స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జనసేన పార్టీ ఎన్నికల సన్నాహకాలను ముమ్మరం చేస్తోంది. కాకినాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమావేశంలో పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూనే జనసేనకు బలమున్న ప్రాంతాల్లో పోటీకి సిద్ధంగా ఉండాలని సూచించారు.
లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన పార్టీ కమిటీలు క్షేత్రస్థాయిలో పార్టీ బలాబలాలను అంచనా వేయాలని పవన్‌కల్యాణ్ అన్నారు. గెలుపు అవకాశాలు ఉన్న స్థానాలను ముందుగానే గుర్తించి, సమర్థులైన అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. కార్యకర్తలు, స్థానిక నాయకుల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇచ్చి అభ్యర్థుల ఎంపిక చేపట్టాలని స్పష్టం చేశారు.
2024 సాధారణ ఎన్నికల్లో రాష్ట్ర ప్రయోజనాలను, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని జనసేన కొన్ని స్థానాల్లో త్యాగం చేసిందని పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. ఇప్పుడు స్థానిక ఎన్నికలను పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసుకునే అవకాశంగా ఉపయోగించుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు, పరిషత్తు ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు బాధ్యతను మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తీసుకోవాలని సూచించారు. సాధారణ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేసిన కార్యకర్తలకు రాజకీయంగా ఎదిగే అవకాశాలు కల్పించేందుకు నాయకులు సహకరించాలని అన్నారు.
కూటమిలో స్థానిక ఎన్నికల సీట్ల సర్దుబాట్లు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల స్థాయిలోనే చర్చించి పరిష్కరించుకోవాలని పవన్‌కల్యాణ్ సూచించారు. అవసరమైన సందర్భాల్లో ముఖ్యమంత్రితో తానే మాట్లాడతానని తెలిపారు. స్థానిక ఎన్నికల ఫలితాలు జనసేన ప్రతిష్ఠను మరింత పెంచేలా ఉండాలని ఆకాంక్షించారు.
పార్టీలో చేరేందుకు వివిధ ప్రాంతాల నుంచి ఆసక్తి వ్యక్తమవుతోందని, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉన్న సరైన వ్యక్తులను మాత్రమే పార్టీలోకి ఆహ్వానించాలని పవన్‌కల్యాణ్ సూచించారు. సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్, మంత్రి కందుల దుర్గేష్, ఎంపీలు ఉదయ్ శ్రీనివాస్, బాలశౌరి, లింగమనేని రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















