గిరిజనుల సంక్షేమం, ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అల్లూరి జిల్లా అరకు లోయ మండలం గన్నెలలో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు కీలక ప్రకటనలు చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఉద్యోగాలు గిరిజనులకే దక్కేలా అందరికీ ఆమోదయోగ్యమైన కొత్త జీవోను వీలైనంత త్వరగా తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
గిరిజనుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని సీఎం చెప్పారు. మరో మూడు నెలల్లో ఏజెన్సీ ప్రాంతంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మెరుగుపరచడంతో పాటు అవసరమైన వైద్య పరీక్షలు అక్కడే నిర్వహించేలా సదుపాయాలు కల్పిస్తామన్నారు. ‘సంజీవని’ యాప్ ద్వారా ప్రజలు తమ ఆరోగ్య సమాచారాన్ని ఫోన్‌లోనే తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఏజెన్సీ ప్రాంతంలో కనెక్టివిటీని మరింత పెంచేందుకు అదనపు సెల్‌టవర్లను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. అన్ని గ్రామాలకు వీలైనంత త్వరగా రహదారి సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. గిరిజనులకు 50 ఏళ్లకే పింఛన్లు అందిస్తున్నామని, అయితే వారి సంక్షేమం విషయంలో తాను పూర్తిగా సంతృప్తి చెందలేదన్నారు.
అరకు కాఫీకి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొచ్చామని, ఏజెన్సీ ప్రజలకు అరకు కాఫీతో పాటు మిరియాల సాగు ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. గిరిజనుల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.
అనంతరం గన్నెల పంచాయతీ పరిధిలోని ఆర్.కె.నగర్‌లో సీఎం చంద్రబాబు గ్రామస్థులతో ముఖాముఖి నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు, వైద్య సేవలు, ఇతర సౌకర్యాలు అందుతున్న తీరుపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గర్భిణితో మాట్లాడి వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు.
ఆర్.కె.నగర్‌లో 47 ఇళ్లు, 189 మంది జనాభా ఉన్నట్లు అధికారులు వివరించగా.. జనాభా నిర్వహణపై సీఎం ఆరా తీశారు. ఓ మహిళ తన కుమార్తె నీట్ శిక్షణ పొందుతోందని చెప్పడంతో చంద్రబాబు అభినందించారు. పిల్లలను ఉన్నతంగా చదివించి మంచి భవిష్యత్తు అందించాలని సూచించారు.
మహిళలతో మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు కోసం ప్రస్తుతం ఏం చేస్తున్నారని, భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు. ఆర్.కె.నగర్‌లో మొత్తం 16 మందితో మాట్లాడిన సీఎం.. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి చేరుతున్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకున్నారు. సీఎం రాక సందర్భంగా గ్రామంలోని మహిళలు, చిన్నారులు సంప్రదాయ థింసా నృత్యంతో ఘన స్వాగతం పలికారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















