తెలంగాణ కాంగ్రెస్‌లో కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిల్లీ పర్యటనలో ఈ అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానంతో కీలకంగా చర్చించే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
మంగళవారం ఉదయం సీఎం రేవంత్‌రెడ్డి దిల్లీకి బయలుదేరనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై తెలంగాణకు సంబంధించిన వివిధ అభివృద్ధి, మౌలిక వసతుల ప్రాజెక్టులపై చర్చించనున్నారు. అదే సమయంలో పార్టీ పరమైన అంశాలపైనా ఏఐసీసీ పెద్దలతో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో రేవంత్‌రెడ్డి సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో రాష్ట్ర పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదికతో పాటు మంత్రి కొండా సురేఖ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వ్యవహారంపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇద్దరిపై చర్యలు తీసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించాలన్న అంశంపై సీఎం తన అభిప్రాయాన్ని అధిష్ఠానం ముందు స్పష్టంగా వెల్లడించే అవకాశముందని తెలుస్తోంది.
మంత్రివర్గ విస్తరణ విషయంలో మాత్రం కొంతకాలం వేచి చూసే ధోరణిలో ఉన్నప్పటికీ, సురేఖ విషయంలో మాత్రం ముఖ్యమంత్రి వెనక్కి తగ్గే పరిస్థితి లేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌తోనూ ఈ అంశంపై సీఎం ఇప్పటికే చర్చించినట్లు సమాచారం.
మరోవైపు సురేఖపై కఠిన చర్యలు తీసుకోకుండా చూడాలని ఒకరిద్దరు మంత్రులు, కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిని కోరినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఆమె నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాలేదని సమాచారం. దీంతో రేవంత్‌రెడ్డి దిల్లీ పర్యటనపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది.
అయితే తుది నిర్ణయం కాంగ్రెస్ అధిష్ఠానం వైఖరిపైనే ఆధారపడి ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అధిష్ఠానం ముఖ్యమంత్రిని ఒప్పించే ప్రయత్నం చేస్తే నిర్ణయంలో మార్పు వచ్చే అవకాశం ఉండొచ్చని, లేకుంటే సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
దిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రులతో తెలంగాణకు సంబంధించిన కీలక ప్రాజెక్టులపై సమావేశాలు నిర్వహించనున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు సంబంధించిన అంశాలపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో చర్చించే అవకాశం ఉంది.
అలాగే వరంగల్ మామునూరు విమానాశ్రయానికి సంబంధించిన పురోగతి, కేంద్రం నుంచి అవసరమైన సహకారం వంటి అంశాలపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడుతో సీఎం సమావేశం కానున్నట్లు సమాచారం.
డిసెంబరు 7 నుంచి 9 వరకు ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సదస్సుపైనా కేంద్ర ప్రభుత్వంతో చర్చించనున్నారు. ముఖ్యంగా డిఫెన్స్ రంగానికి చెందిన పలు సంస్థలతో పెట్టుబడులు, ఒప్పందాల నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తోనూ రేవంత్‌రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పార్టీ వ్యవహారాలతో పాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై కేంద్రంతో చర్చలు జరగనున్న నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి దిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















