ఒక హిమనీనదం విరిగిపడటంతో నేపాల్‌లో చోటుచేసుకున్న విధ్వంసం ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. అలాంటిది ఏడాది మొత్తం కురవాల్సిన వర్షం కేవలం మూడు రోజుల్లో కురిసి.. ఒకేసారి 62 ఆనకట్టలు తెగిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టం. సరిగ్గా 51 ఏళ్ల క్రితం చైనా ఇలాంటి భయానక జలప్రళయాన్నే ఎదుర్కొంది.
1975లో చోటుచేసుకున్న బాంకియావో డ్యామ్ విషాదం ప్రపంచంలోని అత్యంత ఘోరమైన ఆనకట్ట విపత్తుల్లో ఒకటిగా నిలిచింది. ఆ విపత్తులో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 2.3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు పలు అధ్యయనాలు వెల్లడించాయి.
1975 జులై చివర్లో ఫిలిప్పీన్స్ సముద్రంలో ఏర్పడిన టైఫూన్ నీనా క్రమంగా బలపడి తైవాన్ మీదుగా చైనా వైపు దూసుకొచ్చింది. అనంతరం ఫుజియాన్ ప్రావిన్స్‌లో తీరం దాటిన ఈ తుపాను.. హెనాన్ ప్రాంతంలో అపార నష్టాన్ని మిగిల్చింది.టైఫూన్ ప్రభావంతో అక్కడ కుంభవృష్టి కురిసింది. కేవలం 24 గంటల్లోనే 1000 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ఆగస్టు 5 నుంచి 7 మధ్య మూడు రోజుల్లో ఏకంగా 1605 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
ఈ భారీ వర్షాలకు హెనాన్‌లోని బాంకియావో డ్యామ్‌కు రికార్డు స్థాయిలో వరద నీరు చేరింది. సెకనుకు 13 వేల క్యూబిక్ మీటర్ల వేగంతో నీరు రిజర్వాయర్‌లోకి చేరడంతో ఆనకట్టపై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది.1975 ఆగస్టు 7 అర్ధరాత్రి తర్వాత బాంకియావో డ్యామ్ రక్షణ గోడలపై నుంచి నీరు ప్రవహించడం ప్రారంభమైంది. కొద్ది గంటల్లోనే ఆనకట్ట పూర్తిగా దెబ్బతిని భారీగా నీరు దిగువ ప్రాంతాలకు ప్రవహించింది.
తర్వాతి అధ్యయనాల ప్రకారం.. కేవలం ఆరు గంటల్లోనే డ్యామ్ నుంచి 701 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు బయటకు వెళ్లింది. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వరద నీరు పల్లపు ప్రాంతాలను ముంచెత్తింది.అదే సమయంలో బాంకియావో డ్యామ్‌కు సమీపంలోని సిమన్‌టాన్ డ్యామ్ కూడా విఫలమైంది. అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారం.. ఆ రాత్రి మొత్తం 62 ఆనకట్టలు ధ్వంసమైనట్లు అంచనా.
ఆనకట్టలు తెగిపోవడంతో భారీ వరదలు గ్రామాలు, పట్టణాలను ముంచెత్తాయి. రైల్వే మార్గాలు, రహదారులు, వేలాది ఎకరాల వ్యవసాయ భూములు నీటమునిగాయి.ప్రారంభ అంచనాల ప్రకారం సుమారు 26 వేల మంది వరదల్లో మరణించారు. అయితే ఆ తర్వాత కరువు, అంటువ్యాధులు, ఆహార కొరత కారణంగా మరణాల సంఖ్య మరింత పెరిగింది.
బాధిత ప్రాంతాల్లో వేలాది మంది రోజుల తరబడి నీటిలో చిక్కుకుపోయారు. కొందరు చెట్లపై తలదాచుకున్నారు. మరికొందరు ఆహారం లేక ఆకులు తిని ప్రాణాలు కాపాడుకున్నట్లు పలు కథనాలు వెలువడ్డాయి.ఈ మహా విపత్తు వివరాలను చైనా ప్రభుత్వం చాలా కాలం పాటు బహిరంగంగా వెల్లడించలేదని నివేదికలు పేర్కొన్నాయి. డ్యామ్‌లు కూలిన విషయం మాత్రమే అప్పట్లో కొంతవరకు బయటకు వచ్చింది.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, నష్టంపై సమాచారం దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ప్రపంచానికి తెలిసింది. 1995లో వెలువడిన అధ్యయనాలు ఈ జలప్రళయం తీవ్రతను వెల్లడించాయి
బాంకియావో డ్యామ్‌ను 1951-52 మధ్య చైనాలోని రు నదిపై నిర్మించారు. నిర్మాణం పూర్తయిన కొన్నేళ్లకే డ్యామ్‌లో పగుళ్లు ఏర్పడ్డాయి. తర్వాత సోవియట్ ఇంజినీర్ల సూచనలతో 1955-56 మధ్య మరమ్మతులు చేపట్టారు.
అప్పట్లో దీన్ని ‘ఐరన్ డ్యామ్’గా పిలిచేవారు. కానీ 1975 వరదల్లో ఈ ఆనకట్ట పూర్తిగా విఫలమైంది. అనంతరం 1986-93 మధ్య దీన్ని పునర్నిర్మించారు.ముందస్తు హెచ్చరికలను పట్టించుకోకపోవడం, నిర్వహణ లోపాలు, నిర్మాణ ప్రమాణాలపై నిర్లక్ష్యం వంటి అంశాలు ఈ విపత్తుకు కారణాలుగా పలు అంతర్జాతీయ అధ్యయనాలు పేర్కొన్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















