సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇంద్రేశం పురపాలిక పరిధిలో వినాయక నిమజ్జన వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెద్దకంజర్ల నేరేడు చెరువులో గణేశ్ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా ప్రమాదం సంభవించి ఆరుగురు విద్యార్థులు నీట మునిగి మృతి చెందారు. విగ్రహం ఒక వైపునకు ఒరిగి విద్యార్థులపై పడటంతో ఈ దుర్ఘటన జరిగినట్లు స్థానికులు, పోలీసులు తెలిపారు.
శిరీష ట్రస్టు ఆశ్రమానికి చెందిన ఎనిమిది మంది విద్యార్థులు బుధవారం సాయంత్రం వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు చెరువులోకి వెళ్లారు. విగ్రహాన్ని చెరువులోని లోతైన ప్రాంతానికి తీసుకెళ్లి నిమజ్జనం చేసే క్రమంలో ఒక్కసారిగా అది అదుపుతప్పి ఒక వైపునకు ఒరిగి విద్యార్థులపై పడింది. దీంతో వారు నీటిలో చిక్కుకుపోయారు.
ఈ ప్రమాదంలో నర్సింహరాజు (22), సుమంత్‌రెడ్డి (17), గణేశ్ (18), సిద్దార్థ్ (17), శ్యాంకుమార్ (17), ఉదయ్‌కిరణ్ (17) నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు విద్యార్థులు వర్షిత్, అఖిల్ ఈత కొట్టుకుంటూ సురక్షితంగా బయటకు వచ్చారు.
స్థానికుల వివరాల ప్రకారం.. శిరీష ట్రస్టుకు చెందిన వినాయక విగ్రహాన్ని గత మూడేళ్లుగా ఇదే చెరువులో నిమజ్జనం చేస్తున్నారు. ఈసారి కూడా విద్యార్థులు విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు చెరువులోకి తీసుకెళ్లారు. అయితే చెరువు లోతైన ప్రాంతానికి వెళ్లవద్దని వార్డెన్‌తోపాటు స్థానికులు ముందుగానే సూచించినట్లు తెలుస్తోంది.
అయినప్పటికీ విద్యార్థులు విగ్రహాన్ని లోతైన ప్రాంతానికి తీసుకెళ్లి నిమజ్జనం చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విగ్రహం ఒక్కసారిగా ఒక వైపునకు ఒరిగి వారిపై పడటంతో ప్రమాదం జరిగింది.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, ట్రస్టు నిర్వాహకులు స్పందించి విద్యార్థులను బయటకు తీసి పటాన్‌చెరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆరుగురికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఏపీకి చెందిన కృష్ణంరాజు తన కుమార్తె శిరీష పేరుతో ట్రస్టును ఏర్పాటు చేసి నిరుపేద విద్యార్థులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. తొలినాళ్లలో తల్లిదండ్రులు లేని విద్యార్థులకు వసతి కల్పించిన ట్రస్టు.. ప్రస్తుతం వారితోపాటు నిరుపేద విద్యార్థులకు విద్యను అందిస్తోంది.
ఈ ఘటనతో శిరీష ట్రస్టులో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఘటనపై పోలీసులు వివరాలు సేకరించి తదుపరి చర్యలు చేపట్టారు.
విద్యార్థుల మృతిపై తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















