రాష్ట్రంలో జనాభా సమతుల్యతను పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ‘జనాభా నిర్వహణ విధానం’పై ముసాయిదా విడుదల చేస్తూ పలు ప్రోత్సాహకాలను ప్రకటించారు. ఇకపై రెండో బిడ్డ నుంచి ఒక్కో బిడ్డకు రూ.25 వేల ప్రోత్సాహకం ఇవ్వడమే కాకుండా, ఆ పిల్లలకు 18 సంవత్సరాల వరకు ఉచిత విద్య అందిస్తామని తెలిపారు.
ముందు ఒకప్పుడు “ఒకరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దు” అనే నినాదం ఉండేదని, ఇప్పుడు పరిస్థితులు మారాయని సీఎం అన్నారు. ప్రస్తుతం “ఒకరు వద్దు.. ఇద్దరు ఓకే.. ముగ్గురు ముద్దు” అనే విధంగా ప్రజలు ఆలోచించాలని సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సంతానోత్పత్తి రేటు 1.5ని 2.1కి పెంచాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ పాలసీపై నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చలు నిర్వహించి, అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఏప్రిల్ 1 నుంచి అమలు ప్రారంభిస్తామని వెల్లడించారు.
ముఖ్య నిర్ణయాలు
రెండో బిడ్డ నుంచి ప్రతి బిడ్డకు రూ.25,000 ప్రోత్సాహకం
పిల్లలకు 18 ఏళ్ల వరకు ఉచిత విద్య
ఎక్కువ పిల్లలు ఉన్న కుటుంబాలకు పోషకాహార సహాయం – ‘పోషణ్ శిక్ష సురక్ష’ ప్యాకేజీ
ప్రభుత్వోద్యోగులకు పేరెంటింగ్ కోసం అదనపు సెలవులు
రెండో బిడ్డకు ఒక నెల
మూడో బిడ్డకు మరో నెల సెలవు
ప్రస్తుతం ఉన్న రూ.2.5 లక్షల సార్వత్రిక ఆరోగ్య బీమా కొనసాగింపు
పిల్లలు లేని దంపతులకు ఐవీఎఫ్ సేవలు
రాష్ట్రంలో సంతానోత్పత్తి వయస్సులో ఉన్న దంపతులు సుమారు 90 లక్షల మంది ఉన్నారని, అందులో 11.7 లక్షల మందికి పిల్లలు లేరని సీఎం తెలిపారు. ఇలాంటి పేద దంపతులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఉచిత ఐవీఎఫ్ చికిత్స అందిస్తామని ప్రకటించారు.
కుటుంబ విధానాలపై సమీక్ష
కుటుంబాలకు ఇచ్చే ప్రభుత్వ ప్రయోజనాలపై కూడా త్వరలో సమీక్ష చేపడతామని సీఎం తెలిపారు. ప్రస్తుతం ఒక కుటుంబానికి ఒక రేషన్ కార్డు, ఒక పింఛన్, ఒక ఇల్లు అనే విధానం వల్ల కుటుంబాలు విడిపోతున్నాయని చెప్పారు. భవిష్యత్తులో కుటుంబ సభ్యుల సంఖ్యకు అనుగుణంగా ప్రయోజనాలు అందించేవిధంగా మార్పులు తీసుకువస్తామని తెలిపారు.
ఆరోగ్య, సామాజిక చర్యలు
రాష్ట్రంలో జరుగుతున్న 67.5% సిజేరియన్ ప్రసవాలను తగ్గించే చర్యలు
బాల్య గర్భధారణ నియంత్రణకు ప్రత్యేక కార్యక్రమాలు
ప్రతి జిల్లాలో వృద్ధుల సంరక్షణకు ప్రత్యేక వార్డులు
పదవీ విరమణకు ముందు ఉద్యోగులకు 15 రోజుల వెల్‌నెస్ సెలవులు, రూ.50 వేల ఆరోగ్య నిధి
సిల్వర్ స్కిల్స్ రిజిస్ట్రీ ద్వారా పదవీ విరమణ చేసిన నిపుణులను మెంటార్లుగా ఉపయోగించడం
సమాజం ఆరోగ్యంగా, సంపన్నంగా, సంతోషంగా ఉండాలంటే జనాభా నిర్వహణ కీలకం అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారిగా ఇలాంటి సమగ్ర జనాభా విధానాన్ని తీసుకువస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















