116 ఏళ్ల వయసులోనూ అచంచలమైన భక్తితో కాలినడకన తిరుమలకు చేరుకున్న నవనీతమ్మకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ప్రత్యేక గౌరవం కల్పించింది. తితిదే ఛైర్మన్ బీ ఆర్ నాయుడు చొరవతో నవనీతమ్మతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం ఏర్పాటు చేశారు. ఆలయ అధికారులు వృద్ధురాలిని స్వయంగా తీసుకెళ్లి సౌకర్యవంతంగా దర్శనం చేయించారు.
దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు నవనీతమ్మకు వేదాశీర్వచనం అందించారు. తితిదే ఈవో ముద్దాడ రవిచంద్ర ఆమెకు పట్టువస్త్రం కప్పి, శ్రీవారి తీర్థం, ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆమె కాలికి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం అక్కడున్న భక్తులను భావోద్వేగానికి గురిచేసింది. వృద్ధుల పట్ల గౌరవానికి ఇది నిదర్శనంగా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు.
శనివారం అలిపిరి నడకమార్గం ద్వారా తిరుమలకు చేరుకున్న నవనీతమ్మ వీడియోను భక్తులు సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది వేగంగా వైరల్ అయింది. 116 ఏళ్ల వయసులోనూ కాలినడకన శ్రీవారి దర్శనానికి రావడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె భక్తిని ప్రశంసిస్తూ వేలాది మంది సోషల్ మీడియాలో స్పందించారు.
వీడియో వైరల్ అయిన తర్వాత తొలుత నవనీతమ్మ వివరాలు స్పష్టంగా తెలియకపోవడంతో ఆమె కర్ణాటకకు చెందినవారని ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన తితిదే ఛైర్మన్ బీ ఆర్ నాయుడు, వృద్ధురాలి వివరాలు తెలిసిన వారు తన కార్యాలయాన్ని సంప్రదించాలని ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. వెంటనే తితిదే విజిలెన్స్ సిబ్బంది రంగంలోకి దిగి ఆమె వివరాలను సేకరించారు.
విచారణలో నవనీతమ్మ తమిళనాడుకు చెందినవారని, ప్రస్తుతం తిరుపతి జీవకోనలోని బంధువుల వద్ద ఉంటున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సమాచారం అందిన వెంటనే తితిదే ఛైర్మన్ మరోసారి స్పందించి, నవనీతమ్మతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు వీఐపీ బ్రేక్ దర్శనం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేసి, వృద్ధురాలికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం పూర్తిచేశారు.
116 ఏళ్ల వయసులోనూ నవనీతమ్మ చూపిన భక్తి, సంకల్పం భక్తులకు ఆదర్శంగా నిలిచిందని తితిదే అధికారులు పేర్కొన్నారు. ఆమెకు కల్పించిన ప్రత్యేక దర్శనం, సత్కారం ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది. భక్తి ముందు వయసు అడ్డుకాదని నవనీతమ్మ మరోసారి నిరూపించారని భక్తులు కొనియాడుతున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















