క్యాంపస్ ప్లేస్‌మెంట్ లక్ష్యమా? కాలేజీ నుంచే ఇలా సిద్ధమవ్వండి : చదువు పూర్తయ్యేలోపే మంచి సంస్థలో ఉద్యోగం సాధించాలని ప్రతి విద్యార్థి కోరుకుంటాడు. అయితే ప్రస్తుత పోటీ ప్రపంచంలో కేవలం సబ్జెక్ట్ పరిజ్ఞానం ఉంటే సరిపోదు. కమ్యూనికేషన్, కలివిడితనం, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, సమయస్ఫూర్తి, కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి వంటి నైపుణ్యాలు కూడా కీలకంగా మారాయి. ఇవన్నీ ఒక్కరోజులో అలవడేవి కావు. కోర్సులో చేరినప్పటి నుంచే క్రమంగా సాధన చేస్తేనే ప్లేస్‌మెంట్ సమయంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లగలుగుతారు.
రెజ్యూమె ముందుగానే సిద్ధం చేసుకోండి
కంపెనీలు ప్లేస్‌మెంట్లు ప్రకటించిన తర్వాత హడావుడిగా రెజ్యూమె తయారు చేయడం కాకుండా ముందుగానే సిద్ధం చేసుకోవాలి. సాధించిన సర్టిఫికేషన్లు, ప్రాజెక్టులు, ఇంటర్న్‌షిప్‌లు, నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి. ముఖ్యంగా రెజ్యూమెలో పేర్కొన్న ప్రతి అంశం గురించి పూర్తి అవగాహన ఉండాలి. ఇంటర్వ్యూలో ఏ ప్రశ్న ఎదురైనా స్పష్టంగా సమాధానం చెప్పగలిగేలా సిద్ధపడాలి.
బ్యాక్‌లాగ్స్‌ను నిర్లక్ష్యం చేయొద్దు : చిన్నదిగా కనిపించే బ్యాక్‌లాగ్ తర్వాత మంచి ఉద్యోగావకాశానికి అడ్డంకిగా మారవచ్చు. సంస్థలు నిర్దేశించే అర్హత ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా పెండింగ్ సబ్జెక్టులను పూర్తి చేసుకోవాలి. ప్లేస్‌మెంట్ సమయంలో విద్యార్హతలకు సంబంధించి ఎలాంటి సమస్య రాకుండా ముందుగానే జాగ్రత్తపడాలి.
డిగ్రీతో పాటు నైపుణ్యాలు : విద్యార్థులు తమ కెరీర్ లక్ష్యానికి అనుగుణంగా సాంకేతిక, వృత్తిపరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి. పరిశ్రమకు ఉపయోగపడే సర్టిఫికేషన్లు ఇందుకు తోడ్పడతాయి. అయితే కేవలం సర్టిఫికెట్ సంపాదించడం కాకుండా నేర్చుకున్న విషయాలను వాస్తవ పరిస్థితుల్లో ఎలా ఉపయోగించాలో కూడా తెలుసుకోవాలి.
ఇంటర్న్‌షిప్‌ను సీరియస్‌గా తీసుకోండి : ఇంటర్న్‌షిప్‌ను కేవలం ప్రాజెక్టు పూర్తిచేసే ప్రక్రియగా చూడకూడదు. సంస్థ ఎలా పనిచేస్తుంది? బృంద సభ్యులు ఎలా సమన్వయంతో పని చేస్తున్నారు? తరగతిలో నేర్చుకున్న అంశాలను వాస్తవ పనిలో ఎలా ఉపయోగిస్తున్నారు? వంటి విషయాలను గమనించాలి. ఈ అనుభవం ఇంటర్వ్యూలో చెప్పడానికి ఉపయోగపడటమే కాకుండా, తమ బలాలు, బలహీనతలను గుర్తించేందుకు సహాయపడుతుంది.
రోజువారీ సాధనే విజయానికి పునాది : ప్లేస్‌మెంట్ పరీక్షల్లో ఆప్టిట్యూడ్ కీలక పాత్ర పోషిస్తుంది. పరీక్షల సమయంలో మాత్రమే కాకుండా ప్రతిరోజూ కొంత సమయం కేటాయించి ప్రశ్నలను సాధన చేయాలి. క్రమం తప్పకుండా అభ్యాసం చేస్తే వేగం, కచ్చితత్వం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. కష్టంగా అనిపించే అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి.
మాక్ టెస్టులతో మీ స్థాయిని తెలుసుకోండి : మాక్ టెస్టులు రాయడం ద్వారా ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. సమయ నిర్వహణ ఎలా ఉంది? ఏ అంశాల్లో బలంగా ఉన్నారు? ఎక్కడ ఇంకా మెరుగుపడాలి? వంటి విషయాలు స్పష్టమవుతాయి. మాక్ టెస్టుల్లో వచ్చిన మార్కుల కంటే వాటి ద్వారా గుర్తించిన లోపాలను సరిదిద్దుకోవడమే ముఖ్యమని గుర్తుంచుకోవాలి.
కమ్యూనికేషన్‌లో స్పష్టత ముఖ్యం : గ్రూప్ డిస్కషన్, వెర్బల్ ఎబిలిటీ, ఇంటర్వ్యూ వంటి దశలకు ప్రత్యేకంగా సాధన చేయాలి. అద్భుతమైన ఇంగ్లిష్ మాట్లాడటం కంటే మన ఆలోచనలను స్పష్టంగా వ్యక్తం చేయడం, ఎదుటివారు చెప్పేది శ్రద్ధగా వినడం, చర్చలో ఆత్మవిశ్వాసంతో పాల్గొనడం ముఖ్యం. తప్పులు చేస్తామనే భయంతో మాట్లాడకుండా నిరంతరం సాధన చేయాలి.
ప్రయాణ సమయాన్నీ ఉపయోగించుకోండి : కళాశాలకు వెళ్లి వచ్చే ప్రయాణ సమయాన్ని కూడా నేర్చుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. కృత్రిమ మేధ, కొత్త కెరీర్లు, స్టార్టప్‌లు, ఆర్థిక అవగాహన వంటి అంశాలపై ఉపయోగకరమైన ప్రసంగాలు, చర్చలు వినవచ్చు. ప్రతిరోజూ కొద్దిసేపు కొత్త విషయాలు తెలుసుకోవడం వల్ల కాలక్రమంలో జ్ఞానం, అవగాహన గణనీయంగా పెరుగుతాయి.
సందేహాలు ఉంటే అడగండి : అన్నీ తెలిసి ఉండాల్సిన అవసరం లేదు. ఏదైనా అంశం అర్థం కాకపోతే సీనియర్లు, అధ్యాపకులు, మెంటర్లను సంప్రదించాలి. ఇప్పటికే ప్లేస్‌మెంట్ ప్రక్రియను ఎదుర్కొన్న వారితో మాట్లాడటం ద్వారా పరీక్షలు, ఇంటర్వ్యూల తీరుపై స్పష్టత వస్తుంది. ఇతరులు చేసిన తప్పుల నుంచి నేర్చుకోవడం కూడా కెరీర్ ప్రిపరేషన్‌లో భాగమే.
ఇతరులతో పోల్చుకోవద్దు : ప్రతి విద్యార్థి నేపథ్యం, అనుభవం, అవకాశాలు వేర్వేరుగా ఉంటాయి. అందుకే ఇతరులతో పోల్చుకుంటూ ఆత్మన్యూనతకు గురికావాల్సిన అవసరం లేదు. తన సామర్థ్యాలను గుర్తించి వాటిని మెరుగుపరుచుకోవడంపైనే దృష్టి పెట్టాలి. అదే సమయంలో బృందంతో కలిసి పనిచేసే నైపుణ్యాన్ని కూడా పెంచుకోవాలి.
సమయానికి హద్దులు పెట్టుకోండి : సోషల్ మీడియా, వినోదం, అనవసరమైన పోలికలు వంటి వాటికి ఎక్కువ సమయం కేటాయిస్తే లక్ష్యంపై ప్రభావం పడుతుంది. పూర్తిగా వాటికి దూరంగా ఉండాల్సిన అవసరం లేకపోయినా, ఎక్కడ ఆగాలో తెలుసుకోవాలి. సమయాన్ని సక్రమంగా నిర్వహించుకోవడం కూడా ఒక ముఖ్యమైన వృత్తి నైపుణ్యమే.
తరగతులను నిర్లక్ష్యం చేయొద్దు : పుస్తకాల ద్వారా విషయ పరిజ్ఞానం పొందగలిగినా.. తరగతి గదిలో అధ్యాపకులు చెప్పే అనుభవాలు, ఉదాహరణలు, చర్చలు ప్రత్యేకమైన అవగాహనను అందిస్తాయి. అందుకే తరగతులకు క్రమం తప్పకుండా హాజరవుతూ, సందేహాలను అడిగి, చర్చల్లో చురుగ్గా పాల్గొనాలి.
క్రమశిక్షణ, వైఖరి కూడా కీలకమే : ప్లేస్‌మెంట్ అనేది కేవలం మార్కులు, సర్టిఫికెట్లు, సాంకేతిక నైపుణ్యాలకు సంబంధించినది కాదు. సమయపాలన, ప్రవర్తన, బాధ్యత, నేర్చుకునే తపన, ఇతరులతో కలిసి పనిచేసే విధానం కూడా ఉద్యోగదాతలు గమనిస్తారు. అందువల్ల విద్యార్థి దశ నుంచే వృత్తిపరమైన క్రమశిక్షణను అలవర్చుకోవాలి.
తిరస్కరణను ఓటమిగా భావించొద్దు : ఒక సంస్థలో ఉద్యోగం రాకపోతే తమలో సామర్థ్యం లేదని భావించాల్సిన అవసరం లేదు. ఎక్కడ లోపం జరిగిందో గుర్తించి తదుపరి అవకాశానికి మరింత మెరుగ్గా సిద్ధపడాలి. నైపుణ్యాలను పెంచుకోవడం, జ్ఞానాన్ని విస్తరించుకోవడం, కమ్యూనికేషన్‌ను మెరుగుపరచడం, నిరంతరం సాధన చేయడం ద్వారా ప్రతి ప్రయత్నాన్ని తదుపరి విజయానికి మెట్టుగా మార్చుకోవచ్చు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















