రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు భారీ పన్ను ఊరట లభించింది. 2019-20 మదింపు సంవత్సరానికి సంబంధించి రూ.11,003 కోట్ల ఖర్చులపై పన్ను మినహాయింపును తిరస్కరిస్తూ పన్ను అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఐటీఏటీ) రద్దు చేసింది. జియోకు సంబంధించిన ఈ తీర్పును ఆంగ్ల పత్రికలు వెల్లడించాయి.
జియో తన పద్దు పుస్తకాల్లో రూ.11,003 కోట్ల వ్యయాన్ని ‘కేపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్’ కింద మూలధన వ్యయంగా చూపించింది. అయితే పన్ను మదింపులో మాత్రం అదే మొత్తాన్ని రెవెన్యూ వ్యయంగా పేర్కొంటూ మినహాయింపును కోరింది. దీంతో ఆదాయపు పన్ను శాఖ, జియో మధ్య వివాదం తలెత్తింది.
ఈ వ్యయాల్లో ఇంటర్‌కనెక్ట్ ఛార్జీలు, ఉద్యోగుల ఖర్చులు, వృత్తిపరమైన సేవల రుసుములు, విద్యుత్, ఇంధనం, మరమ్మతులు, నిర్వహణ, నెట్‌వర్క్ నిర్వహణ వంటి పలు అంశాలు ఉన్నాయి. ఇవన్నీ టెలికాం నెట్‌వర్క్ మెరుగుదల, అప్‌గ్రేడేషన్‌కు సంబంధించినవని పన్ను అధికారులు పేర్కొన్నారు.
ఈ ఖర్చులను మూలధన వ్యయంగా పరిగణించాలని పన్ను అధికారులు అభిప్రాయపడ్డారు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 32 ప్రకారం వీటిపై తరుగుదల ప్రయోజనం మాత్రమే వర్తిస్తుందని పేర్కొంటూ, మొత్తం రూ.11,003 కోట్లను రెవెన్యూ వ్యయంగా పన్ను మినహాయింపుకు అనుమతించలేదు.
అయితే జియో వాదనతో ఐటీఏటీ ఏకీభవించింది. ఒక సంస్థ తన అకౌంటింగ్ విధానంలో ఒక ఖర్చును ఏ విధంగా చూపించిందన్నది, పన్ను ప్రయోజనాల కోసం అదే విధంగా చూపించాలనే కచ్చితమైన నిబంధన లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.
జ్యుడీషియల్ సభ్యుడు అమిత్ శుక్లా, అకౌంటెంట్ సభ్యుడు అరుణ్ ఖోడ్పియాలతో కూడిన ఐటీఏటీ బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక వ్యయాన్ని మూలధన వ్యయంగా పరిగణించాలంటే కేవలం నెట్‌వర్క్ మెరుగుదల లేదా అప్‌గ్రేడేషన్ జరిగిందనే కారణం సరిపోదని తెలిపింది.
ఆ ఖర్చుతో కొత్త మూలధన ఆస్తి ఏర్పడిందా? ఇప్పటికే ఉన్న లాభదాయక ఆస్తి సామర్థ్యం లేదా విస్తరణకు అది దోహదపడిందా? లేకపోతే ప్రస్తుత మౌలిక సదుపాయాల నిర్వహణకే పరిమితమైందా? అనే అంశాలను పరిశీలించాలని పేర్కొంది.
టెలికాం సంస్థలు వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత కూడా తమ మౌలిక సదుపాయాలను నిరంతరం బలోపేతం చేయాల్సి ఉంటుందని ట్రైబ్యునల్ పేర్కొంది. నెట్‌వర్క్ ఆప్టిమైజేషన్, నిర్వహణ, సామర్థ్య పెంపునకు అయ్యే ప్రతి ఖర్చును మూలధన వ్యయంగా పరిగణించలేమని స్పష్టం చేసింది.
రూ.11,003 కోట్ల ఖర్చుల స్వభావం, ఉద్దేశాన్ని విడివిడిగా పరిశీలించకుండా మొత్తం మొత్తాన్ని మూలధన వ్యయంగా పరిగణించినందుకు అసెసింగ్ అధికారిని ధర్మాసనం తప్పుబట్టింది.
ఐటీఏటీ తీర్పుతో 2019-20 మదింపు సంవత్సరానికి సంబంధించిన రూ.11,003 కోట్ల వ్యయాలపై జియోకు గణనీయమైన పన్ను ప్రయోజనం లభించే అవకాశం ఏర్పడింది. ముఖ్యంగా టెలికాం రంగంలో నెట్‌వర్క్ నిర్వహణ, మెరుగుదల, అప్‌గ్రేడేషన్‌కు సంబంధించిన భారీ వ్యయాలను పన్ను పరంగా ఎలా పరిగణించాలన్న అంశంపై ఈ తీర్పు ప్రాధాన్యం సంతరించుకుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















