శ్రీశైలంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లికి చెందిన కుటుంబంగా పోలీసులు గుర్తించారు. శ్రీశైలంలోని ఓ సత్రంలో గదిని అద్దెకు తీసుకున్న వీరు అక్కడే బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. మంగళవారం ఉదయం గది నుంచి దుర్వాసన రావడంతో సత్రం సిబ్బందికి అనుమానం వచ్చింది. కిటికీ తెరిచి చూడగా ఐదుగురు ఉరికి వేలాడుతూ కనిపించారు.
మృతులను ఆదిలక్ష్మి (50), మల్లీశ్వరి (45), సుధాకర్ (38), శ్రీదేవి (33), మణికంఠ (15)గా గుర్తించారు. రెండు, మూడు రోజుల క్రితమే వారు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బత్తలపల్లిలో నివసిస్తున్న ఈ కుటుంబం కొంతకాలంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. కుటుంబ పెద్దల మరణం తర్వాత బాధ్యతలు సుధాకర్‌పై పడ్డాయి. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించడంతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్న తన సోదరి వైద్య ఖర్చులను కూడా భరించేవాడు. ఇందుకోసం బ్యాంకులు, ఇతర వ్యక్తుల వద్ద అప్పులు చేసినట్లు స్థానికులు తెలిపారు.
మరోవైపు శ్రీదేవి చిన్నతనంలోనే పక్షవాతానికి గురై ఇంటికే పరిమితమయ్యారు. కుటుంబ పోషణ, వైద్యం, అప్పుల భారం సుధాకర్‌ను తీవ్ర ఒత్తిడికి గురిచేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆయన ఐపీ పెట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. మల్లీశ్వరి కుమారుడు మణికంఠ కూడా అనారోగ్యానికి గురికావడంతో కుటుంబంపై మరింత ఆందోళన నెలకొంది.
శ్రీదేవికి తిరుపతి జిల్లా విరుపాక్షపురం వద్ద ఆయుర్వేద వైద్యం అందుతుందని తెలుసుకున్న సుధాకర్.. గత నెల 28న తన అక్కలు ఆదిలక్ష్మి, మల్లీశ్వరి, మేనల్లుడు మణికంఠతో కలిసి బయలుదేరినట్లు సమాచారం. అదే రోజు శ్రీశైలానికి చేరుకుని ఓ సత్రంలో గది తీసుకున్నారు. మల్లికార్జున స్వామిని దర్శించుకున్న అనంతరం విరుపాక్షపురానికి వెళ్లి ఆయుర్వేద మందులు తీసుకున్నట్లు తెలిసింది.
ఆ తర్వాత కుటుంబ సభ్యులు తిరిగి బత్తలపల్లికి వెళ్లకుండా శ్రీశైలంలోని సత్రంలోనే ఉన్నారు. ఆర్థిక, కుటుంబ సమస్యలతో తీవ్ర మనోవేదనకు గురై ఈ దారుణ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆత్మహత్యకు ముందు కుటుంబ సభ్యులు కొందరికి ఫోన్లు చేసినట్లు సమాచారం. ఆదిలక్ష్మి తన భర్త రాముడికి ఫోన్ చేసి తాను వచ్చేవరకు ఎక్కడికీ వెళ్లొద్దని, తనను చూడాలని ఉందని చెప్పినట్లు ఆయన తెలిపారు.
అదే సమయంలో సుధాకర్ బత్తలపల్లిలోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయ పూజారి రమణకు ఫోన్ చేసి ఆర్థిక ఇబ్బందులతో బతకలేకపోతున్నామని, ఇదే చివరిసారి మాట్లాడటం కావచ్చని చెప్పినట్లు సమాచారం. దీనిపై స్పందించిన పూజారి ఏదైనా సమస్య ఉంటే సాయం చేస్తామని, ఇంటికి రావాలని సూచించినప్పటికీ విషాదం చోటుచేసుకుంది.
సుధాకర్ కుటుంబం ఉంటున్న సొంతిల్లు కూడా బ్యాంకులో తాకట్టులో ఉన్నట్లు సమాచారం. అప్పులు, కుటుంబ సభ్యుల అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు ఈ ఘటనకు కారణమై ఉండవచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోస్టుమార్టం నివేదిక, దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















