ప్రశాంతంగా కనిపించే సముద్రం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడం కూడా కష్టం. సముద్ర గర్భంలో సంభవించే భారీ భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, కొండచరియలు విరిగిపడటం వంటి కారణాలతో సముద్రపు నీరు పెద్ద ఎత్తున స్థానభ్రంశం చెందుతుంది. ఫలితంగా ఒకదాని వెంట ఒకటిగా భారీ తరంగాలు తీర ప్రాంతాల వైపు దూసుకొస్తాయి. ఈ అలల పరంపరనే సునామీ అంటారు. తీరానికి చేరే సమయానికి అలల వేగం తగ్గినా.. వాటి ఎత్తు గణనీయంగా పెరిగి తీవ్ర విధ్వంసాన్ని సృష్టిస్తుంది.
‘సునామీ’ అనే పదం జపనీస్ భాషలోని ‘సు’, ‘నామీ’ అనే రెండు పదాల నుంచి వచ్చింది. ‘సు’ అంటే హార్బర్, ‘నామీ’ అంటే తరంగాలు. అంటే హార్బర్‌లోకి వచ్చే తరంగాలు అనే అర్థం వస్తుంది. వివిధ ప్రాంతాల్లో ఈ అలలకు వేర్వేరు పేర్లు ఉండటంతో 1963లో హవాయిలో జరిగిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల సమావేశంలో ‘సునామీ’ అనే పదాన్ని సార్వత్రికంగా ఉపయోగించాలని నిర్ణయించారు.
సునామీకి ప్రధాన కారణం సముద్ర గర్భంలోని టెక్టోనిక్ పలకల కదలిక. సముద్ర అడుగున భారీ భూకంపం సంభవించినప్పుడు పెద్ద మొత్తంలో నీరు స్థానభ్రంశం చెందుతుంది. సాధారణంగా సముద్ర గర్భంలో తక్కువ లోతులో సంభవించే అధిక తీవ్రత గల భూకంపాలు సునామీకి దారితీసే అవకాశాలు ఎక్కువ. సముద్ర అడుగున కొండచరియలు విరిగిపడటం, అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందడం కూడా సునామీకి కారణం కావచ్చు. అత్యంత అరుదైన సందర్భాల్లో ఉల్కలు లేదా గ్రహశకలాలు సముద్రాన్ని ఢీకొన్నా భారీ అలలు ఏర్పడే అవకాశం ఉంటుంది.
సునామీ తరంగాలు లోతైన సముద్రంలో అత్యంత వేగంగా ప్రయాణిస్తాయి. సముద్రం లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అలల ఎత్తు తక్కువగా కనిపించినప్పటికీ.. అవి భారీ వేగంతో ముందుకు సాగుతాయి. తీరానికి దగ్గరగా సముద్రపు లోతు తగ్గే కొద్దీ తరంగాల వేగం తగ్గి, వాటి ఎత్తు పెరుగుతుంది. ఈ ప్రక్రియను ‘షోలింగ్ ప్రభావం’ అంటారు. అందుకే సముద్రంలో చిన్నగా కనిపించిన సునామీ అల.. తీరానికి చేరే సమయానికి అత్యంత ప్రమాదకరంగా మారుతుంది.
సునామీ అనేది ఒక్క భారీ అల కాదు. ఒకదాని తర్వాత మరొకటి వచ్చే అనేక తరంగాల పరంపర. వీటిని ‘సునామీ తరంగ రైలు’గా పేర్కొంటారు. మొదటి అలే అత్యంత పెద్దది కావాల్సిన అవసరం లేదు. తర్వాత వచ్చే అలలు కూడా భారీ నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. ఒక తరంగం తీరాన్ని తాకిన తర్వాత కొన్ని నిమిషాల నుంచి గంటకు పైగా వ్యవధిలో మరో తరంగం రావచ్చు. అందువల్ల మొదటి అల వెళ్లిపోయిన వెంటనే తీర ప్రాంతాలు సురక్షితమయ్యాయని భావించడం ప్రమాదకరం.
సునామీ తరంగాలకు మూడు ప్రధాన రకాలుగా వర్గీకరణ చేస్తారు. సముద్ర తీరానికి 100 కిలోమీటర్ల పరిధిలోనే ఏర్పడి గంటలోపు తీరాన్ని చేరే వాటిని స్థానిక సునామీలు అంటారు. వీటికి హెచ్చరికలు జారీ చేయడానికి చాలా తక్కువ సమయం ఉంటుంది. 100 నుంచి 1000 కిలోమీటర్ల పరిధిలో ఏర్పడి ఒకటి నుంచి మూడు గంటల్లో తీరాన్ని చేరే వాటిని ప్రాంతీయ సునామీలు అంటారు. 1000 కిలోమీటర్లకు మించిన దూరంలో ఏర్పడి మూడు గంటలకంటే ఎక్కువ సమయం తీసుకుని తీరాన్ని చేరే వాటిని మహాసముద్ర వ్యాప్తి లేదా సుదూర సునామీలు అంటారు.
సునామీ ముప్పును ముందుగానే గుర్తించేందుకు భూకంప కేంద్రాలను పర్యవేక్షించడం కీలకం. సముద్ర గర్భంలో లేదా తీర ప్రాంతాలకు సమీపంలో భారీ భూకంపం సంభవించినప్పుడు సిస్మోగ్రాఫ్ యంత్రాలు ఆ ప్రకంపనలను నమోదు చేస్తాయి. ముఖ్యంగా సముద్రంలో సంభవించే అధిక తీవ్రత గల భూకంపాలను గుర్తించిన వెంటనే సునామీ ముప్పును అంచనా వేస్తారు.
సముద్ర మట్టాల్లో వచ్చే అసాధారణ మార్పులను గుర్తించేందుకు తీర ప్రాంతాలు, ఓడరేవుల్లో టైడ్‌గేజ్‌లను ఉపయోగిస్తారు. సునామీ సమీపిస్తున్నప్పుడు సముద్రపు నీరు అసాధారణంగా వెనక్కి వెళ్లడం లేదా ఒక్కసారిగా ఎగసిపడటం వంటి మార్పులు కనిపించవచ్చు. లోతైన సముద్రంలో సునామీని గుర్తించేందుకు బాటమ్ ప్రెజర్ రికార్డర్లు, డీప్ ఓషన్ సునామీ బోయ్ వ్యవస్థలను ఉపయోగిస్తారు. సముద్ర అడుగున నీటి ఒత్తిడిలో వచ్చే మార్పులను ఇవి గుర్తించి సమాచారాన్ని పైభాగంలోని బోయ్‌ల ద్వారా ప్రసారం చేస్తాయి.
సునామీ తీర ప్రాంతాలకు చేరినప్పుడు భారీ స్థాయిలో నీరు భూభాగంలోకి చొచ్చుకుపోతుంది. ఈ నీటి ప్రవేశ దూరాన్ని ‘రన్‌అప్’ అంటారు. పెద్ద సునామీలు తీరానికి చాలా దూరం వరకు విస్తరించే అవకాశం ఉంటుంది. అందువల్ల సునామీ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, తీర ప్రాంతాల పర్యవేక్షణ, ప్రజలకు అవగాహన కల్పించడం ప్రాణనష్టాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ఏపీపీఎస్సీ అభ్యర్థులు సునామీ అంశాన్ని చదివేటప్పుడు నిర్వచనం, పదం పుట్టుక, ప్రధాన కారణాలు, షోలింగ్ ప్రభావం, తరంగ రైలు, సునామీ రకాలు, గుర్తించే పరికరాలు, రన్‌అప్ వంటి కీలక పదాలను ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. భౌగోళిక విపత్తులకు సంబంధించిన ప్రశ్నల్లో వీటి ఆధారంగా నేరుగా లేదా పరోక్షంగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















