డెరివేటివ్స్ మార్కెట్‌లో యువత, చిన్న పట్టణాలకు చెందిన పెట్టుబడిదారుల భాగస్వామ్యం గణనీయంగా పెరుగుతోంది. సాధారణంగా రిస్క్‌ను తగ్గించుకోవడానికి, హెడ్జింగ్ కోసం ఉపయోగించాల్సిన డెరివేటివ్స్‌లో అధిక లాభాల కోసం వ్యక్తిగత ట్రేడర్లు భారీగా ప్రవేశిస్తున్నారు. అయితే ఈ విభాగంలో నష్టపోతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సెబీ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
30 ఏళ్లలోపు వయసున్న ట్రేడర్లు మొత్తం వ్యక్తిగత డెరివేటివ్స్ ట్రేడర్లలో 43 శాతంగా ఉన్నారు. నాలుగేళ్ల క్రితం వీరి వాటా 31 శాతంగా ఉండగా.. ఇప్పుడు గణనీయంగా పెరిగింది. అయితే యువతలో డెరివేటివ్స్ ట్రేడింగ్ పెరుగుతున్న కొద్దీ నష్టపోయే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో 30 ఏళ్లలోపు ట్రేడర్లలో దాదాపు 89 శాతం మంది నష్టాలను చవిచూశారు.
మరోవైపు 60 ఏళ్లు పైబడిన ట్రేడర్లలో నష్టపోయిన వారి వాటా 81 శాతంగా ఉంది. అంటే వయసుతో సంబంధం లేకుండా డెరివేటివ్స్ ట్రేడింగ్‌లో నష్టాల ముప్పు అధికంగా ఉన్నప్పటికీ.. యువ ట్రేడర్లలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తోంది.
వ్యక్తిగత డెరివేటివ్స్ ట్రేడర్లలో దాదాపు మూడొంతుల మంది వార్షికంగా రూ.5 లక్షల కంటే తక్కువ ఆదాయం కలిగినవారే. డెరివేటివ్స్ మొత్తం టర్నోవర్‌లో ఈ వర్గం వాటా 43 శాతంగా ఉంది. అయితే మొత్తం నష్టాల్లో వీరి వాటా ఏకంగా 53 శాతానికి చేరింది. ఈ ఆదాయ వర్గానికి చెందిన దాదాపు 88 శాతం మంది ట్రేడర్లు నష్టపోయారు.
రూ.1 కోటి కంటే ఎక్కువ వార్షికాదాయం ఉన్న ట్రేడర్లలోనూ 81 శాతం మంది నష్టపోయినప్పటికీ.. తక్కువ ఆదాయ వర్గంతో పోలిస్తే నష్టాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.
డెరివేటివ్స్ మార్కెట్‌లో వ్యక్తిగత ట్రేడర్లలో దాదాపు మూడింట రెండొంతుల మంది మెట్రో నగరాలకు వెలుపల ఉన్న చిన్న పట్టణాలు, ఇతర ప్రాంతాలకు చెందినవారే. డెరివేటివ్స్ టర్నోవర్‌లో వీరి వాటా సుమారు 50 శాతంగా ఉంది.
మ్యూచువల్ ఫండ్లలో చిన్న పట్టణాల పెట్టుబడిదారుల వాటా దాదాపు నాలుగో వంతు మాత్రమే. దీనితో పోలిస్తే డెరివేటివ్స్ మార్కెట్‌లో వారి భాగస్వామ్యం చాలా ఎక్కువగా ఉండటం గమనార్హం.
2025-26లో దాదాపు 95 లక్షల మంది వ్యక్తిగత డెరివేటివ్స్ ట్రేడర్ల ఈక్విటీ పోర్ట్‌ఫోలియో విలువ రూ.1 లక్ష కంటే తక్కువగా ఉంది. ఇది మొత్తం వ్యక్తిగత డెరివేటివ్స్ ట్రేడర్లలో 78 శాతం. అయితే డెరివేటివ్స్ టర్నోవర్‌లో వీరి వాటా 51 శాతంగా ఉంది. మొత్తం నష్టాల్లో వీరి వాటా ఏకంగా 70 శాతానికి చేరింది.
ఇక రూ.లక్ష కంటే తక్కువ విలువైన ఈక్విటీ పోర్ట్‌ఫోలియో ఉన్నప్పటికీ.. రూ.1 కోటి కంటే ఎక్కువ విలువైన డెరివేటివ్స్ టర్నోవర్ నిర్వహిస్తున్న ట్రేడర్లు మొత్తం ట్రేడర్లలో 13 శాతంగా ఉన్నారు. మొత్తం నష్టాల్లో వీరి వాటా 52 శాతంగా నమోదైంది.
దాదాపు 43 లక్షల మంది ట్రేడర్ల ఖాతాల్లో ఎలాంటి షేర్లు లేవని సెబీ అధ్యయనం వెల్లడించింది. వీరు వ్యక్తిగత డెరివేటివ్స్ మార్కెట్‌లో భాగస్వామ్యం వహిస్తున్న మొత్తం ట్రేడర్లలో 35 శాతంగా ఉన్నారు. అంటే ఈ పెట్టుబడిదారులు ఈక్విటీ షేర్లలో పెట్టుబడి లేకుండానే నేరుగా డెరివేటివ్స్ ట్రేడింగ్ చేస్తున్నారు.
డెరివేటివ్స్ మార్కెట్‌లో వ్యక్తిగత ట్రేడర్ల సంఖ్య మాత్రం తగ్గింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1.06 కోట్లుగా ఉన్న వ్యక్తిగత ట్రేడర్ల సంఖ్య.. 2025-26లో 18 శాతం తగ్గి 87.5 లక్షలకు చేరింది.
వయసు, ఆదాయం, ప్రాంతం, ట్రేడింగ్ స్థాయి, ఈక్విటీ పోర్ట్‌ఫోలియో పరిమాణం వంటి అంశాలు డెరివేటివ్స్ ట్రేడింగ్‌లో నష్టాలపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో సెబీ తన అధ్యయనంలో విశ్లేషించింది. మొత్తంగా చూస్తే.. అధిక లాభాల ఆశతో డెరివేటివ్స్‌లోకి వస్తున్న చిన్న పెట్టుబడిదారులు, ముఖ్యంగా యువత, భారీ రిస్క్‌ను ఎదుర్కొంటున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















