దేశ ఆర్థికాభివృద్ధిలో సముద్రాలు, తీరప్రాంతాల పాత్రను మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. షిప్పింగ్, మత్స్య పరిశ్రమ, పర్యాటకం, లాజిస్టిక్స్, పునరుత్పాదక ఇంధనం, సముద్ర ఖనిజాల అన్వేషణ వంటి రంగాలను సమగ్రంగా అభివృద్ధి చేయడం ద్వారా ‘బ్లూ ఎకానమీ’ని బలోపేతం చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం జీడీపీలో సుమారు 4 శాతం ఉన్న బ్లూ ఎకానమీ వాటాను 2030 నాటికి 8 శాతానికి పెంచాలని ప్రణాళికలు రూపొందిస్తోంది.
కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వశాఖ కార్యదర్శి టి. శ్రీనివాసకుమార్ మాట్లాడుతూ సముద్ర వనరులను శాస్త్రీయంగా వినియోగించుకోవడం ద్వారా దేశానికి భారీ ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయని తెలిపారు. సముద్రాల్లో పునరుత్పాదక ఇంధన వనరుల గుర్తింపు, సముద్ర జీవవైవిధ్యంపై పరిశోధనలు, ఖనిజాల అన్వేషణ, తీరప్రాంత రక్షణ వంటి అంశాలపై ప్రత్యేకంగా పనిచేస్తున్నట్లు వివరించారు.
సముద్ర గర్భంలోని వనరులను అధ్యయనం చేసేందుకు చేపట్టిన ‘డీప్ ఓషన్ మిషన్’ దేశానికి వ్యూహాత్మకంగా, ఆర్థికంగా ఎంతో కీలకమని అధికారులు చెబుతున్నారు. 6 వేల మీటర్ల లోతు వరకు వెళ్లి పరిశోధనలు నిర్వహించేందుకు ‘మత్స్య-6000’ సబ్‌మెర్సిబుల్‌ను అభివృద్ధి చేస్తున్నారు. సముద్ర గర్భంలోని జీవవైవిధ్యం, ఖనిజ వనరులు, పర్యావరణ మార్పులపై ఈ మిషన్ ద్వారా విస్తృత అధ్యయనాలు చేపట్టనున్నారు.
వాతావరణ మార్పుల కారణంగా మంచు కరగడం, సముద్ర మట్టాలు పెరగడం వంటి పరిణామాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. హిందూ మహాసముద్రంలో సముద్ర మట్టం పెరుగుతున్న తీరును పరిశీలిస్తూ భవిష్యత్తులో తుపానులు, అలల తీవ్రత, తీరప్రాంత కోత వంటి అంశాలపై ముందస్తు అంచనాలు రూపొందించనున్నారు. 2028 నాటికి ఈ పరిశోధనల ద్వారా మరింత స్పష్టమైన సమాచారం అందుబాటులోకి రానుంది.
భారత తీర సముద్ర జలాల్లో గుర్తించిన సీమౌంట్స్ ప్రాంతాల్లో జీవవైవిధ్యాన్ని అధ్యయనం చేస్తున్నారు. కొత్త సముద్ర జీవులు, వాటిలోని ప్రత్యేక మాలిక్యూల్స్‌ను గుర్తించి ఔషధ, పారిశ్రామిక రంగాల్లో వాటి వినియోగ అవకాశాలను పరిశీలిస్తున్నారు. భవిష్యత్తులో సముద్ర జీవ వనరులు దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త అవకాశాలను అందించే అవకాశం ఉంది.
సముద్ర గర్భంలో మాంగనీస్, నికెల్, కోబాల్ట్ తదితర కీలక ఖనిజాల అన్వేషణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. సెంట్రల్ ఇండియన్ ఓషన్ బేసిన్‌లో భారీ విస్తీర్ణంలో సర్వేలు నిర్వహించి ఖనిజ నమూనాలను సేకరించారు. అయితే సముద్రగర్భంలో తవ్వకాలు చేపట్టే ముందు పర్యావరణంపై వాటి ప్రభావాన్ని సమగ్రంగా అధ్యయనం చేయనున్నారు.
సముద్ర ఉపరితలం, లోతట్టు ప్రాంతాల మధ్య ఉండే ఉష్ణోగ్రత వ్యత్యాసాన్ని ఉపయోగించి విద్యుత్తు ఉత్పత్తి చేసే అవకాశాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో సముద్ర ఆధారిత పునరుత్పాదక ఇంధనం దేశ విద్యుత్ అవసరాల్లో కొంత భాగాన్ని తీర్చే అవకాశముంది.
తీరప్రాంతాలు, ద్వీప ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు సముద్ర జలాల నిర్లవణీకరణ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఆరు ప్లాంట్లు పూర్తయ్యాయి. ముఖ్యంగా నీటి వనరులు పరిమితంగా ఉన్న ద్వీప ప్రాంతాలకు ఈ సాంకేతికత ఎంతో ఉపయోగకరంగా మారనుంది.
సుదీర్ఘ తీరప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు బ్లూ ఎకానమీ ద్వారా భారీ అవకాశాలు ఉన్నాయని శ్రీనివాసకుమార్ తెలిపారు. పోర్టులు, సముద్ర రవాణా, మత్స్య పరిశ్రమ, తీర పర్యాటకం, లాజిస్టిక్స్, ఆఫ్‌షోర్ పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో పెట్టుబడులు పెరిగితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతం లభించే అవకాశం ఉంది. సముద్ర వనరులను శాస్త్రీయంగా వినియోగించుకుంటే తీర ప్రాంతాలు భవిష్యత్తు ఆర్థికాభివృద్ధికి కొత్త కేంద్రాలుగా మారనున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















