రష్యాపై పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలు మరో అనూహ్య పరిణామానికి దారితీశాయని అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది. రష్యాకు ఖరీదైన పాశ్చాత్య కార్ల ప్రత్యక్ష ఎగుమతులు నిలిచిపోవడంతో.. అక్కడి సంపన్న వర్గాల్లో ఏర్పడిన డిమాండ్‌ను అక్రమ ముఠాలు అందిపుచ్చుకున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో కెనడాలో కార్ల దొంగతనాలు, వాటిని రష్యాకు అక్రమంగా తరలించే వ్యవస్థ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నట్లు వివరించింది.
2022లో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభించిన తర్వాత పుతిన్ ప్రభుత్వం అమెరికా, ఐరోపా సమాఖ్య, బ్రిటన్, కెనడా, జపాన్ తదితర దేశాల కఠిన ఆంక్షలను ఎదుర్కొంది. ఈ ఆంక్షల కారణంగా రష్యాకు ఖరీదైన కార్లు, విలాసవంతమైన వాహనాలు, విడిభాగాల ప్రత్యక్ష ఎగుమతులు తీవ్రంగా పరిమితమయ్యాయి. ముఖ్యంగా 50 వేల డాలర్లకు పైగా విలువైన వాహనాల ఎగుమతులపై ఆంక్షలు ప్రభావం చూపాయి.
మెర్సిడెస్ బెంజ్, ల్యాండ్ రోవర్, బీఎండబ్ల్యూ, ఆడి, పోర్షె వంటి పాశ్చాత్య బ్రాండ్లు రష్యా మార్కెట్ నుంచి వైదొలగడంతో అక్కడ ఖరీదైన వాహనాలకు కొరత ఏర్పడింది. ఈ ఖాళీని చైనా ఆటోమొబైల్ సంస్థలు భర్తీ చేసినప్పటికీ.. రష్యాలోని సంపన్న వర్గాల్లో పాశ్చాత్య బ్రాండ్లపై ఉన్న ఆసక్తి తగ్గలేదని కథనం పేర్కొంది.
ల్యాండ్ రోవర్, డాడ్జ్ రామ్, ఫోర్డ్ ఎఫ్-150 వంటి ఖరీదైన ఎస్‌యూవీలు, పికప్ ట్రక్కులకు డిమాండ్ కొనసాగడంతో అక్రమ సరఫరా నెట్‌వర్క్‌లు ఏర్పడ్డాయి. ఈ ముఠాలు యాదృచ్ఛికంగా వాహనాలను దొంగిలించకుండా.. రష్యాలోని కొనుగోలుదారుల నుంచి వచ్చిన ఆర్డర్ల ఆధారంగా నిర్దిష్ట మోడళ్లను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు సమాచారం
ఈ అక్రమ నెట్‌వర్క్‌లో కెనడా కీలక కేంద్రంగా మారినట్లు కథనం పేర్కొంది. ఖరీదైన ఎస్‌యూవీలు, పికప్ ట్రక్కులు పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉండటంతో పాటు.. మాంట్రియల్ పోర్టు ద్వారా అంతర్జాతీయంగా వాహనాలను తరలించే అవకాశం ఉండటాన్ని ముఠాలు ఉపయోగించుకుంటున్నాయి.
రష్యాలో ఏ బ్రాండ్, ఏ మోడల్, ఎన్ని వాహనాలు కావాలో ముందుగానే తెలుసుకుని.. ఆర్డర్‌కు అనుగుణంగా కెనడాలో వాహనాలను చోరీ చేయిస్తున్నట్లు సమాచారం. ఒక్కో వాహనం చోరీ చేసిన వ్యక్తికి సుమారు 500 నుంచి 1,500 డాలర్ల వరకు చెల్లిస్తున్నట్లు కథనం పేర్కొంది.
చోరీ చేసిన వాహనాలను మాంట్రియల్ టర్మినల్‌కు తరలించి.. మోసపూరిత పత్రాలతో ఇతర సరకు మధ్య దాచి విదేశాలకు పంపుతున్నట్లు వివరించింది. అక్కడి నుంచి యూఏఈ, జార్జియా, కజఖ్‌స్థాన్, కిర్గిస్థాన్, లిథువేనియా వంటి దేశాల మీదుగా రష్యాకు చేరుతున్నట్లు పేర్కొంది
ఈ వ్యవస్థీకృత అక్రమ రవాణా నెట్‌వర్క్‌పై కెనడా పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ ఏడాది ఆగస్టు 5న రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. రష్యాకు తరలించేందుకు ప్రయత్నించిన సుమారు 1,900 వాహనాలను అధికారులు అడ్డుకున్నారు.
అయినప్పటికీ కెనడాలో ఖరీదైన వాహనాల చోరీలు పూర్తిగా ఆగలేదని సమాచారం. రష్యాలో పాశ్చాత్య బ్రాండ్లకు ఉన్న డిమాండ్, అంతర్జాతీయ ఆంక్షల కారణంగా ఏర్పడిన సరఫరా కొరత.. అక్రమ కార్ల రవాణాకు ఊతమిస్తున్నట్లు విశ్లేషణలు చెబుతున్నాయి.
అంటే ఒకవైపు ఆంక్షల కారణంగా రష్యాకు పాశ్చాత్య కార్ల చట్టబద్ధ సరఫరా నిలిచిపోగా.. మరోవైపు అదే డిమాండ్‌ను అక్రమ ముఠాలు దొంగతనాలు, నకిలీ పత్రాలు, మధ్యవర్తి దేశాల ద్వారా భర్తీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















