కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి రానున్న నేపథ్యంలో ఇ-ఫైలింగ్ వ్యవస్థను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని పార్లమెంటరీ సంఘం ఆదాయపు పన్ను శాఖకు సూచించింది. 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రానున్న సరళీకృత ఆదాయపు పన్ను చట్టం–2025 కోసం ఇ-ఫైలింగ్ పోర్టల్, సంబంధిత ఐటీ వ్యవస్థలను ముందుగానే నిశితంగా పరీక్షించాలని ఆదేశించింది.
ఆరు దశాబ్దాలుగా అమల్లో ఉన్న ఆదాయపు పన్ను చట్టం–1961 స్థానంలో ఈ కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇది 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ భర్తృహరి మహతాబ్ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల స్థాయీసంఘానికి ఆదాయపు పన్ను శాఖ నివేదిక సమర్పించింది.
కొత్త చట్టం అమలుకు సంబంధించి మొత్తం 190 ఫారాలు నోటిఫై చేయాల్సి ఉండగా, 2026 మార్చి 31 నాటికి వాటిలో 54 ఫారాలే సిద్ధమవుతాయని ఐటీ శాఖ వెల్లడించింది. మిగిలిన ఫారాలను దశల వారీగా విడుదల చేస్తామని తెలిపింది. పన్ను చెల్లింపుదారులు మరియు నిపుణులు కొత్త విధానానికి అలవాటు పడేందుకు అవసరమైన సమయం కల్పించాలనే ఉద్దేశంతో ఫారాలు, నిబంధనల నోటిఫికేషన్‌ను వేగవంతం చేయాలని కమిటీ సూచించింది.
గతంలో 2025 సెప్టెంబరులో ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో వచ్చిన సాంకేతిక లోపాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ముందుగానే పూర్తి స్థాయి పరీక్షలు నిర్వహించాలని ప్యానెల్ స్పష్టం చేసింది. లోడ్ టెస్టింగ్, స్ట్రెస్ టెస్టింగ్ వంటి ప్రక్రియల ద్వారా వ్యవస్థ సామర్థ్యాన్ని పరిశీలించాలని సూచించింది.
2026-27 ఆర్థిక సంవత్సరంలో ఐటీ శాఖ తన డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు రూ.1,200 కోట్లు కేటాయించినట్లు కమిటీ తెలిపింది. కొత్త రిటర్నులు భారీగా వచ్చేవేళ, పాత డేటాను అనుసంధానం చేయగల సామర్థ్యం సాఫ్ట్‌వేర్‌కు ఉండాలని కూడా పేర్కొంది.
అదే సమయంలో అధికారులకు శిక్షణ ఇవ్వడంపైనా కమిటీ దృష్టి సారించింది. కొత్త చట్టం అమలుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో అధికారులు సిద్ధంగా ఉండేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. అలాగే ప్రజలకు అవగాహన కల్పించేందుకు మల్టీమీడియా ప్రచారం కోసం రూ.27 కోట్లు కేటాయించినట్లు వెల్లడించింది.
ప్రచార కార్యక్రమాల సమయంలో పన్ను చెల్లింపుదారుల నుంచి వచ్చే సూచనలు, అభిప్రాయాలను స్వీకరించి వాటి ఆధారంగా సమస్యలను త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కమిటీ సూచించింది. కొత్త పన్ను విధానం అమలులో ఎలాంటి సాంకేతిక అంతరాయాలు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేసింది.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews Business BusinessNews ChandrababuNaidu Chandrababu naidu CricketNews CrimeNews Entertainment EntertainmentNews Geopolitics Government HealthyLifestyle India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews SportsNews Tdp Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood WorldNews



















