
2025లో కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలోని ఓ పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన గొడవను కులాల మధ్య ఘర్షణగా చిత్రీకరించేలా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై సర్పవరం పోలీసులు రావణ్‌పై కేసు నమోదు చేశారు. ఆ కేసుకు సంబంధించి గురువారం మధ్యాహ్నం వరకు ఆయనను పోలీసులు విచారించారు.
వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించనున్నారనే సమాచారం తెలిసిన వెంటనే పెద్ద సంఖ్యలో జనసేన కార్యకర్తలు సర్పవరం పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. పోలీసులు అతడిని రక్షిస్తున్నారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సమయంలో రావణ్ పోలీసు వాహనం ఎక్కే ముందు కార్యకర్తల వైపు పిడికిలి బిగించి సంకేతం చేయడంతో అక్కడ ఉద్రిక్తత మరింత పెరిగింది.
పోలీసు వాహనం స్టేషన్ బయటకు రాగానే జనసేన కార్యకర్తలు దానిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ గందరగోళంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పోలీసు జీపుపై కోడిగుడ్లు విసిరారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు అదనపు బలగాలను మోహరించారు.
ఆ తర్వాత నిందితుడిని సాధారణ ప్రభుత్వ ఆసుపత్రికి కాకుండా పోలీస్ రిజర్వ్ లైన్‌లోని వైద్యాధికారి వద్ద వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కోర్టుకు తరలిస్తారని సమాచారం రావడంతో జిల్లా పరిషత్ కూడలి, కోర్టు పరిసరాల్లో కూడా జనసేన కార్యకర్తలు భారీగా గుమికూడారు. పోలీసులు ప్రత్యామ్నాయ మార్గంలో రావణ్‌ను కోర్టుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ, కార్యకర్తలు అక్కడికీ చేరుకుని వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేసి నిరసనకారులను చెదరగొట్టారు. కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించే సమయంలో కూడా పోలీసు వాహనంపై మరోసారి కోడిగుడ్లు విసిరిన ఘటన చోటుచేసుకుంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ సాయంత్రం 4.40 గంటలకు ప్రశ్న రావణ్‌ను కాకినాడ స్పెషల్ మొబైల్ కోర్టుకు తీసుకువచ్చారు. అప్పటికే కోర్టు సమయం ముగియడంతో జడ్జి నివాసంలో హాజరుపరిచారు.
రాత్రి వరకు ఇరుపక్షాల వాదనలు కొనసాగిన అనంతరం న్యాయమూర్తి రావణ్‌కు బెయిల్ మంజూరు చేశారు. అయితే కోర్టు నుంచి బయటకు వచ్చిన వెంటనే కృష్ణా జిల్లా గుడివాడ పోలీసులు మరో కేసులో ఆయనను అదుపులోకి తీసుకుని మచిలీపట్నానికి తరలించారు. వరుస కేసుల్లో ప్రశ్న రావణ్ అరెస్టు, బెయిల్, మళ్లీ అరెస్టు కావడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు కాకినాడలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















