దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఉత్తరాంధ్ర ప్రజల కల సాకారమైంది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలు అనకాపల్లి ప్రాంతానికి చేరుకోవడంతో రైతులు, ప్రజల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో గోదావరి జలాలకు ఘన స్వాగతం పలికారు. జలహారతి కార్యక్రమానికి అనకాపల్లి జిల్లాతోపాటు పరిసర ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చారు.
పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలించే ప్రక్రియలో భాగంగా నీటిని అనకాపల్లి వైపు విడుదల చేశారు. కాలువలోకి గోదావరి నీరు ప్రవహిస్తుండటాన్ని చూసిన రైతులు, మహిళలు, స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. మహిళలు కాలువకు ఇరువైపులా నిలబడి పూలు చల్లుతూ గోదారమ్మకు స్వాగతం పలికారు.
జలహారతి కార్యక్రమానికి వేలాది మంది ప్రజలు హాజరై ఈ చారిత్రక ఘట్టానికి సాక్షులుగా నిలిచారు. పలువురు తమ సెల్‌ఫోన్లలో నీటి ప్రవాహాన్ని ఫొటోలు, వీడియోలుగా చిత్రీకరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నీటిని అనకాపల్లి వైపు విడుదల చేసిన సమయంలో ప్రజలు చేతులెత్తి నమస్కరించారు.
జలహారతి కార్యక్రమానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు మార్గమధ్యంలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. పాయకరావుపేట–నర్సీపట్నం కూడలి నుంచి కార్యక్రమ ప్రాంగణం వరకు భారీగా ప్రజలు బారులు తీరారు. రైతులు తమలపాకులతో ప్రత్యేకంగా తయారు చేసిన గజమాలతో సీఎంను సత్కరించారు.
దారిపొడవునా మహిళలు, రైతులు, స్థానికులు పూలు చల్లుతూ చంద్రబాబుకు స్వాగతం పలికారు. కళాకారుల తప్పెటగుళ్లు, కోలాటం ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం ముందుకు సాగారు.
పోలవరం ఎడమ ప్రధాన కాలువ రెగ్యులేటర్ వద్దకు చేరుకున్న చంద్రబాబు నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం కాలువలోకి వెళ్లి గోదావరి జలాలను దగ్గరగా పరిశీలించారు. పూలు, వస్త్రాలు, పండ్లు సమర్పించి జలహారతి నిర్వహించారు.
గోదావరి పవిత్ర జలాలను తలపై చల్లుకున్న చంద్రబాబు.. అక్కడున్న ప్రజలపైనా చల్లారు. అనంతరం నీటిని దోసిటితో పట్టుకుని మహిళా రైతుల హారతి పళ్లాల్లో నింపారు. గోదావరి జలాలకు సాష్టాంగ నమస్కారం చేసి ఉత్తరాంధ్ర ప్రజలతో తన అనుబంధాన్ని చాటుకున్నారు.
గోదావరి జలాలు తమ ప్రాంతానికి చేరుకోవడంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి. వర్షాలు సరిగా లేక బోర్లు ఎండిపోతున్న సమయంలో కాలువ నీరు అందుబాటులోకి రావడం తమకు ఎంతో ఊరటనిస్తోందని రైతులు చెబుతున్నారు.
పంటలకు సాగునీరు అందడంతో వ్యవసాయ భూములు పచ్చగా మారుతాయని, దిగుబడులు పెరిగే అవకాశం ఉంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి జలాల రాక తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపిందని పలువురు రైతులు పేర్కొన్నారు.
పోలవరం ఎడమ కాలువ ద్వారా వచ్చే నీటిని వినియోగించుకుని విశాఖ నగరానికి అవసరమైన తాగునీటిని అందించే ప్రణాళికను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. నీటి లభ్యతతో ఉత్తరాంధ్రలో వ్యవసాయంతోపాటు తాగునీటి అవసరాలు కూడా మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
పోలవరం ఎడమ కాలువ పనుల్లో కీలక పాత్ర పోషించిన ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు, కార్మికులు, అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. పనుల పురోగతిని పరిశీలించి వారికి ప్రశంసపత్రాలు, జ్ఞాపికలు అందించారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని ప్రత్యేకంగా సత్కరించారు.
గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు చేరిన ఈ ఘట్టాన్ని ప్రజలు చారిత్రక సందర్భంగా అభివర్ణించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తమ కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















