అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జనరిక్ ఔషధాల దిగుమతులపై భారీ సుంకాలు విధించేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి రెండేళ్లపాటు జనరిక్ మందుల దిగుమతులపై ప్రస్తుతం ఉన్న సున్నా శాతం పన్ను విధానం కొనసాగుతుందని, 2028 ఆగస్టు నుంచి జనరిక్ ఔషధాలపై 100 శాతం సుంకం విధిస్తామని ట్రంప్ తెలిపారు. 2029 ఆగస్టు నుంచి ఈ సుంకాన్ని 200 శాతానికి పెంచనున్నట్లు వెల్లడించారు.
అమెరికాలోనే ఔషధాల తయారీని ప్రోత్సహించడమే ఈ నిర్ణయం లక్ష్యమని ట్రంప్ స్పష్టం చేశారు. ఈలోగా అమెరికాలో తయారీ ప్లాంట్లు, అవసరమైన పరికరాలను ఏర్పాటు చేసి అక్కడే ఔషధాలను ఉత్పత్తి చేయాలని సూచించారు. లేనిపక్షంలో భారీ సుంకాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అయితే ఇప్పటికే పేటెంట్ పొందిన, బ్రాండెడ్, వినూత్న ఔషధాల విషయంలో ఎలాంటి మార్పు ఉండదని తెలిపారు.
జనరిక్ ఔషధాల తయారీలో భారత్ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ట్రంప్ నిర్ణయం భారత ఫార్మా రంగంపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న చర్చ మొదలైంది. అమెరికాలో వినియోగించే జనరిక్ మందుల్లో యాంటీబయాటిక్స్, స్టాటిన్స్ వంటి అనేక ఔషధాలకు భారత కంపెనీలు ప్రధాన సరఫరాదారులుగా ఉన్నాయి. భారత్ నుంచి అమెరికాకు భారీగా ఔషధ ఎగుమతులు జరుగుతున్న నేపథ్యంలో కొత్త సుంకాలు అమలైతే భారత ఫార్మా కంపెనీలపై అదనపు భారం పడే అవకాశం ఉంది.
గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ నివేదిక ప్రకారం 2025లో భారత్ చేసిన మొత్తం ఔషధ ఎగుమతుల్లో గణనీయమైన వాటా అమెరికా మార్కెట్‌కే చేరింది. రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్, అంటువ్యాధులు, మానసిక రుగ్మతలకు ఉపయోగించే కీలక జనరిక్ ఔషధాల సరఫరాలో భారత్ ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది.
ట్రంప్ సుంకాలు అమలైతే అమెరికాలో ఔషధాల ధరలు పెరగడంతో పాటు కొన్ని కీలక మందులకు కొరత ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, భారత జనరిక్ ఔషధాలు బ్రాండెడ్ మందులతో పోలిస్తే తక్కువ ధరకు లభిస్తుండటంతో భారీ సుంకాలు విధించినప్పటికీ అవి పోటీని తట్టుకునే అవకాశం ఉందన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే సుంకాల భారం చివరకు అమెరికా ఆరోగ్య సంరక్షణ సంస్థలు, బీమా కంపెనీలు, రోగులపై పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ట్రంప్ ప్రకటన ప్రభావం భారత స్టాక్ మార్కెట్‌లోని ఫార్మా షేర్లపైనా కనిపించింది. లుపిన్, నాట్కో ఫార్మా, అరబిందో ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, గ్లెన్‌మార్క్ ఫార్మా, ఆల్కెమ్, సిప్లా, సన్‌ఫార్మా, బయోకాన్ వంటి ఫార్మా కంపెనీల షేర్లు ఒత్తిడికి లోనయ్యాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















