హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రుల వైద్య బృందం చేసిన తాజా అధ్యయనంలో బరువు తగ్గించే చికిత్సల్లో సెమాగ్లుటైడ్ (14 ఎంజీ హార్మోనల్ మాత్ర) కంటే ‘ఎండోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రోప్లాస్టీ’ (ఈఎస్‌జీ) విధానం స్వల్పకాలంలో వేగవంతమైన ఫలితాలు ఇస్తోందని వెల్లడైంది. అయితే దీర్ఘకాలంలో చూస్తే రెండు విధానాల ఫలితాలు దాదాపు సమానంగా ఉన్నాయని పరిశోధన తేల్చింది.
సెమాగ్లుటైడ్ అనేది ఆకలిని నియంత్రించే హార్మోనల్ ఔషధం. దీన్ని రోజూ తీసుకోవాల్సి ఉండటం, దీర్ఘకాలం కొనసాగించాల్సిన అవసరం ఉండటం, ఖర్చు ఎక్కువగా ఉండటం వంటి అంశాలు దీనికి పరిమితులుగా ఉన్నాయి. మరోవైపు ఈఎస్‌జీ అనేది కోతలు లేకుండా చేసే ఆధునిక ఎండోస్కోపిక్ విధానం. నోటి ద్వారా ఎండోస్కోప్‌ను పంపించి కడుపు లోపలి భాగంలో కుట్లు వేసి దాని పరిమాణాన్ని తగ్గిస్తారు. దీంతో తక్కువ ఆహారం తీసుకున్నా త్వరగా తృప్తి కలుగుతుంది. ఈ ప్రక్రియ సుమారు 45 నిమిషాల్లో పూర్తవుతుంది.
ఈ అధ్యయనాన్ని ఏఐజీ ఆసుపత్రుల నిపుణులు డి. నాగేశ్వర్‌రెడ్డి, నితిన్ జగ్తాప్, రాకేశ్ కలపాల, అమన్, అనుదీప్, హార్దిక్, కృతి, ప్రియాంక తదితరులు కలిసి నిర్వహించారు. జనవరి 2024 నుంచి ఏప్రిల్ 2025 మధ్యకాలంలో ఊబకాయంతో బాధపడుతున్న 150 మంది రోగులను పరిశీలించారు. వీరిలో 50 మందికి ఈఎస్‌జీ చేయగా, 100 మందికి సెమాగ్లుటైడ్ మాత్రలు ఇచ్చారు.
ఆరు నెలల అనంతరం విశ్లేషణలో సెమాగ్లుటైడ్ గ్రూప్‌లో సగటు బరువు తగ్గుదల 8.67% కాగా, ఈఎస్‌జీ గ్రూప్‌లో 12.72%గా నమోదైంది. కనీసం 10% బరువు తగ్గిన వారు ఈఎస్‌జీలో 70% మంది ఉండగా, మాత్రలు తీసుకున్న వారిలో 43% మాత్రమే ఉన్నారు. అలాగే 15% లేదా అంతకంటే ఎక్కువ బరువు తగ్గిన వారు ఈఎస్‌జీలో 36% మంది ఉండగా, సెమాగ్లుటైడ్ గ్రూప్‌లో కేవలం 7% మాత్రమే ఉన్నారు.
అయితే 12 నెలల తర్వాత రెండు గ్రూపుల మధ్య తేడా తగ్గిపోయింది. సెమాగ్లుటైడ్ ద్వారా సగటు బరువు తగ్గుదల 10.91% కాగా, ఈఎస్‌జీ ద్వారా 11.92%గా నమోదైంది. దీని ప్రకారం దీర్ఘకాలంలో రెండు విధానాల ప్రభావం దాదాపు సమానమని తేలింది.
మాత్రల చికిత్సలో సుదీర్ఘకాలం వాడాల్సిన అవసరం, ఖర్చు భారం, కొన్ని దుష్ప్రభావాల కారణంగా కొందరు మధ్యలో చికిత్స నిలిపివేస్తున్నారని పరిశోధకులు గుర్తించారు. అదే సమయంలో ఈఎస్‌జీ చేయించుకున్నవారిలో ప్రారంభంలోనే వేగంగా బరువు తగ్గడం వల్ల మంచి ప్రోత్సాహం లభించినట్లు అధ్యయనంలో పేర్కొన్నారు. ఈ పరిశోధన వివరాలు అంతర్జాతీయ జర్నల్ ‘ఎండోస్కోపీ’లో ప్రచురితమయ్యాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















