కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి (జాను) అదృశ్యం కేసు ఇంకా మిస్టరీగానే కొనసాగుతోంది. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపడుతుండగా, తాజాగా ఓ కారు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
జాను కనిపించకుండా పోయిన రోజు గ్రామంలో అనుమానాస్పదంగా తిరిగిన ఓ కారుపై స్థానికులు, కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ఆ కారు కదలికలు నమోదైనట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తాజాగా అదే కారు నర్సీపట్నం ప్రాంతంలో జాను బంధువును ఢీకొట్టిందని వారు ఆరోపించడం కలకలం రేపింది.
జానుకు వరుసకు తాత అయ్యే కోటేశ్వరరావు.. చిన్నారి ఆచూకీ కోసం నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో గోడప్రతులు అంటించే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం మాకవారిపాలెం సమీపంలో మరో వ్యక్తితో కలిసి గోడప్రతులు అంటిస్తుండగా ఓ కారు ఆయనను ఢీకొట్టిందని తెలిపారు. ప్రమాదం అనంతరం కారు ఆపకుండా వెళ్లిపోయిందని, తనను ఢీకొట్టిన వాహనం గతంలో జాను అదృశ్యమైన రోజు గ్రామంలో కనిపించిన కారేనని అనుమానం వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై పోలీసులు అప్రమత్తమయ్యారు. కారు ఢీకొన్న ప్రాంతంలోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించే పనిలో ఉన్నారు. మరోవైపు జాను అదృశ్యమైన రోజు గ్రామంలో తిరిగిన కారును ఇప్పటికే సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించామని తుని గ్రామీణ పోలీసులు తెలిపారు.
తుని గ్రామీణ సీఐ చెన్నకేశవరరావు మాట్లాడుతూ.. ఆ కారు గ్రామంలోని ఓ శుభకార్యానికి వచ్చిన వ్యక్తులదని ప్రాథమికంగా గుర్తించామని, చిన్నారి అదృశ్య ఘటనతో ఆ వాహనానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. అయినప్పటికీ ప్రతి అనుమానాన్ని పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు.
జాను అదృశ్యమైన ఘటనపై పోలీసులు పలు కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. చిన్నారి ఆచూకీ కోసం వివిధ ప్రాంతాల్లో గాలింపు చేపడుతూ, పోస్టర్లు ఏర్పాటు చేసి ప్రజల సహకారం కోరుతున్నారు.
ఇదిలా ఉండగా.. జాను తండ్రి గణేష్‌కు గతంలో ఓ కారు విషయంలో వివాదం ఏర్పడి తర్వాత పరిష్కారమైందని సమాచారం. తాజాగా కారు వ్యవహారం తెరపైకి రావడంతో ఆ అంశం మరోసారి చర్చకు దారితీసింది. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాతే స్పష్టత వస్తుందని పోలీసులు చెబుతున్నారు.
చిన్నారి జ్ఞానేశ్వరి క్షేమంగా తిరిగి రావాలని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆశిస్తున్నారు. కేసులో ప్రతి చిన్న ఆధారాన్ని పరిశీలిస్తూ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















