పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ పేరు వినగానే అభిమానుల్లో ఓ ప్రత్యేకమైన ఉత్సాహం కనిపిస్తుంది. తెరపై ఆయన కనిపిస్తే చాలు.. థియేటర్లు అభిమానుల నినాదాలతో దద్దరిల్లుతాయి. ‘పవన్ అంటే గాలి కాదు.. తుపాను’ అంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటారు. మూడు దశాబ్దాల సినీ ప్రయాణంలో 30కి పైగా చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన.. తనదైన నటన, మేనరిజమ్స్, వ్యక్తిత్వంతో ప్రత్యేకమైన అభిమాన వర్గాన్ని సొంతం చేసుకున్నారు.
నేడు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ 55వ పుట్టినరోజు సందర్భంగా ఆయన గతంలో వివిధ సందర్భాల్లో చెప్పిన ఆసక్తికర విషయాలు మరోసారి వైరల్‌గా మారాయి.
చిన్నతనంలో తాను మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిననే విషయాన్ని బయటకు చెప్పుకోవడానికి పెద్దగా ఇష్టపడేవాడిని కాదని పవన్ కల్యాణ్ గతంలో వెల్లడించారు. అన్నయ్యను ఇష్టపడని వారితో గొడవ పడాల్సి వస్తుందనే భయంతో ఈ విషయాన్ని దాచేవాడినని చెప్పారు. తాను ఏదైనా తప్పు చేస్తే ‘సినిమా వేషాలు వేస్తున్నావా?’ అంటూ కొందరు అనడం తనకు చిరాకు తెప్పించేదని గుర్తుచేసుకున్నారు.
ఏడో తరగతి వరకు తనకు తల్లి పాకెట్‌మనీ ఇచ్చేవారు కాదని పవన్ తెలిపారు. సినిమాకు వెళ్లాలంటే కేవలం టికెట్‌కు సరిపడా డబ్బులు మాత్రమే ఇచ్చేవారని చెప్పారు. ఇంటర్వెల్‌లో సమోసా తినాలని అనిపించినా కొనలేకపోయేవాడినని, ఇప్పుడు ఎన్ని రకాల సమోసాలు తిన్నా చిన్నప్పుడు తినాలనుకుని తినలేకపోయిన ఆ సమోసానే ప్రత్యేకంగా అనిపిస్తుందని చెప్పుకొచ్చారు.
చిన్నతనంలో స్నేహితులతో పంతానికి పోయి బైక్ సైలెన్సర్ పట్టుకున్న సంఘటనను కూడా పవన్ గుర్తుచేసుకున్నారు. సైలెన్సర్ వేడిగా ఉంటుందని తెలిసినా.. అది చల్లగా ఉంటుందని స్నేహితులతో వాదించానని చెప్పారు. వారు సవాల్ చేయడంతో నిజంగానే సైలెన్సర్ పట్టుకుని అరచేయి కాల్చుకున్నానని తెలిపారు. ఆ సంఘటన తనకు మంచి గుణపాఠం నేర్పిందన్నారు.
చిన్న వయసులో శారీరకంగా తాను పెద్దగా బలంగా ఉండేవాడిని కాదని పవన్ చెప్పారు. ఎవరి మీదైనా కోపం వచ్చినప్పుడు ఎదిరించాలనిపించేదని, అదే సమయంలో ఇతరులు దాడి చేసినా తనను తాను కాపాడుకునే విద్య తెలిసి ఉండాలని భావించానన్నారు. అలా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం మొదలుపెట్టానని.. ఆ శిక్షణ తనలో సహనాన్ని పెంచిందని చెప్పారు.
తెరపై ఎంతో ధైర్యంగా కనిపించే పవన్.. నిజ జీవితంలో మాత్రం తనకు సిగ్గు, భయం ఎక్కువేనని చెప్పడం ఆసక్తికరం. అందరి ముందు నటించడం, డ్యాన్స్ చేయడం తనకు ఇబ్బందిగా అనిపిస్తుందని తెలిపారు. ఫైట్ సన్నివేశాల్లో వైర్లతో ఎత్తుకు తీసుకెళ్లినప్పుడు ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని భయపడుతుంటానన్నారు. హీరోలకు ఉండే అన్ని లక్షణాలు తనలో లేవని, తనకు వచ్చిందే చేస్తుంటానని ఆయన చెప్పుకొచ్చారు.
పవన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జానీ’ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఆ సినిమా తర్వాత చాలామంది తనను ఓ నేరస్థుడిని చూసినట్టుగా చూశారని పవన్ గతంలో గుర్తుచేసుకున్నారు. ఒక్క ఫ్లాప్‌తో మనుషుల ప్రవర్తన ఎలా మారిపోయిందో అప్పుడే అర్థమైందన్నారు. ఆ అనుభవం తర్వాత హిట్, ఫ్లాప్‌లను సమానంగా స్వీకరించడం అలవాటు చేసుకున్నానని చెప్పారు.
‘గోపాల గోపాల’లో శ్రీకృష్ణుడి పాత్రలో కనిపించిన సమయంలో ఆవుపాలు, అరటిపండ్లనే ప్రధాన ఆహారంగా తీసుకునేవాడినని పవన్ చెప్పారు. మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు భక్తి గీతాలు ఎక్కువగా వినేవాడినని తెలిపారు. పురాణాలను చదవడం, వినడం ద్వారా దేవుడి గురించి తెలుసుకున్నానని.. తన దృష్టిలో దేవుడంటే మంచి విషయాలను చెప్పే వ్యక్తి అని వివరించారు.
పుస్తకాల్లో చదివిన విషయాలను జీవితంలో ఆచరించేందుకు ప్రయత్నిస్తానని పవన్ చెప్పారు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో కాపీ కొట్టాలని అనుకున్న సమయంలో గతంలో ఎక్కడో చదివిన మహాత్మాగాంధీ మాటలు గుర్తొచ్చాయని తెలిపారు. పరీక్షలో కాపీ కొట్టడం తప్పు అని భావించి వెంటనే ఆ పరీక్షను వదిలేసి వచ్చానని చెప్పారు. పుస్తకాలు తన ఆలోచనా విధానంపై ఎంతో ప్రభావం చూపాయని పేర్కొన్నారు.
ఇతిహాసాల్లో పరశురాముడి పాత్ర తనకు ఎంతో ఇష్టమని పవన్ తెలిపారు. ‘నేను’ అనే అహంకారాన్ని చంపిన వ్యక్తిగా పరశురాముడిని భావిస్తానన్నారు. రామాయణం, మహాభారతాలను కేవలం కథలుగా కాకుండా.. వాటిలోని భావాలను తన జీవితానికి అన్వయించుకుని చదువుతానని చెప్పారు. పైకి కనిపించే కథకు, అంతర్లీనంగా ఉండే భావానికి మధ్య ఉన్న తేడాను అన్వేషించడం తనకు ఇష్టమని వెల్లడించారు.
పవన్ కల్యాణ్‌కు చిన్నప్పటి నుంచే జానపద గీతాలంటే ప్రత్యేకమైన ఇష్టం. ఇంట్లో తండ్రి జానపద గీతాలు వినేవారని, అలా తనకూ వాటిపై ఆసక్తి ఏర్పడిందని చెప్పారు. నటనలో శిక్షణ తీసుకుంటున్న సమయంలో శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన పలువురు పరిచయం కావడంతో అక్కడి జానపద బాణీలు మరింతగా నచ్చాయని తెలిపారు. అందుకే అవకాశం వచ్చినప్పుడల్లా తన సినిమాల్లో జానపద గీతాలకు చోటు కల్పించేవాడినని చెప్పారు. ‘తమ్ముడు’, ‘ఖుషి’, ‘జానీ’ వంటి సినిమాల్లోని కొన్ని పాటల వెనుక ఈ ఆసక్తి ఉందని వివరించారు.
పవన్ కల్యాణ్ సినీ ప్రయాణం కేవలం విజయాలు, రికార్డులతో మాత్రమే కాదు.. ఎన్నో అనుభవాలు, ప్రయోగాలు, వైఫల్యాలు, వ్యక్తిగత ఆలోచనలతో కూడుకున్నది. తెరపై పవర్‌ఫుల్ హీరోగా కనిపించే ఆయనలోని మరో కోణాన్ని ఈ జ్ఞాపకాలు అభిమానులకు పరిచయం చేస్తాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















