తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటికే కోనేరు హంపి, హారిక, హరికృష్ణ, అర్జున్, లలిత్‌బాబు, రాజా రిత్విక్ వంటి పలువురు ప్రతిభావంతులైన చెస్ క్రీడాకారులు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందారు. ఇప్పుడు వారి బాటలోనే 14 ఏళ్ల మోదుపల్లి దీక్షిత దూసుకెళ్తోంది.
అండర్-16 విభాగంలో ప్రపంచ టాప్ ర్యాంక్ ప్లేయర్‌గా నిలిచిన దీక్షిత.. తాజాగా తన తొలి ఇంటర్నేషనల్ మాస్టర్ నార్మ్‌ను సొంతం చేసుకుంది. గత కొంతకాలంగా అంతర్జాతీయ టోర్నీల్లో అద్భుత ప్రదర్శనతో రేటింగ్‌ను భారీగా మెరుగుపరుచుకున్న ఆమె.. కేవలం నెల వ్యవధిలో 29,200కు పైగా స్థానాలను అధిగమించడం విశేషం.
అనంతపురం జిల్లా హంపాపురానికి చెందిన దీక్షిత కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడింది. ఆమె తండ్రి శేషాద్రి నాయుడు సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లోని వెలాసిటీ చెస్ అకాడమీలో ఇంటర్నేషనల్ మాస్టర్ కృష్ణతేజ వద్ద శిక్షణ పొందిన దీక్షిత.. చిన్న వయసులోనే వయసు విభాగాల పోటీల్లో సత్తా చాటింది.
జాతీయ అండర్-13 ఛాంపియన్‌షిప్, జాతీయ పాఠశాల క్రీడల చెస్‌లో విజేతగా నిలిచి తన ప్రతిభను చాటింది. అనంతరం ఐరోపా చెస్ సర్క్యూట్‌లో పాల్గొంటూ రేటింగ్‌ను మెరుగుపరుచుకుంది.
ఇటీవల స్పెయిన్‌లో జరిగిన నాలుగు టోర్నీల్లో దీక్షిత అద్భుతంగా రాణించింది. లా ప్లాగ్‌నె మైట్రె, మెనిరెస్ మాస్టర్స్, టొర్నియో ఇంటర్నేషనల్, లెకా ఓపెన్ టోర్నీల్లో కలిపి 11 విజయాలు సాధించింది. తనకంటే మెరుగైన ర్యాంకుల్లో ఉన్న 11 మంది క్రీడాకారులను ఓడించింది. వారిలో ముగ్గురు ఇంటర్నేషనల్ మాస్టర్లు ఉండటం ఆమె ప్రతిభకు నిదర్శనం.
ఈ ప్రదర్శనతో దీక్షిత తన రేటింగ్‌ను 1985 నుంచి 2454కు పెంచుకుంది. ఒకే నెలలో 484.8 రేటింగ్ పాయింట్లు సాధించి మహిళల ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 499వ స్థానానికి చేరుకుంది. లైవ్ రేటింగ్స్ ప్రకారం అండర్-16 విభాగంలో ప్రపంచ అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
క్లాసికల్ చెస్‌లో ప్రపంచ మహిళల ర్యాంకింగ్స్‌లోనూ దీక్షిత ప్రస్తుతం 17వ స్థానంలో ఉంది. కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్, వైశాలి రమేశ్‌బాబు తర్వాత భారత మహిళల ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో నిలిచింది.
“తప్పు జరిగిన తర్వాత ఆటను వదిలేయకుండా అక్కడి నుంచే పోరాడుతుంది. మానసికంగా దీక్షిత చాలా బలమైన క్రీడాకారిణి” అని ఆమె కోచ్ కృష్ణతేజ తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















