తెలంగాణ యువతను అంతర్జాతీయ పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. యువతకు ఆధునిక నైపుణ్యాలు అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడంతో పాటు ఐటీఐలను అత్యాధునిక సాంకేతిక శిక్షణ కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.
జర్మనీలోని తురింగియా రాష్ట్ర మినిస్టర్ ప్రెసిడెంట్ మారియో వొయిక్ట్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైంది. ఈ సందర్భంగా టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌లు, లైఫ్ సైన్సెస్ రంగాల్లో పరస్పర సహకారం కోసం తెలంగాణ ప్రభుత్వం, తురింగియా రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో అవసరమయ్యే నైపుణ్యాలతో తెలంగాణ యువతను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. స్కిల్స్ యూనివర్సిటీ, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు, పాలిటెక్నిక్ కళాశాలల్లో బోధన విధానాలను ఆధునికీకరించేందుకు జర్మనీ సహకారం అందించాలని కోరారు. యువతకు జర్మన్ భాషా శిక్షణ విస్తరించాలని కూడా సూచించారు.
దీనికి స్పందించిన తురింగియా రాష్ట్ర ముఖ్యమంత్రి మారియో వొయిక్ట్.. తెలంగాణ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను రూపొందించేందుకు తమ విద్యాసంస్థలు, పరిశ్రమలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. జర్మనీలోని సెమీకండక్టర్ కంపెనీల ప్రతినిధి బృందాన్ని తెలంగాణకు పంపించి పెట్టుబడి అవకాశాలపై చర్చలు జరుపుతామని వెల్లడించారు.
ఇక కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ తెలంగాణ-జర్మనీల మధ్య బలమైన భాగస్వామ్యం ద్వారా యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమల రంగాల్లో సమన్వయం కోసం రెండు ప్రాంతాల మధ్య ప్రత్యేక కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















