ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ కొత్త వ్యాపార రంగాల్లో విస్తరిస్తోంది. ఇందులో భాగంగా అల్యూమినియం ఉత్పత్తి, అల్యూమినా రిఫైనింగ్ రంగాల్లోకి ప్రవేశించే అవకాశాలను కంపెనీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రాథమిక స్థాయిలో సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు ఆంగ్ల పత్రికలు వెల్లడించాయి.
ఇంధన రంగంలో తనకున్న సామర్థ్యాలను ఉపయోగించుకుని అల్యూమినియం పరిశ్రమలోకి ప్రవేశించాలన్నది రిలయన్స్ వ్యూహంగా కనిపిస్తోంది. అల్యూమినా శుద్ధి, అల్యూమినియం ఉత్పత్తికి భారీగా విద్యుత్, ఇంధనం అవసరం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టాలని ప్రతిపాదించిన కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుతో అల్యూమినియం తయారీ కార్యకలాపాలను అనుసంధానించే అవకాశాలను కంపెనీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని రేచర్ల, చింతలపూడి బొగ్గు క్షేత్రాలను దక్కించుకున్న రిలయన్స్.. అక్కడ భూగర్భ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. సుమారు రూ.2.73 లక్షల కోట్ల పెట్టుబడితో 30 ఏళ్ల కాలంలో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలన్న ప్రణాళిక ఉంది. బొగ్గును సింథసిస్ గ్యాస్‌గా మార్చి, దాని ద్వారా లభించే ఇంధనాన్ని సొంత పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తే ఉత్పత్తి వ్యయాన్ని నియంత్రించవచ్చని కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం.
అల్యూమినియం తయారీకి కీలకమైన ముడి పదార్థమైన బాక్సైట్ విషయంలోనూ రిలయన్స్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఒడిశాలో సుమారు 20 కోట్ల టన్నుల నిల్వలు ఉన్న కర్లాపట్ బాక్సైట్ బ్లాక్ టెండర్ డాక్యుమెంట్లను రిలయన్స్ కొనుగోలు చేసింది. ఈ బ్లాక్ కోసం రిలయన్స్‌తో పాటు అదానీ గ్రూప్ కూడా ఆసక్తి చూపింది. అయితే 175 శాతం వేలం ప్రీమియంతో వేదాంతా గ్రూప్‌నకు చెందిన బాల్కో ముందంజలో నిలిచింది.
అల్యూమినియం రంగంలోకి రిలయన్స్ ప్రవేశిస్తే, ఇప్పటికే భారీ ప్రాజెక్టును ప్రకటించిన అదానీ గ్రూప్‌తో నేరుగా పోటీ ఏర్పడే అవకాశం ఉంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్.. యూఏఈకి చెందిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ భాగస్వామ్యంతో ఒడిశాలో సుమారు 11.5 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏటా 20 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన అల్యూమినియం ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
ప్రస్తుతం దేశంలో అల్యూమినియం ఉత్పత్తిలో వేదాంతా అగ్రస్థానంలో ఉంది. ఆ సంస్థ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం సుమారు 25 లక్షల టన్నులు. తర్వాత హిందాల్కో సుమారు 14 లక్షల టన్నులు, నాల్కో సుమారు 5 లక్షల టన్నుల సామర్థ్యంతో ఉన్నాయి. రిలయన్స్ ఈ రంగంలోకి ప్రవేశిస్తే దేశీయ అల్యూమినియం పరిశ్రమలో పోటీ మరింత పెరిగే అవకాశం ఉంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















