పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (PTI) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతున్న వేళ ఆ దేశ సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జైలులో ఉన్న ఇమ్రాన్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించి అవసరమైన వైద్య చికిత్స అందించాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించింది. ఆయన ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తోందంటూ కుటుంబ సభ్యులు, PTI నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో న్యాయస్థానం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది.
ఇమ్రాన్ ఖాన్ వైద్య నివేదికలను పరిశీలించిన అనంతరం ఆయనకు మెరుగైన వైద్యం అవసరమని కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం రావల్పిండిలోని ఆడియాలా జైలులో ఉన్న ఆయనను ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి తరలించాలని వారు కోరుతున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలను PTI అధికార ప్రతినిధి జుల్ఫికర్ బుఖారీ స్వాగతించారు. ఈ చర్యలు ఇంతకుముందే తీసుకుని ఉంటే ఇమ్రాన్ ఆరోగ్యం ఇంతగా క్షీణించేది కాదని ఆయన వ్యాఖ్యానించారు.
ఇమ్రాన్ పూర్తిగా కోలుకునే వరకు ప్రైవేట్ వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని బుఖారీ కోర్టును కోరారు. జైలులో ఆయనకు అందుతున్న వైద్య సేవలపై కూడా పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇమ్రాన్‌కు సంబంధించిన వైద్య నివేదికలను నిపుణులతో కలిసి పరిశీలించినట్లు ఆయన తెలిపారు. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇమ్రాన్ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని పేర్కొన్నారు.
మూడేళ్లుగా కొనసాగుతున్న జైలు జీవితం, ఒంటరితనం కారణంగా ఇమ్రాన్ తీవ్ర మానసిక, శారీరక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ఆరిఫ్ అల్వీ పేర్కొన్నారు. రాజకీయంగా ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ గతంలో ఇమ్రాన్ ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొనేవారని.. అయితే జైలు జీవితం ఆయనపై తీవ్ర ప్రభావం చూపుతోందని అన్నారు.
గత ఏడు నెలలుగా కుటుంబ సభ్యులు, పార్టీ నేతల పరిస్థితి ఎలా ఉందో, దేశంలో ఏం జరుగుతోందో కూడా ఇమ్రాన్‌కు పూర్తిగా తెలియని పరిస్థితి నెలకొందని ఆరిఫ్ అల్వీ పేర్కొన్నారు. ఈ కారణంగానే ఆయన మానసికంగా మరింత కుంగిపోతున్నారని చెప్పారు.
మరోవైపు ఇమ్రాన్ ఖాన్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ PTI కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు. ఇమ్రాన్‌కు మెరుగైన వైద్య చికిత్స అందించాలని, ఆయన ఆరోగ్య పరిస్థితిపై పారదర్శకంగా సమాచారం వెల్లడించాలని పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
తోషాఖానా, అల్-ఖాదిర్ ట్రస్ట్ తదితర కేసుల్లో శిక్షలు పడటంతో ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం రావల్పిండిలోని ఆడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఆయనను జైలు నుంచి ఆస్పత్రికి తరలించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈ అంశం మరోసారి పాకిస్థాన్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















