అనారోగ్యంతో ఉన్న భార్య చికిత్సకు ఆయన తన శక్తికి మించి ఖర్చు చేశారు.. వైద్యానికి మరింత డబ్బు వెచ్చించినా బతుకుతుందో లేదో చెప్పలేమని వైద్యులు అనడంతో కుంగిపోయారు. భార్య చనిపోతే ఇద్దరు బిడ్డలను తాను ఉన్నతంగా పెంచలేమోనన్న భయం ఆయన్ను పదేళ్లుగా వెంటాడింది. దీంతో ఆ దంపతులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. అల్లారుముద్దుగా సాకిన బిడ్డలకు విషమిచ్చి తర్వాత తల్లీ తాగింది.. తండ్రి ఉరేసుకున్నారు. అంత్యక్రియలకు తమ డబ్బులే వినియోగించాలని ఓ కాగితంపై రాసి ఇంటిలోని టీవీకి అతికించారు. అందులో ఏటీఎం పిన్ నంబరు రాశారు. చిత్తూరు జిల్లాలోని చిత్తూరు గ్రామీణ మండలం బంగారెడ్డిపల్లెలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పలమనేరు మండలం మండిపేట కోటూరుకు చెందిన దామోదరం (35) బాల్యంలోనే తల్లిని కోల్పోయారు. తండ్రి వేరే ప్రాంతానికి వెళ్లిపోవడంతో తన అక్క ఊరు బంగారెడ్డిపల్లెకు వచ్చారు. బావ గోపితో కలిసి మేస్త్రీగా పనిచేస్తున్నారు.
గంగాధరనెల్లూరు మండలం అప్పిరెడ్డికండ్రిగకు చెందిన నిర్మల (28)ను దామోదరం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి దిలీప్ (12), శ్రీవిద్య (10) సంతానం. నిర్మల పదేళ్ల నుంచి బ్రెయిన్ స్ట్రోక్‌తో బాధపడుతున్నారు. ఏడాదిగా ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. అప్పటికే అప్పులు పెరిగిపోయాయి. సీఎం సహాయనిధి నుంచి రూ.లక్ష వచ్చినా.. సరిపోలేదు. ఇటీవల చెన్నైలోని ఓ ఆసుపత్రికి వెళ్లగా రూ.7 లక్షలు ఖర్చవుతుందని, అయినా కోలుకుంటారనే నమ్మకం లేదని వైద్యులు చెప్పారు. అప్పటి నుంచి భార్యాభర్తలు కుంగిపోయారు. తాము చనిపోతామని దామోదరం తరచూ అక్కకు చెప్పి, బాధపడేవారు. తాము మరణిస్తే.. బిడ్డలు అనాథలవ్వకూడదని, వారినీ తమతో పాటు తీసుకెళ్లిపోవాలని దంపతులు ఆదివారం నిర్ణయించుకున్నారు. రాత్రి అక్క చిన్నతో కలిసి నలుగురూ భోజనం చేశారు. అనంతరం తమ ఇంటికి వెళ్లి, ఇద్దరు చిన్నారులకు నిర్మల విషం తాగించింది. తర్వాత తానూ తాగింది. ముగ్గురూ మరణించారని నిర్ధారించుకున్న తర్వాత దామోదరం ఉరేసుకున్నారు. సోమవారం ఉదయం తలుపులు తెరవకపోవడంతో చిన్న వచ్చింది. కిటికీలో నుంచి చూడగా ఉరికి వేలాడుతున్న తమ్ముడు కనిపించాడు. చుట్టుపక్కల వారితో కలిసి లోపలికి వెళ్లి చూడగా.. తల్లీ ఇద్దరు పిల్లలు పడకగదిలో విగతజీవులై ఉన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. సాయంత్రం నలుగురికి అంత్యక్రియలు చేశారు. బీఎన్‌ఆర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















