తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, నిర్మాత గుళ్లపల్లి వెంకట నారాయణరావు (73) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. నటుడిగా వందకుపైగా చిత్రాలు, పలు ధారావాహికల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందిన ఆయన.. నిర్మాతగానూ తనదైన ముద్ర వేశారు.
కృష్ణా జిల్లా కురుమద్దాలిలో జన్మించిన జి.వి.నారాయణరావు బాల్యం, విద్యాభ్యాసం గుంతకల్లులో సాగింది. ఆయన తండ్రి సినీ పంపిణీదారుడు కావడంతో చిన్ననాటి నుంచే సినీ వాతావరణంతో పరిచయం ఏర్పడింది. కళలపై ఆసక్తితో భరతనాట్యం, కూచిపూడి, నటనలో శిక్షణ పొందారు. నాటక రంగంలోనూ చురుకుగా పాల్గొని ‘మహమ్మద్ బిన్ తుగ్లక్’, ‘ప్రతాపరుద్రీయ’, ‘మంచుతెర’ వంటి నాటకాలతో గుర్తింపు తెచ్చుకున్నారు.
మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో నటనపై శిక్షణ పొందిన ఆయన.. అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌కు సహాధ్యాయి. కె.బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అంతులేని కథ’తో వెండితెరకు పరిచయమయ్యారు. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు రావడంతో వరుస అవకాశాలు అందుకున్నారు. కథానాయకుడిగా సుమారు 50 చిత్రాల్లో నటించిన అనంతరం సహాయ నటుడిగానూ కొనసాగారు.
‘ముత్యాల పల్లకి’, ‘ఒక ఊరి కథ’, ‘గుప్పెడు మనసు’, ‘చిలకమ్మ చెప్పింది’, ‘సీతారామయ్యగారి మనవరాలు’, ‘మంచు పల్లకీ’, ‘బహుదూరపు బాటసారి’, ‘చట్టానికి కళ్ళులేవు’, ‘రాజా విక్రమార్క’, ‘గ్యాంగ్‌లీడర్’, ‘హిట్లర్’, ‘సాహసం’, ‘తోలు బొమ్మలాట’, ‘స్కైలాబ్’ తదితర చిత్రాల్లో నటించారు. ఆయన నటించిన చివరి చిత్రం ‘ఆలోచన’ విడుదల కావాల్సి ఉంది.
నిర్మాతగా ‘దేవాంతకుడు’, ‘యముడికి మొగుడు’, ‘ఇంటికో రుద్రమ్మ’, ‘పెళ్లి నీకు శుభం నాకు’ వంటి చిత్రాలను నిర్మించారు. చిరంజీవితో ఉన్న సన్నిహిత అనుబంధం కారణంగా ఆయన నిర్మాణంలో చిరంజీవి నటించిన ‘దేవాంతకుడు’, ‘యముడికి మొగుడు’ చిత్రాలు ఘన విజయాలు సాధించాయి. ‘యముడికి మొగుడు’ తమిళ రీమేక్‌లో రజనీకాంత్ నటించడం విశేషం.
జి.వి.నారాయణరావు మృతిపై చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన ఆత్మీయ మిత్రుడిని కోల్పోయానని పేర్కొంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని, మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌తోపాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. నారాయణరావుకు భార్య అనురాధ, కుమారుడు అవినాష్, కుమార్తె లలిత యామిని ఉన్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















