సామాజిక మాధ్యమాల వేదికగా అసభ్యకర పోస్టులు, తప్పుడు సమాచారం, వ్యక్తుల ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రచారాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి వంగలపూడి అనిత పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ తరహా నేరాలు వ్యక్తిగత స్థాయిలో కాకుండా వ్యవస్థీకృత నెట్‌వర్క్‌ల ద్వారా జరుగుతున్న నేపథ్యంలో సాంకేతిక ఆధారాలతో లోతైన దర్యాప్తు చేపట్టాలని సూచించారు.
మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాతో కలిసి హోంమంత్రి అనిత ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితి, సైబర్ నేరాల నియంత్రణ, సోషల్ మీడియా దుర్వినియోగం, భూ వివాదాల పరిష్కారం తదితర అంశాలపై సమీక్షించారు.
సోషల్ మీడియాలో వచ్చే ప్రతి విమర్శను నేరంగా పరిగణించకూడదని, ప్రజాస్వామ్య వ్యవస్థలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, చట్టబద్ధమైన విమర్శలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టాలని హోంమంత్రి స్పష్టం చేశారు. అయితే ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, వ్యక్తులపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారిపై దుష్ప్రచారం చేయడం వంటి చర్యలను ఉపేక్షించబోమని తెలిపారు.
గత రెండేళ్లలో సోషల్ మీడియా నేరాలకు సంబంధించి 1,665 కేసులు నమోదు చేసినట్లు హోంమంత్రి వెల్లడించారు. అభ్యంతరకరమైన పోస్టులకు సంబంధించిన 12,653 వెబ్‌లింక్‌లను సహయోగ్ పోర్టల్ ద్వారా తొలగించినట్లు తెలిపారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు, వేగంగా స్పందించే వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు.
రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో సైబర్ గార్డ్ యూనిట్లు, ప్రత్యేక జిల్లా సోషల్ మీడియా యూనిట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ విభాగాలు సోషల్ మీడియా కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, నేరపూరిత అంశాలను గుర్తించి తక్షణ చర్యలు తీసుకునేలా పనిచేయాలని చెప్పారు.
రాజకీయ ప్రముఖుల పర్యటనలు, ప్రజా కార్యక్రమాల సమయంలో భద్రతా ఏర్పాట్లపై కూడా హోంమంత్రి సమీక్షించారు. సున్నిత ప్రాంతాల్లో రాజకీయ పర్యటనల నిర్వహణకు స్పష్టమైన ప్రామాణిక నిర్వహణ విధానాలు (ఎస్‌ఓపీలు) రూపొందించాలని సూచించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని పోలీసు అధికారులకు తెలిపారు.
భూ వివాదాలపై వచ్చే ఫిర్యాదులను ప్రాధాన్యతగా తీసుకుని నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని హోంమంత్రి ఆదేశించారు. భూ సమస్యల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా రెవెన్యూ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, సైబర్ నేరాల నియంత్రణ, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని హోంమంత్రి అనిత తెలిపారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ నేరాలపై సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















