రాష్ట్రంలోనే అత్యధికంగా వరి సాగవుతున్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో యాసంగి పంట కోతలు మొదలయ్యాయి. అధికార యంత్రాంగం అందుకు తగినట్లుగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదు. మరోవైపు అకాల వర్షాలు కురుస్తుండటంతో చేతికొచ్చిన ధాన్యం తడుస్తుందనే భయాందోళనతో రైతులు మిల్లుల బాట పట్టారు. ఇదే అదునుగా మిల్లర్లు నచ్చిన ధర చెబుతుండటంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఎదురవుతోంది. 20 రోజుల క్రితం రైతులను ఆకర్షించేలా క్వింటాలు (సన్నాలు)కు రూ.2,700 వరకు ధరపెట్టి కొనుగోలుచేసిన మిల్లర్లు కుమ్మక్కై క్రమంగా ధరలు తగ్గిస్తున్నారు. నాలుగు రోజుల కిందట క్వింటాలుపై ఏకంగా రూ.350 వరకు తగ్గించారు. ఆదివారం కొంత పెంచి రూ.2,600 చొప్పున కొనుగోలు చేసినా.. సోమవారం ఎక్కువమంది రైతులు రావడంతో కొర్రీలు పెడుతూ రూ.2,450కి కొనుగోలు చేశారు. ఓవైపు దిగుబడులు తగ్గి ఇబ్బందులు పడుతుంటే మిల్లర్లు తమ కష్టాన్ని దోచుకుంటున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- ఉమ్మడి నల్గొండ జిల్లాలో యాసంగిలో 13.56 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. 32.92 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో 17.29 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలనేది సర్కారు లక్ష్యం. మిగిలిన ధాన్యం మిల్లులకు, ఇతర అవసరాలకు వినియోగిస్తారని అంచనా.
- ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా మిర్యాలగూడ ప్రాంతంలోనే మిల్లులున్నాయి. ప్రధానంగా సాగర్ ఆయకట్టులో 40 శాతం వరి కోతలు పూర్తయ్యాయి. మొదట్లో అధిక ధర నిర్ణయించిన మిల్లర్లు ఇప్పుడు ‘మేం చెప్పిందే ధర’ అంటున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ రైతు హుజూర్‌నగర్ మిల్లుల్లో ఆశించిన ధర వస్తుందని 56 క్వింటాళ్ల ధాన్యం తీసుకువెళ్లారు. అక్కడ క్వింటాలు ధర రూ.2,380 చెప్పారు. కొంత ధర పెంచమని వేడుకున్నా ప్రయోజనం లేకపోవడంతో చివరికి వారుచెప్పిన ధరకే అమ్మినట్లు ఆ రైతు వాపోయారు.
కేంద్రాలు ప్రారంభిస్తే..
ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాదాపు 1,066 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలనేది లక్ష్యం. ఇంతవరకు ఆరు వరకు మాత్రమే ప్రారంభమయ్యాయి. యాదాద్రితో పోలిస్తే నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అధికంగా సన్న రకాలను సాగు చేస్తున్నారు. హుజూర్‌నగర్, మిర్యాలగూడ ప్రాంతాల్లోని మిల్లుల్లో అమ్ముతున్న ధాన్యంలో ఎక్కువగా సన్న రకాలే. సకాలంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తే సన్నాలను అక్కడే అమ్ముతారు. కారణం తేమశాతం 17 ఉంటే మద్దతుధర క్వింటాలుకు రూ.2,389, ప్రభుత్వం ఇచ్చే బోనస్ రూ.500 కలిపి రూ.2,889 రైతుకు గిట్టుబాటు అవుతుంది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని అన్నదాతలు కోరుతున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















