ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు ఉద్యమబాట పట్టారు. పీఆర్‌టీయూటీఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్కులోని ధర్నాచౌక్‌లో మంగళవారం భారీ మహాధర్నా నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు తరలివచ్చి తమ సమస్యలపై గళమెత్తారు.
పీఆర్‌సీని ప్రకటించాలని, కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం(సీపీఎస్)ను రద్దు చేయాలని, పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయాలని, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం(ఓపీఎస్) అమలు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేశారు.
మహాధర్నాను ఉద్దేశించి ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ప్రభుత్వం గ్రాట్యుటీ తప్ప ప్రత్యేకంగా ఇచ్చేదేముందని ప్రశ్నించారు. ఉద్యోగులు తమ సేవాకాలంలో దాచుకున్న మొత్తాన్నే ప్రభుత్వం చెల్లిస్తోందని వ్యాఖ్యానించారు. పదవీ విరమణ సమయంలో ఒక్కో ఉద్యోగికి రూ.50 లక్షల నుంచి రూ.1.5 కోట్ల వరకు ఇవ్వాల్సి వస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి చెబుతున్నారని, అందులో గ్రాట్యుటీ మినహా మిగిలిన మొత్తం ఉద్యోగుల సొంతంగా దాచుకున్న సొమ్మేనని అన్నారు.
ప్రభుత్వ పాలనకు సంబంధించి కూడా శ్రీపాల్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు. మొత్తం 1,825 రోజుల పాలనలో ఇప్పటికే వెయ్యి రోజులు పూర్తయ్యాయని, ఇక 825 రోజులే మిగిలి ఉన్నాయని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తేనే 2034 వరకు అధికారంలో ఉంటామని చెబుతున్న మాటలు నిజమవుతాయని పేర్కొన్నారు.
పీఆర్‌టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ.. గత మే 2న ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలుకాకపోవడంతోనే మహాధర్నా నిర్వహించాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను ఇకనైనా పరిష్కరించాలని కోరారు.
మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న సంఘం పీఆర్‌టీయూటీఎస్సేనని అన్నారు. ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.
పీఆర్‌టీయూటీఎస్ ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్ మాట్లాడుతూ.. మహిళా ఉపాధ్యాయులకు 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్‌ను ఎలాంటి ఆర్థిక భారం లేకుండా తమ మొత్తం సర్వీసులో వినియోగించుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగుల కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ వెసులుబాటు కల్పించాలని కోరారు.
పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పేరి వెంకట్‌రెడ్డితో పాటు వంగా మహేందర్‌రెడ్డి, గుండు లక్ష్మణ్, గీత, టీటీజాక్ నాయకులు కటకం రమేశ్, గిరిధర్‌గౌడ్, అబ్దుల్లా, జగదీశ్ తదితరులు మహాధర్నాలో ప్రసంగించారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఉపాధ్యాయులు ఉదయం 10 గంటలకే ధర్నాచౌక్‌కు చేరుకున్నారు. పలువురు ఉపాధ్యాయులు నీలం రంగు టీషర్టులు ధరించి నిరసనలో పాల్గొన్నారు. మహిళా ఉపాధ్యాయులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ధర్నాచౌక్ పరిసరాల్లో భారీగా ఉపాధ్యాయులు చేరడంతో కొందరు ఇందిరాపార్కులో కూర్చొని నేతల ప్రసంగాలను విన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం సత్వరం పరిష్కరించాలని వారు కోరారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















