ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ శాఖలు ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
కుంచనపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 105 మండలాల్లో తీవ్ర స్థాయిలో, 208 మండలాల్లో మధ్యస్థ స్థాయిలో వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని అంచనా వేసినట్లు తెలిపారు.
శ్రీసత్యసాయి, అనంతపురం, అన్నమయ్య జిల్లాల్లో వర్షాభావ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, వైఎస్సార్ కడప, తిరుపతి, ప్రకాశం, మార్కాపురం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో మధ్యస్థ స్థాయిలో ప్రభావం ఉండొచ్చని పేర్కొన్నారు.
వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వ్యవసాయ శాఖతో పాటు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించాలని, అవసరమైన విత్తనాలు, ఎరువులను ముందుగానే అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
ఉద్యాన పంటలపై వర్షాభావ ప్రభావం పడకుండా రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు, పంటల మార్పిడిపై అవగాహన కల్పించడం ద్వారా నష్టాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఎల్‌నినో ప్రభావంతో ఎదురయ్యే పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుందని మంత్రి చెప్పారు. తాగునీటి సరఫరా, పశుగ్రాసం, వ్యవసాయ అవసరాల విషయంలో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు.
వర్షపాతం లోటు నమోదయ్యే ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసి, అవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు జిల్లా యంత్రాంగాలు సిద్ధంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. ప్రజలు, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా పనిచేస్తుందని ఆమె తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















